పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కథా ప్రారంభము

  •  
  •  
  •  

1-35-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు "సత్యంపరంధీమహి"యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామబ్రహ్మ స్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి, యీ పురాణంబు శ్రీమహాభాగవతం బన నొప్పుచుండు.
భాగవతము - గాయత్రి
గాయత్రి - పట్టిక
గాయత్రి - యంత్రము

టీకా:

ఇట్లు = ఈవిధంగా; సత్యంపరంధీమహి = సత్యంపరంధీమహి {సత్యంపరంధీమహి - జ్ఞాని సత్యమే ఉత్కృష్ట మైనది}; అను = అని పలికే; గాయత్రీ = గాయత్రీ మంత్రము యొక్క {గాయత్రి - 1) పాఠ్యంతరాలు గాయత్త్రీ, గాయత్రీమంత్రము; ద్విజులు సంధ్యోపాసనా సమయమున జపించు ఒకానొక మంత్రము; దీనికి ఋషి విశ్వామిత్రుడు, దేవత సవిత; దీనికి 3 పాదములును పాదమునకు 8 అక్షరములును ఉండును, ,వ్యు. (అ) త్త్రైజ - పాలనే - గాయతం త్రాయతే - గాయత్+త్త్రై+క, కృప్ర., తనను జపించు వానిని కాపాడునది, (శబ్దరత్నాకరము) (ఆ) గాయతాం త్రాయతే యస్మా ర్గాయత్రీ తేనకధ్యతే (ఆంధ్రవాచస్పతముు) 2) దేవతా విశేషము,}; ప్రారంభమున = మూలములో; గాయత్రీ = గాయత్రి అను; నామ = పేరుగల; బ్రహ్మ = సర్వాంతర్యామి యొక్క; స్వరూపంబు = స్వరూపము; ఐ = అయి; మత్స్యపురాణంబు = శ్రీ మత్స్య మహాపురాణము; లోనన్ = లోనున్న; గాయత్రిని = గాయత్రిని; అధికరించి = అధిగమించి; ధర్మ = ధర్మముయొక్క; విస్తరంబును = విస్తారమైన వివరణను; వృత్రా = వృతుడు అను; అసుర = అసురుని; వధంబును = సంహారమును; ఎందున్ = ఎందులోనైతే; చెప్పంబడున్ = చెప్పబడుతుందో; అదియ = అదే; భాగవతంబు = భాగవతము; అని = అని; పలుకుటన్ = పలుకుటను; చేసి = చేసి; ఈ = ఈ; పురాణంబు = పురాణము; శ్రీ = శ్రీ; మహా = గొప్ప; భాగవతంబు = భాగవతము; అనన్ = అనుటకు; ఒప్పుచు = తగి; ఉండున్ = ఉండును.

భావము:

"సత్యం పరం ధీమహి” పరమమైన సత్యమునే ధ్యానము చేసెదము అనే గాయత్రీ మహామంత్రంతో ఆరంభించటం వల్ల గాయత్రి పరదేవతాస్వరూప మైనది. గాయత్రిని అతిశయింపజేస్తూ, ధర్మ ప్రస్తారాన్నీ, వృత్రాసుర సంహారాన్నీ అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణంలో చెప్పి ఉండటంవల్ల ఈ మహా గ్రంథం శ్రీ మహాభాగవతం అని ప్రసిద్ధి గాంచింది.
గమనిక :~ గాయత్రీనామబ్రహ్మ అని ప్రయోగించడంతో, భాగవతగ్రంథరూప పరబ్రహ్మ అని చెప్పబడే శ్రీమద్భాగవత పురాణానికిని, గాయత్రికిని అబేధం సూచింపబడుతోంది