పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

  •  
  •  
  •  

1-437-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నరేంద్రా! నిన్ను నారోపితశరశరాసను సర్వప్రదేశంబు లందును విలోకించుచున్నవాడ; నే నెక్కడ నుండుదు నానతిమ్మ"నిన, రాజన్యశేఖరుండు ప్రాణవధ, స్త్రీ, ద్యూత, పానంబు, లనియెడు నాలుగు స్థానంబుల నిచ్చి, మఱియు నడిగిన సువర్ణ మూలం బగు నసత్య, మద, కామ, హింసా, వైరంబు, లనియెడు పంచప్రదేశంబుల నొసంగి, యితరస్థలంబుల స్పృశియింపకుండ నియమించె; నిట్లు కలినిగ్రహంబుసేసి; హీనంబు లయిన తప, శ్శౌచ, దయ లనియెడి మూఁడుపాదంబులు వృషభమూర్తి యయిన ధర్మదేవుని కిచ్చి, విశ్వంభరకు నిర్భరం బయిన సంతోషంబు సంపాదించి.

టీకా:

నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరులలో ఇంద్రుని వంటి వాడు, రాజు}; నిన్నున్ = నిన్ను; ఆరోపిత = ఎక్కుపెట్టిన; శరశరాసను = విల్లంబులు కలవానిగా; సర్వ = సమస్త; ప్రదేశంబులు = స్థలములు; అందునున్ = లోను; విలోకించుచున్ = చూచుచు; ఉన్నవాడ = ఉన్నాడను; నేన్ = నేను; ఎక్కడన్ = ఎక్కడ; ఉండుదున్ = ఉండను; ఆనతి = ఆజ్ఞ; ఇమ్ము = ఇమ్ము; అనిన = అనగా; రాజన్య = రాజులలో, క్షత్రియులలో; శేఖరుండు = శిఖరము వంటివాడు, శ్రేష్ఠుడు; ప్రాణవధ = జీవులను చంపుట; స్త్రీ = స్త్రీలోలత్వమును; ద్యూత = ద్యూతమును, జూదమును; పానంబులు = మద్యపానమును, తాగుడును; అనియెడు = అనెడు; నాలుగు = నాలుగు (4); స్థానంబులన్ = స్థలములను; చోటులను; ఇచ్చి = ఇచ్చి; మఱియున్ = ఇంకను; అడిగిన = అడుగగా; సువర్ణ = బంగారము, విత్తము; మూలంబు = మూలకారణము; అగు = అయిన; అసత్య = అసత్యమును, అబద్దమును; మద = మదమును, గర్వమును; కామ = అధికమైన ఆసక్తి; హింస = జీవులను బాధించుట; వైరంబులు = కయ్యములు, కలహములు; అనియెడు = అనే; పంచ = ఐదు; ప్రదేశంబులన్ = స్థలములను; ఒసంగి = ఇచ్చి; ఇతర = ఇతర; స్థలంబులన్ = స్థలములను; స్పృశియింపక = ముట్టుకొనక; ఉండన్ = ఉండునట్లు; నియమించెన్ = కట్టడి చేసెను; ఇట్లు = ఈ విధముగ; కలి = కలి యొక్క; నిగ్రహంబు = కట్టడి; చేసి = చేసి; హీనంబులు = క్షీణించినవి; అయిన = అయినట్టి; తపస్ = తపస్సును; శ్శౌచ = శౌచమును; దయలు = దయయు; అనియెడి = అనెడి; మూఁడు = మూడు (3); పాదంబులున్ = కాళ్ళు; వృషభ = ఎద్దు; మూర్తి = రూపమున ఉన్నవాడు; అయిన = అయినట్టి; ధర్మదేవుడు = ధర్మదేవత; కిన్ = కు; ఇచ్చి = ఇచ్చి; విశ్వంభర = విశ్వమును భరించునది, భూదేవి; కున్ = కి; నిర్భరంబు = నిర్భరము, అధికము; అయిన = అయినట్టి; సంతోషంబున్ = సంతోషమును; సంపాదించి = కలిగించి.

భావము:

రాజేంద్రా! ఎటు చూస్తే అటు సర్వత్రా ధనుర్ధరుడవైన నీ రూపమే నా లోచనాలకు గోచరిస్తున్నది. మరి నేను ఎచట తలదాచుకొనేది ఆజ్ఞాపించు” అని అలమటించే కలిపురుషుని ప్రార్థన ఆలకించి పరీక్షిత్తు వానికి ”జూదం, మద్యపానం, స్త్రీలు, ప్రాణివధ” అనే నాలుగు స్థానాలు ఇచ్చాడు. ఇంకా అతడు అర్థించగా మహారాజు ”సువర్ణం” కారణంగా కలుగు అసత్యం, గర్వం, కామం, హింస, వైరం అనే ఇంకా ఐదు స్థానాలు ఇచ్చాడు. ఈ స్థానాలలో తప్ప ఇతర స్థలాలను స్పృశించవద్దని కలిని కట్టడి చేసాడు పరీక్షిత్తు. ఈ ప్రకారం ఆ మహారాజు కలిపురుషుణ్ణి నిగ్రహించి పోగొట్టుకొన్న తపస్సు, శౌచం, దయ అనే మూడు పాదాలూ వృషభమూర్తి అయిన ధర్మదేవతకు అర్పించి భూదేవికి అపారమైన ఆనందాన్ని కలిగించాడు.