పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

  •  
  •  
  •  

1-430-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు దేవమాయవలన భూతంబుల వాఙ్మానసంబులకు వధ్యఘాతుక లక్షణం బగు వృత్తి సులభంబునం దెలియ రాదు; నీవుధర్మదేవతవు; కృతయుగంబునం దపశ్శౌచదయాసత్యంబు లనునాలుగు నీకు బాదంబు లని చెప్పుదురు; త్రేతాయుగంబునఁ బూర్వోక్త పాదచతుష్కంబు నం దొక్క పాదంబు క్షీణం బయ్యె; ద్వాపరంబునం పాద ద్వయంబు నశించెం గలియుగం బందు నివ్వడువుననిప్పుడు నీకుఁ బాదత్రయంబు భగ్నం బయ్యె నవశిష్టంబగు, భవదీయ చతుర్థ పాదంబున ధర్మంబు గల్యంతంబున నిగ్రహింప గమకించుచున్నయది విను మదియునుం గాక.

టీకా:

మఱియున్ = ఇంకను; దేవ = దేవుని; మాయ = మాయ; వలనన్ = వలన; భూతంబుల = జీవుల యొక్క; వాక్ = వాక్కునకు – బయటపడినదానికి; మానసంబుల = మనస్సుల – లోపల ఉన్నదాని; కున్ = కిని; వధ్య = వధింపబడు – దెబ్బ తిను; ఘాతుక = ఘాతముచేయు – దెబ్బ తీయు; లక్షణంబు = లక్షణము కలది; అగు = అయినట్టి; వృత్తి = ప్రవర్తన; సులభంబునన్ = సులభముగ; తెలియరాదు = తెలిసికొనుటకు సాధ్యముకాదు; నీవు = నీవు; ధర్మదేవతవు = ధర్మదేవతవు; కృతయుగంబునన్ = కృతయుగములో; తపస్ = తపస్సును; శౌచ = శౌచమును; దయ = దయయు; సత్యంబులు = సత్యమును; అను = అనే; నాలుగు = నాలుగు (4); నీకు = నీకు; పాదంబులు = కాళ్ళు; అని = అని; చెప్పుదురు = అందురు; త్రేతా = త్రేత అను; యుగంబునన్ = యుగములో; పూర్వ = ముందు; ఉక్త = చెప్పిన; పాద = కాళ్ళు; చతుష్కంబునన్ = నాలిగింటను; ఒక్క = ఒకటే (1); పాదంబు = కాలు; క్షీణంబు = నశించుట; అయ్యెన్ = జరిగెను; ద్వాపరంబునన్ = ద్వాపరములో; పాద = కాళ్ళు; ద్వయంబు = రెండు (2); నశించెన్ = నశించినవి; కలి = కలి అను; యుగంబు = యుగము; అందున్ = లోపల; ఈ = ఈ; వడువున = విధముగ; ఇప్పుడు = ఇప్పుడు; నీకున్ = నీకు; పాద = కాళ్ళు; త్రయంబు = మూడు (3); భగ్నంబు = నష్టము; అయ్యెన్ = అయ్యెను; అవశిష్టంబు = మిగిలినది; అగు = అయినట్టి; భవదీయ = నీయొక్క; చతుర్థ = నాలుగవ; పాదంబునన్ = కాలిమీద; ధర్మంబు = ధర్మము; కలి = కలికాలము యొక్క; అంతంబునన్ = అంతములో; నిగ్రహింపన్ = నిగ్రహించుకొనుటకు; గమకించుచు = ప్రయత్నించుచు; ఉన్నయది = ఉన్నది; వినుము = వినుము; అదియునున్ = అంతియే; కాక = కాకుండగ.

భావము:

వాక్కుకూ మనస్సుకూ అతీతమైన దైవమాయవల్ల జీవులకు మధ్యఘాతుక స్వరూపం సులభవేద్యం కాదు. నీవు ధర్మ దేవతవు. కృతయుగంలో నీకు తపం, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలు ఉండేవని చెబుతారు. త్రేతాయుగంలో ఆ నాలుగు పాదాలలో ఒక పాదం భగ్నమయింది. ద్వాపరయుగం రాగానే రెండు పాదాలు లోపించాయి. ఇప్పుడు కలియుగంలో మూడు పాదాలు లుప్తమైపోయి సత్యంమనే ఒక్కపాదం మాత్రం మిగిలి ఉంది. ఆ పాదాన్ని కూడా కలియుగాంతంలో అధర్మం ఆక్రమించి భగ్నం చెయ్యాలని కాచుకొని ఉంది. ఇదుగో ఇటు చూడు-