పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధృతరాష్ట్రాదుల నిర్గమంబు

  •  
  •  
  •  

1-325-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""క్కట! తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మ! వారు నేఁ
డెక్కడ వోయిరో యెఱుఁగ, నెప్పుడు బిడ్డల పేరు గ్రుచ్చి తాఁ
బొక్కుచునుండుఁ దల్లి యెటు వోయెనొకో? విపదంబురాశికిన్
నిక్కము కర్ణధారుఁడవు నీవు జగజ్జనపారదర్శనా!""

టీకా:

అక్కట = అయ్యో; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; గృహంబునన్ = ఇంటిలో; లేరు = లేరు; మహాత్మ = గొప్ప ఆత్మ కలవాడా; వారు = వాళ్ళు; నేఁడు = ఈ రోజు; ఎక్కడన్ = ఎక్కడకు; పోయిరో = వెళ్ళినారో; యెఱుఁగన్ = నాకు తెలియదు; ఎప్పుడు = ఎల్లప్పుడు; బిడ్డల = పుత్రుల యొక్క; పేరు = గొప్పదనము; గ్రుచ్చి = గురించి, నొక్కి; తాన్ = తాను; పొక్కుచున్ = దుఃఖ పడుచు; ఉండున్ = ఉండును; తల్లి = తల్లి; ఎటు = ఎక్కడకు; పోయెనొకో = పోయెనో పాపం; విపత్ = ప్రమాదములు అను; అంబు = సముద్రము; రాశి = దాటుట; కిన్ = కు; నిక్కము = నిజముగ; కర్ణధారుఁడవు = తరింపజేయువాడవు {కర్ణధారుడు - కర్ణము (చుక్కాని) ధారుడు (పట్టువాడు), పడవ నడుపు వాడు, మార్గదర్శి, తరింపజేయువాడు}; నీవు = నీవు; జగత్ = లోకములోని; జన = ప్రజలకు; పార = గమ్యము(ఒడ్డు); దర్శనా = చూపువాడా.

భావము:

""దేవర్షీ! నీవు సర్వజ్ఞుడవు. ముల్లోకాలలో నీకు తెలియనిది ఏమీలేదు. ఆపదలనే సముద్రం దాటించటానికి నిజంగా నీవు కర్ణధారుడవు. అయ్యో మహాత్మా! ఏమని చెప్పమంటావు. తెల్లవారి చూసే సరికి మాతల్లిదండ్రులు ఇంటిలో లేరు. వారు ఇల్లు వదలి ఎక్కడికి పోయారో తెలియకుండా ఉంది. సర్వదా తనబిడ్డలను పేరు పేరునా తలచుకొని తల్లడిల్లే మా తల్లి ఎటుపోయిందో ఏమయిపోయిందో.""