పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-376-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తే, రా రథికుండు, నా హయము, లా స్త్రాసనం, బా శర
వ్రాతం, బన్యులఁ దొల్లి జంపును, దుదిన్ వ్యర్థంబు లైపోయె; మ
చ్చేతోధీశుఁడు చక్రి లేమి భసితక్షిప్తాజ్య మాయావి మా
యాతంత్రోషరభూమిబీజముల మర్యాదన్ నిమేషంబునన్.

టీకా:

ఆ = అదే; తేరు = రథము; ఆ = అదే; రథికుండున్ = రథమునెక్కిన వీరుడు; ఆ = అదే; హయములు = గుఱ్ఱములు; ఆ = అదే; అస్త్రాసనంబు = విల్లు; ఆ = అదే; శర = అస్త్రముల; వ్రాతంబు = సమూహము; అన్యులన్ = పరులను; తొల్లి = ఇంతకుముందు; చంపును = సంహరిస్తుండేవి; తుదిన్ = చిట్టచివరకి, ఆఖరికి; వ్యర్థంబులు = నిరుపయోగములు; ఐపోయెన్ = అయిపోయినవి; మత్ = నా యొక్క; చేతస్ = మనసునకు, ప్రజ్ఞకు; అధీశుండు = అధిపతి; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు}; లేమి = లేకపోవుటచేత; భసిత = బూడిదలో; క్షిప్త = చిమ్మబడిన; ఆజ్య = నేయియును; మాయావి = ఐంద్రజాలికుని; మాయాతంత్ర = గారడీయును; ఊషరభూమి = చవిటిపఱ్ఱలో చల్లిన; బీజముల = విత్తనములును; మర్యాదన్ = వలె; నిమేషంబునన్ = నిమిషములో.

భావము:

(అర్జునుడు శ్రీకృష్ణ నిర్యాణానంతంరం వెనుకకు హస్తిన చేరి అన్నగారు ధర్మరాజువద్ద వాపోతున్నాడు.) ఆత్మేశ్వరుడు చక్రధారి యైన శ్రీకృష్ణుడు లేకపోడంతో ఆ రథం, ఆ రథంపై నున్న నేను, ఆ గుఱ్ఱాలు, ఆ విల్లంబులు శత్రుసంహారకా లైన అవన్ని ఇదివరకటివే అయినా నిరుపయోగ మైపోయాయి. అన్నీ బూడిదలో పోసిన నెయ్యిలా, మాయావి యందు ప్రయోగించిన మాయలా, చవిటిపఱ్ఱ ఐన పొలంలో చల్లిన విత్తనాల్లా తుదకు అన్ని క్షణకాలంలో నిరర్థకాలు అయిపోయాయి.