పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు వేటాడుట

  •  
  •  
  •  

1-469-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పోము హిరణ్యదానములఁ బుచ్చుకొనంగ, ధనంబు లేమియుం
దేము, స వంచనంబులుగ దీవనలిచ్చుచు వేసరింపఁగా
రాము, వనంబులన్ గృహవిరాములమై నివసింపఁ; జెల్లరే!
పామును వైవఁగాఁ దగునె? బ్రహ్మమునీంద్రు భుజార్గళంబునన్.

టీకా:

పోము = వెళ్ళము; హిరణ్య = బంగారు; దానములన్ = దానములను; పుచ్చుకొనంగ = తీసుకొనుటకు; ధనంబులు = విత్తములు (దక్షిణలు); ఏమియున్ = ఏవియును; తేము = తీసుకొనిరాము; సవంచనములుగన్ = మోసములతో కూడిన; దీవనలు = దీవనలు - ఆశీర్వాదములను; ఇచ్చుచున్ = ఇచ్చుచు; చేయుచు; వేసరింపఁగా = విసిగించుచు; రాము = రాము; వనంబులన్ = అడవిలో; గృహ = గృహస్తాశ్రమ; ఆశ్రమము నందే; విరాములము = విరతులము; ఐ = అయి; నివసింపన్ = ఉండగ; చెల్లరే = అయ్యో; పామును = పామును; వైవఁగా = వేయుట; తగునె = తగునా ఏమి – ఏమి ధర్మము; బ్రహ్మముని = బ్రహ్మర్షులలో; ఇంద్రు = శ్రేష్ఠుని; భుజా = భుజముల యొక్క; గళంబునన్ = కంఠములో.

భావము:

మేము హిరణ్యదానాలు పుచ్చుకోవటానికి పోమే ఆశీర్వాదాలని మోసం చేసి ధనం గుంజుకోమే! పరులను వేధించేవాళ్లం కామే! ఇళ్లూ వాకిళ్లూ విడిచిపెట్టి అడవుల్లోపడి ఉన్నామే! అటువంటప్పుడు బ్రహ్మర్షి అయిన మా తండ్రిగారి మెడలో పామును పడవేయటానికి ఆ రాజుకు ఏం పోయే కాలం వచ్చిందో.