పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

  •  
  •  
  •  

1-428-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! యేము ప్రాణులకు దుఃఖహేతువులము గాము; మా వలన దుఃఖంబు నొందెడు పురుషుండు లేడు; వాది వాక్య భేదంబుల యోగీశ్వరులు మోహితులై భేదంబు నాచ్ఛాదించి, తమకు నాత్మ సుఖదుఃఖంబుల నిచ్చు ప్రభు వని చెప్పుదురు; దైవజ్ఞులు గ్రహదేవతాదులకుఁ బ్రభుత్వంబు సంపాదింతురు; మీమాంసకులు గర్మంబునకుం బ్రాభవంబుం బ్రకటింతురు; లోకాయతికులు స్వభావంబునకుఁ బ్రభుత్వంబు సంపాదింతురు; ఇందెవ్వరికిని సుఖదుఃఖ ప్రదానంబు సేయ విభుత్వంబు లేదు; పరుల వలన దుఃఖంబువచ్చిన నధర్మంబు పరులు సేసి రని విచారింప వలదు; తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరునివలన సర్వంబు నగుచుండు"ననిన ధర్మదేవునికి ధర్మనందనపౌత్రుం డిట్లనియె.

టీకా:

నరేంద్ర = రాజా {నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు, రాజు.}; ఏము = మేము; ప్రాణులు = జీవులు; కున్ = కు; దుఃఖ = దుఃఖము కలుగుటకు; హేతువులము = కారణభూతులము; కాము = కాము; మా = మా; వలనన్ = వలన; దుఃఖంబు = బాధను; ఒందెడు = పొందెడు; పురుషుండు = మానవుడు; లేడు = లేడు; వాది = వాదించువారి; వాక్య = మాటల, వాదనలలో; భేదంబులన్ = వ్యత్యానుసారము, తేడానుబట్టి; యోగీశ్వరులు = యోగులలోశ్రేష్ఠులు; మోహితులు = మోహింపబడినవారు – భ్రమలో పడినవారు; ఐ = అయి; భేదంబున్ = భేద భావమును; ఆచ్ఛాదించి = ఆపాదించి {ఆచ్చాదించి - ఆపాదించి, లేనిది ఉన్నట్లు చెప్పు ఆరోపణ}; తమ = తమ; కున్ = కు; ఆత్మ = ఆత్నయే; సుఖదుఃఖంబులన్ = సుఖదుఃఖంబులను; ఇచ్చు = ఇచ్చెడి; ప్రభువు = అధికారి {ప్రభువు - ప్రభుత్వము కలవాడు, అధికారి, ఏలిక, సమర్థుడు, విష్ణువు}; అని = అని; చెప్పుదురు = చెప్పదురు; దైవజ్ఞులు = జ్యోతిష్కులు {దైవజ్ఞులు - దివి (గ్రహనక్షత్రములను) అధ్యయనము చేసి శుభాశుభమును చెప్పువారు, జ్యోతిష్కులు}; గ్రహదేవత = గ్రహ అధి దేవతలు; ఆదులు = మొదలగు వాని; కున్ = కి; ప్రభుత్వంబున్ = అధికారమును; సంపాదింతురు = చూపుదురు; మీమాంసకులు = మీమాంసకులు {మీమాంసకులు - పూర్వ మీమాంస యను మార్గానువర్తులు}; కర్మంబు = కర్మలు; కున్ = కే; ప్రాభవంబున్ = ప్రభావము ఉన్నదని; ప్రకటింతురు = చెప్పుదురు; లోకాయతికులు = లోకాయతికులు {లోకాయతికులు - చార్వాకులు, స్వభావమును అనుసరించి లోకములు ప్రాప్తించుననెడి వారు, లోకాయత మతస్థుఁడు.}; స్వభావంబు = స్వభావము; కున్ = నకు; ప్రభుత్వంబు = అధికారము; సంపాదింతురు = చూపుదురు; ఇందు = ఇందులో; ఎవ్వరు = ఏ ఒక్కరు; కిన్ = కిను; సుఖదుఃఖ = సుఖదుఃఖములను; ప్రదానంబున్ = ఇచ్చుటను; చేయు = చేయ; విభుత్వంబు = అధికారము; లేదు = లేదు; పరుల = ఇతరుల; వలనన్ = వలన; దుఃఖంబు = దుఃఖము; వచ్చినన్ = వచ్చినట్లయినను; అధర్మంబు = అధర్మమును; పరులు = ఇతరులు; సేసిరని = చేసిరని; విచారింపన్ = బాధపడుట; వలదు = చేయ వద్దు; తర్కింపను = ఊహించుటకును; నిర్దేశింపను = నిర్ణయించుటకును; రాని = సాధ్యముకాని; పరమేశ్వరుని = భగవంతుని; వలనన్ = వలన; సర్వంబున్ = సర్వమున, సమస్తమును; అగుచున్ = అవుతూ; ఉండును = ఉండును; అనిన = అనగా; ధర్మదేవుడు = ధర్మదేవత; కిన్ = కి; ధర్మనందనపౌత్రుండు = పరీక్షిత్తు {ధర్మనందనపౌత్రుడు - యమధర్మరాజు పుత్రుని మనుమడు, పరీకిన్మహారాజు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

రాజేంద్రా! మేము ఇతర ప్రాణులను బాధ పెట్టేవాళ్లం కాము. మా మూలంగా ఏ ప్రాణికీ ఎటువంటి ఆపదా కలుగదు. నానా విధాలైన వాదోపవాదాలకు సమ్మెహితులైన యోగీశ్వరులు ఆత్మయే సుఖదుఃఖాలు కల్పించే ప్రభువంటారు. దైవజ్ఞులు గ్రహాలకూ, దేవతలకూ ప్రభుత్వాన్ని ఆపాదిస్తారు; మీమాంసకులు కర్మానికే ప్రాభవం అంగీకరిస్తారు; లోకాయతికులు స్వభావానికి ప్రభుత్వం కట్టబెడతారు; కాని వారు చెప్పేవారిలో ఎవ్వరికీ సుఖదుఃఖాలను ఇచ్చే సామర్థ్యం లేదు; ఎవరి వల్లనో తమకు దుఃఖం కలిగిందనీ, ఎవరో తమకు ఎగ్గు చేశారనీ అనుకోవటం పొరపాటు. బుద్ధికీ మనస్సుకీ అతీతుడైన పరమేశ్వరుని వల్లనే సమస్తమూ జరుగుతుంది.” అని పలికే ధర్మదేవునితో ధర్మరాజు పౌత్రుడైన పరీక్షిత్తు ఇలా అన్నాడు....