పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-375-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాంతారంబున నొంటి దోడుకొని రాఁగాఁ జూచి గోవిందు శు
ద్ధాంస్త్రీలఁ బదాఱువేల, మదరాగాయత్తులై తాఁకి నా
చెంతన్ బోయలు మూఁగి పట్టికొన, నా సీమంతినీ సంఘమున్
భ్రాంతిన్ భామిని భంగి నుంటి విడిపింపన్ లేక; ధాత్రీశ్వరా!

టీకా:

కాంతారంబునన్ = అడవిలో; ఒంటిన్ = ఒంటరిగా; తోడుకొని = తీసుకొని; రాఁగాన్ = వస్తుండగ; చూచి = చూసి; గోవిందు = కృష్ణుని {గోవిందుడు - గోవులకు ఒడయుడు, గోవులను పాలించు వాడు, గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు, కృష్ణుడు.}; శుద్ధాంత = అంతఃపుర; స్త్రీలన్ = స్త్రీలను; పదాఱువేల = పదహారువేలమంది; మద = మదముతోను; రాగ = కామముతోను; ఆయత్తులు = నిండినవారు; ఐ = అయి; తాఁకి = ముట్టడించి; నా = నా; చెంతన్ = దగ్గరగ; బోయలు = బోయవాళ్ళు; మూఁగి = చుట్టూ ముసురుకొని; పట్టికొనన్ = పట్టికొనగా; ఆ = ఆ; సీమంతినీ = అంతఃపురములో నుండు స్త్రీల; సంఘమున్ = సమూహమును; భ్రాంతిన్ = భ్రమతో; భామిని = ఆడుదాని; భంగిన్ = వలె; ఉంటిన్ = ఉండిపోతిని; విడిపింపన్ = విడిపించగా; లేక = లేక, రాక; ధాత్రీశ్వరా = రాజా, ప్రభూ {ధాత్రీశ్వరుడు - ధాత్రి (భూమి)కి ఈశ్వరుడు, రాజు.}.

భావము:

ఆ మహానుభావుడు తనువు చాలించిన అనంతరం ఆయన అంతఃపురకాంతలను పదహారువేలమందినీ వెంటబెట్టుకొని వస్తుండగా అరణ్యమధ్యంలో మదోన్మత్తులైన కిరాతులు చుట్టుముట్టి పట్టుకొన్నారు. వారి బారినుండి ఆ నారీమణులను కాపాడలేక ఆడుదానిలాగా విస్తుపోయి కళ్లప్పగించి చూస్తూ ఊరుకొన్నాను.