పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

  •  
  •  
  •  

1-508-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని తనకు మీఁద నయ్యెడి జన్మాంతరంబు లందును హరిపాదభక్తి సౌజన్యంబులు సంధిల్లుం గాత మని, గంగాతరంగిణీ దక్షిణకూలంబునం బూర్వాగ్ర దర్భాసనంబున నుత్తరాభిముఖుండై యుపవేశించి, జనమేజయు రప్పించి, రాజ్యభారంబు సమర్పించి, యత్నంబు సంసార బంధంబునకుం దప్పించి, చిత్తంబు హరికి నొప్పించి, పరమ భాగవతుండైన పాండవపౌత్రుండు ప్రాయోపవిష్టుండై యున్న సమయంబున.

టీకా:

అని = అని; తన = తన; కున్ = కి; మీఁదన్ = భవిష్యత్తులో; అయ్యెడి = కలిగెడు; జన్మ = జన్మల; అంతరంబులు = సమయములు - జీవితకాలముల; అందునున్ = లోపల; హరి = భగవంతుని; పాద = పాదముల మీద; భక్తి = భక్తి; సౌజన్యంబులు = సుజనత్వములు - సత్ప్రవర్తనలు; సంధిల్లున్ = కలుగును; కాత = కాక; అని = అని; గంగా = గంగ అను; తరంగిణి = నది యొక్క; దక్షిణ = దక్షిణపు; కూలంబునన్ = ఒడ్డునందు; తీరమునందు; పూర్వ = తూర్పవైపునకు; అగ్ర = కొసలు ఉండునవి యైన; దర్భ = దర్భలతో కూర్చిన; ఆసనంబునన్ = ఆసనమున; పీఠము మీద; ఉత్తర = ఉత్తరపు వైపునకు; అభి = ఎదురుగా; ముఖుండు = ముఖముకలవాడు; తిరిగినవాడు; ఐ = అయి; ఉపవేశించి = కూర్చుండి; జనమేజయు = జనమేజయుని; రప్పించి = పిలిపించి; రాజ్య = రాజ్యము యొక్క; భారంబున్ = భారమును; సమర్పించి = అప్పజెప్పి; యత్నంబున్ = ప్రయత్నమును; సంసార = సంసారము యొక్క; బంధంబున = బంధముల; కున్ = కు; తప్పించి = తప్పించి; చిత్తంబున్ = మనస్సును; హరి = భగవంతుని; కిన్ = కి; ఒప్పించి = అర్పించి; పరమ = ఉత్కృష్టమైన; భాగవతుండు = భాగవత మార్గనుయాయి; ఐన = అయినట్టి; పాండవపౌత్రుండు = పరీక్షిత్తు {పాండవపౌత్రుడు - పాండవుల యొక్క మనుమడు, పరీక్షిన్మహారాజు}; ప్రాయోపవిష్టుండు = ప్రాయోపవిష్టుడు {ప్రాయోపవిష్టుడు - ఆహారాదులు మాని మరణమునకు ఎదురుచూచుట అను నిష్ఠలో ఉన్నవాడు}; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; సమయంబున = సమయమున.

భావము:

అని రాబోయే జన్మ జన్మాలకూ భగవత్ భక్తి సౌభాగ్యం తనకు ప్రాప్తించాలని ప్రార్థించాడు. గంగాతరంగిణి దక్షిణతీరంలో తూర్పుకొనలు ఉండేటట్లుగా పరచిన దర్భాసనం మీద ఉత్తరాభిముఖుడై కూర్చున్నాడు. తనయుడైన జనమేజయుణ్ణి రప్పించి రాజ్యభారం అప్పగించాడు. తన చిత్తాన్ని సంసారబంధాలనుంచి నివృత్తం చేసి పరమేశ్వరాయత్తం కావించాడు, ఈ విధంగా భాగవతోత్తముడైన పాండవ పౌత్రుడు ప్రాయోపవిష్టుడై ఉన్న శుభ సమయంలో.