పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

  •  
  •  
  •  

1-416-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""నిన్నుం గొమ్ములఁ జిమ్మెనో? కదిసెనో? నిర్భీతివై గోవులం
న్నం గారణ మేమి? మద్భుజసనాక్షోణి నే వేళలం
దున్నేరంబులు సేయ రా; దెఱుఁగవా? ధూర్తత్వమున్ భూమిభృ
త్సన్నాహంబు నొనర్చె దెవ్వఁడవు? నిన్ శాసించెదన్ దుర్మతీ!

టీకా:

నిన్నున్ = నిన్ను; కొమ్ములన్ = కొమ్ములతో; చిమ్మెనో = చిమ్మెనో {చిమ్ముట - కొమ్ములతో పొడిచి దూరముగ తోయుట, జలాదులను విస్తారముగా జల్లుట}; కదిసెనో = సమీపించెనో, మీదికి వచ్చెనో; నిర్భీతివి = భయము లేనివాడవు; ఐ = అయి; గోవులన్ = గోవులను – అవు ఎద్దులను; తన్నన్ = తన్నుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; మత్ = నా యొక్క; భుజ = భుజముల; సనాథ = అండ కలిగిన; క్షోణిన్ = రాజ్యము నందు; ఏ = ఏ; వేళలు = సమయము; అందున్ = అందు; నేరంబులున్ = అపరాధములను; సేయరాదు = చేయరాదు; ఎఱుఁగవా = తెలియవా; ధూర్తత్వమున్ = మోసముతో; భూమిభృత్ = రాజరికపు {భూమిభృత్ - భూమికి భర్త, రాజు}; సన్నాహంబున్ = ఆటోపములు, యత్నములు; ఒనర్చెదు = చేసెదవు; ఎవ్వఁడవు = ఎవరవు; నిన్ = నిన్ను; శాసించెదన్ = శిక్షించెదను; దుర్మతీ = దుర్బుద్ధి కలవాడా.

భావము:

“ఎవడవురా నువ్వు? నిన్ను కొమ్ములతో చిమ్మలేదే; నీ మీదికి రాలేదే; ఏ పాపమూ ఎరుగని ఈ గోవులను భయం లేకుండా తన్నా వెందుకురా? నా భుజదండం సంరక్షించే ఈ మహీమండలంలో ఏ వేళా నేరాలు చేయకూడదని తెలియదా? దుర్బుద్ధితో రాజవేషాన్ని ధరించి రాజసం ఒలకబోస్తున్న ధూర్తుడా! నిన్ను కఠినంగా శిక్షిస్తాను.