పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

  •  
  •  
  •  

1-432-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిటు ధరణీధర్మదేవతల బుజ్జగించి, మహారథుండయిన విజయపౌత్రుండు క్రొక్కారు మెఱుంగు చక్కదనంబుఁ ధిక్కరించి దిక్కులకు వెక్కసంబయిన యడిదంబు బెడిదంబుగ జడిపించి పాపహేతు వయిన కలిని రూపుమాప నుద్యోగించిన, వాఁడు రాజరూపంబు విడనాడి, వాడిన మొగంబుతోడ, భయవిహ్వలుండై హస్తంబులు సాఁచి, తత్పాదమూల విన్యస్తమస్తకుండై, ప్రణామంబు సేసి.

టీకా:

అని = అని; ఇటు = ఇటుపక్క; ధరణీ = భూదేవి; ధర్మదేవతలన్ = ధర్మదేవతలను; బుజ్జగించి = సముదాయించి; మహారథుండు = గొప్పరథికుడు {మహారథుడు - 1) మహారథుడు- పదకొండువేలమంది (11000) విలుకాండ్రతో పోరాడెడి యోధుడు, తనను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరాడెడి యోధుడు 2)అతిరథుడు - పెక్కువిలుకాండ్రతో పోరాడెడి యోధుడు 3)సమరథుడు - ఒకవిలుకానితో సరిగనిలిచి పోరాడెడి యోధుడు 4)అర్థరథుడు - ఒక్కవిలుకానితో పోరాడెడి యోధుడు}; అయిన = అయినట్టి; విజయపౌత్రుండు = పరీక్షితు {విజయుపౌత్రుడు - అర్జునుని మనుమడు , పరీక్షితు}; క్రొక్కారు = తొలకరి మబ్బు నందలి; మెఱుంగు = మెరుపు తీగ; చక్కదనంబున్ = చక్కదనమును; ధిక్కరించి = తిరస్కరించి; దిక్కుల = దిక్కుల; కున్ = కు; వెక్కసంబు = దుస్సహము; అయిన = అయినట్టి; అడిదంబున్ = కత్తిని; బెడిదంబుగన్ = భయంకరముగ; జడిపించి = జళిపించి {జడిపించు - జళిపించు, ఆడించు}; పాప = పాపమునకు; హేతువు = కారణము; అయిన = అయినట్టి; కలిని = కలిని; రూపుమాపన్ = సంహరించుటకు; ఉద్యోగించినన్ = సిద్ధపడగా; వాఁడు = వాడు; రాజ = రాజుల యొక్క; రూపంబున్ = రూపమును; విడనాడి = విడిచిపెట్టి; వాడిన = వాడిపోయిన; మొగంబు = ముఖము; తోడన్ = తో; భయ = భయముతో; విహ్వలుండు = విహ్వలుడు {విహ్వలుడు - భయాదులచే అవయవముల పట్టు తప్పినవాడు}; ఐ = అయి; హస్తంబులున్ = చేతులను; సాఁచి = చాచి; తత్ = అతని; పాదమూల = కాలి పాదములందు; విన్యస్త = ఉంచబడిన; మస్తకుండు = తల కలవాడు; ఐ = అయి; ప్రణామంబున్ = నమస్కారమును; చేసి = చేసి.

భావము:

ఈ విధంగా పరీక్షిన్నహారాజు ధరణినీ, ధర్మదేవుణ్ణీ ఊరడించాడు. మహారథుడూ, అర్జునుని మనుమడూ అయిన ఆ వీరాగ్రేసరుడు తొలకరి మెరుపుతీగలా తళ తళ మెరుస్తూ కళ్లకు మిరుమిట్లు గొలిపే దుస్సహమైన తన ఖడ్గాన్ని భయంకరంగా జళిపించి, పాపాత్ముడైన కలిని రూపుమాపాలని నిశ్చయించాడు. అప్పుడు తనను సంహరించటానికి ఉద్యుక్తుడైన మహారాజును చూసి, కలి రాజచిహ్నాలన్నీ విడిచి, వడలిన వదనంతో గడగడలాడుతూ భయవిహ్వలుడై ఆ రాజుపాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి-I465