పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

  •  
  •  
  •  

1-499-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పాండవపౌత్రుండు ముకుంద చరణారవింద వందనానందకందాయమాన మానసుండై విష్ణుపదీతీరంబునఁ బ్రాయోపవేశంబున నుండుట విని, సకలలోక పావనమూర్తులు మహానుభావులు నగుచుఁ దీర్థంబులకుం దీర్థత్వంబు లొసంగ సమర్థులైన యత్రి, విశ్వామిత్ర, మైత్రేయ, భృగు, వసిష్ఠ, పరాశర, చ్యవన, భరద్వాజ, పరశురామ, దేవల, గౌతమ, కశ్యప, కవష, కణ్వ, కలశసంభవ, వ్యాస, పర్వత, నారద ప్రముఖులైన బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షిపుంగవులునుఁ; గాండర్షులయిన యరుణాదులును; మఱియు నానాగోత్రసంజాతులైన మునులును; శిష్య ప్రశిష్య సమేతులై చనుదెంచిన, వారలకుఁ బ్రత్యుత్థానంబు సేసి, పూజించి, దండప్రణామంబు లాచరించి, కూర్చుండ నియోగించి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పాండవ = పాండవుల యొక్క; పౌత్రుండు = మనుమడు; ముకుంద = విష్ణుమూర్తి యొక్క; చరణ = పాదములు అను; అరవింద = పద్మములకు; వందన = నమస్కరించుట వలన కలిగిన; ఆనంద = ఆనందముతో; కందాయ = మేఘమే; మాన = అగుచున్న; మానసుండు = మానసము కలవాడు; ఐ = అయి; విష్ణుపదీ = గంగానది {విష్ణుపది - విష్ణుమూర్తి పాదమున పుట్టినది, గంగ}; తీరంబునన్ = ఒడ్డు నందు; ప్రాయోపవేశంబున = ప్రాయోపవేశము {ప్రాయోపవేశము - అన్నపానాదులు విడిచి మరణమున కెదురు చూచుచుండు నిష్ఠ, ఆమరణనిరాహారదీక్ష}; ఉండుట = ఉండుట; విని = విని; సకల = సమస్త; లోక = లోకములందలి; పావన = పవిత్రము కలుగ చేయగల; మూర్తులు = రూపము కలవారు; మహా = గొప్ప; అనుభావులు = అనుభవము కలవారు; అగుచున్ = అగుచు; తీర్థంబుల = పుణ్యమును ఒసగు క్షేత్రముల; కున్ = కు; తీర్థత్వంబులు = పుణ్యము ఒసగగల స్వభావములను; ఒసంగ = కలిగింపగల; సమర్థులు = సామర్థ్యము కలవారు; ఐన = అయినట్టి; అత్రి = అత్రి; విశ్వామిత్ర = విశ్వామిత్రుడు; మైత్రేయ = మైత్రేయుడు; భృగు = భృగువు; వసిష్ఠ = వసిష్టుడు; పరాశర = పరాశరుడు; చ్యవన = చ్యవనుడు; భరద్వాజ = భరద్వాజుడు; పరశురామ = పరశురాముడు; దేవల = దేవలుడు; గౌతమ = గౌతముడు; కశ్యప = కశ్యపుడు; కణ్వ = కణ్వుడు; కలశసంభవ = కలశసంభవుడు; వ్యాస = వ్యాసుడు; పర్వత = పర్వతుడు; నారద = నారదుడు; ప్రముఖులు = మొదలగు ప్రసిద్ధులు; ఐన = అయినట్టి; బ్రహ్మర్షి = బ్రహ్మర్షులు; దేవర్షి = దేవర్షులు; రాజర్షి = రాజర్షులు అగు; పుంగవులును = శ్రేష్ఠులును; కాండర్షులు = కాండర్షులు {కాండర్షులు - వేద కాండములను అధ్యయనము చేసినవారు}; అయిన = అయిన; అరుణ = అరుణుడు; ఆదులును = మొదలగువారును; మఱియున్ = ఇంకను; నానా = అనేక; గోత్ర = గోత్రములలో; సంజాతులు = పుట్టిన వారు; ఐన = అయిన; మునులును = మునులును; శిష్య = శిష్యులను; ప్రశిష్య = శిష్యుల శిష్యులను; సమేతులు = కూడినవారు; ఐ = అయి; చనుదెంచినన్ = వచ్చిన; వారలు = వారలు; కున్ = కు; ప్రత్యుత్తానంబున్ = లేచి ఎదురు వచ్చి ఆహ్వానించుట; సేసి = చేసి; పూజించి = పూజలు చేసి; దండప్రణామంబున్ = సాష్టాగ నమస్కారము {దండప్రణామము - సాష్టాగ నమస్కారము, దండము వలె భూమిపై పడి నమస్కరించుట}; ఆచరించి = చేసి; కూర్చుండ = కూర్చుండమని; నియోగించి = నియమించి.

భావము:

ఈ విధంగా పాండవపౌత్రుడైన పరీక్షిత్తు హరిచరణ సంస్మరణానంద కందళిత హృదయారవిందుడై విష్ణు పాదోద్భవ యైన గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడన్న సంగతి విన్నవారు అయి, అఖిలభువన పవిత్రులై, మహోదారచరిత్రులై, తీర్థయాత్రా వ్యాజంతో తీర్థాల తీర్థత్వాన్ని సార్థకం చేసే, సర్వ సమర్థులైనవారు అత్రి, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వసిష్ఠుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, గౌతముడు, కశ్యపుడు, కవషుడు, కణ్వుడు, కలశసంభవుడు (అగస్త్యుడు), వ్యాసుడు, పర్వతుడు, నారదుడు మొదలైన బ్రహ్మర్షులూ, దేవర్షులూ, రాజర్షులూ, అరుణుడు మొదలైన కాండర్షులూ, ఇంకా వివిధ గోత్రసంభవులైన మహర్షులు శిష్యులతోనూ, ప్రశిష్యులతోనూ కలిసి అచ్చటికి విచ్చేశారు. పరీక్షిన్నరేంద్రుడు ఆ విధంగా వచ్చన మునీంద్రులకు ఎదురువచ్చి, ఆర్ఘ్యపాద్యాలిచ్చి, అర్చించి, సాష్టాంగ నమస్కారాలు చేసి, సుఖాసీనులను కావించాడు.