పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

  •  
  •  
  •  

1-439-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు కృష్ణుని యనుగ్రహంబున నశ్వత్థామ బాణపావకంబు వలన బ్రతికి; వృషభమూర్తి యయిన ధర్మదేవతకు నభయం బిచ్చిన పరీక్షిన్నరేంద్రుండు బ్రాహ్మణశాపప్రాప్త తక్షకాహిభయంబు వలనఁ బ్రాణంబులు వోవు నని యెఱింగి, సర్వసంగంబులు వర్జించి శుకునకు శిష్యుండై విజ్ఞానంబు గలిగి, గంగాతరంగిణీ తీరంబునం గళేబరంబువిడిచె వినుఁడు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కృష్ణుని = శ్రీకృష్ణుని; అనుగ్రహంబునన్ = అనుగ్రహము వలన; అశ్వత్థామ = అశ్వత్థామ యొక్క; బాణ = బాణముల; పావకంబు = అగ్ని; వలనన్ = నుండి; బ్రతికి = జీవించి; వృషభ = ఎద్దు; మూర్తి = రూపి; అయిన = అయినట్టి; ధర్మదేవత = ధర్మదేవత; కున్ = కు; అభయంబున్ = అభయము; ఇచ్చిన = ఇచ్చిన; పరీక్షిత్ = పరీక్షిత్తుడు అను; నరేంద్రుండు = నరులకు ఇంద్రుడు; రాజు; బ్రాహ్మణ = బ్రాహ్మణుని యొక్క; శాప = శాపము ద్వారా; ప్రాప్త = కలిగిన; తక్షక = తక్షకుడు అను; అహి = పాము యొక్క; భయంబు = భయము; వలనన్ = వలన; ప్రాణంబులు = ప్రాణములు; వోవున్ = పోవును; అని = అని; ఎఱింగి = తెలిసి; సర్వ = సమస్తమైన; సంగంబులు = బంధములు; వర్జించి = విడిచిపెట్టి; శుకుడు = శుకుడు; కున్ = కి; శిష్యుండు = శిష్యుడు; ఐ = అయి; విజ్ఞానంబున్ = విశిష్టమైన జ్ఞానమును; కలిగి = పొంది; గంగా = గంగ అను; తరంగిణీ = నది యొక్క; తీరంబునన్ = ఒడ్డున; కళేబరంబున్ = శరీరమును; విడిచెన్ = విడిచి పెట్టెను; వినుఁడు = వినుడు.

భావము:

ఈ విధంగా వాసుదేవుని అనుగ్రహం వల్ల అశ్వత్థామ అస్త్రానల జ్వాలలో నుంచి బ్రతికి బయటపడి వృషభరూపంలోని ధర్మ దేవతకు అభయమిచ్చిన పరీక్షిత్తు మునిశాపగ్రస్తుడై, తక్షకుని విషానలజ్వాలల వల్ల మరణం ప్రాప్తిస్తుందన్న సంగతి తెలుసుకొని సర్వసంగ పరిత్యాగియై శుకయోగిని ఆశ్రయించి, పరమార్థాన్ని గ్రహించి, గంగానదీ తీరంలో శరీరాన్ని పరిత్యజించాడు” అని చెప్పి సూతుడు శౌనకునితో ఇంకా ఇలా అన్నాడు.
ఈ భాగవతాన్ని పారీక్షితం అని కూడా చెప్తారు. ఎందుకంటే భాగవత పురాణం, పరీక్షిత్తు అడుగగా, పరీక్షిత్తు ముక్తి పొందడం కోసం, పరీక్షిత్తుకు చెప్పబడింది. అలా కృతకృత్యం అయింది. అట్టి మహానుభావుని జీవితం పుట్టుక నుండి భౌతికదేహం విడవటం వరకు ఈ చిన్న వచనంలో సంక్షిప్తంగా చెప్పబడింది. .