పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శుకముని యాగమనంబు

  •  
  •  
  •  

1-521-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వ్యాసనందనుండైన శుకుం డరుగుదెంచిన నందలి మునీంద్రు లమ్మహానుభావుని ప్రభావంబు లెఱుంగుదురు కావున నిజాసనంబులు డిగ్గి ప్రత్యుత్థానంబు సేసిరి; పాండవపౌత్రుండు నా యోగిజనశిఖామణికి నతిథి సత్కారంబులు గావించి దండప్రణామంబుసేసి పూజించె; మఱియు గ్రహ నక్షత్ర తారకా మధ్యంబునం దేజరిల్లు రాకాసుధాకరుండునుం బోలె బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి మధ్యంబున గూర్చుండి విరాజమానుండైన శుకయోగీంద్రుం గనుంగొని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వ్యాస = వ్యాసుని; నందనుండు = కుమారుడు; ఐన = అయినట్టి; శుకుండు = శుకుడు; అరుగుదెంచినన్ = వచ్చిన; అందలి = అక్కడి; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; ఆ = ఆ; మహా = గొప్ప; అనుభావుని = అనుభవములు కలవాని; ప్రభావంబులు = గొప్పతనములు; ఎఱుంగుదురు = తెలిసినవారు; కావున = అగుటవలన; నిజ = తమ; ఆసనంబులు = ఆసనములు; డిగ్గి = దిగి; ప్రతి = ఎదురేగుటకు; ఉత్థానంబున్ = లేచుట; లేచి ఎదురేగుటలు; చేసిరి = చేసిరి; పాండవపౌత్రుండున్ = పరీక్షిన్మహారాజును; ఆ = ఆ; యోగి = యోగులగు; జన = జనులలో; శిఖా = శిఖలోని; మణి = రత్నము వంటి వాని; ఉత్కృష్టుని; కిన్ = కి; అతిథి = అతిథి; సత్కారంబులు = గౌరవములు; కావించి = పూర్తిచేసి; దండప్రణామంబు = సాష్టాంగ నమస్కారము {దండప్రణామము - సాష్టాగ నమస్కారము, దండము వలె భూమిపై పడి నమస్కరించుట}; చేసి = చేసి; పూజించెన్ = పూజించెను; మఱియున్ = ఇంకనూ; గ్రహ = గ్రహములు; నక్షత్ర = నక్షత్రములు {నక్షత్రములు - అశ్విని ఆది నక్షత్రములు (తారకల సమూహములు) ఇవి 27}; తారక = తారకలు; మధ్యంబునన్ = మధ్యలో; తేజరిల్లు = ప్రకాశించుచున్న; రాకా = పౌర్ణమి నాటి; సుధాకరుండునున్ = చంద్రుని {సుధాకరుడు - సుధ (వెన్నెల)ని ఆకరుడు (కలుగ జేయువాడు), సుధా (అముతముతో కూడిన) కరుడు (కిరణములు కలవాడు), చంద్రుడు}; పోలెన్ = వలె; బ్రహ్మర్షి = బ్రహ్మర్షులు; దేవర్షి = దేవర్షులు; రాజర్షి = రాజర్షులు; మధ్యంబునన్ = మధ్యలో; గూర్చుండి = కూర్చుండి; విరాజమానుండు = విరాజిల్లుతున్నవాడు; ఐన = అయినట్టి; శుక = శుకుడను; యోగి = యోగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; కనుంగొని = చూసి.

భావము:

ఈ విధంగా వేదవ్యాస నందనుడైన శుకయోగీంద్రుడు అక్కడకు రాగా ఆ మహానుభావుని మహత్త్వం తెలిసిన అక్కడి మునివర్యులంతా తమతమ ఆసనాల నుంచి లేచి ఎదురువచ్చారు. పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగికి అతిథి సత్కారాలు కావించాడు. సాష్టాంగ దండప్రణామం చేసి పూజించాడు. గ్రహనక్షత్ర తారకా సమూహం నడుమ విరాజిల్లే సంపూర్ణ పూర్ణిమా చంద్రుడులాగా బ్రహ్మర్షి దేవర్షి మధ్యలో కూర్చుండి విరాజిల్లే శుకయోగీంద్రుని చూచి ...