పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధృతరాష్ట్రాదుల నిర్గమంబు

  •  
  •  
  •  

1-320-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విదురసహితులై గాంధారీధృతరాష్ట్రులు వనంబునకుం జనిన మఱునాఁడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనంబు సేసి, నిత్యహోమంబు గావించి, బ్రాహ్మణోత్తములకు గో హిరణ్య తిల వస్త్రాది దానంబులు సేసి నమస్కరించి, గురువందనము గొఱకుఁ పూర్వ బ్రకారంబునం దండ్రి మందిరమునకుఁ జని యందు విదురసహితు లయిన తల్లిదండ్రులం గానక మంజుపీఠంబునఁ గూర్చున్నసంజయున కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; విదుర = విదురునితో; సహితులు = కూడినవారు; ఐ = అయి; గాంధారి = గాంధారి; ధృతరాష్ట్రులు = ధృతరాష్ట్రులు; వనంబున = అడవి; కున్ = కి; చనిన = వెళ్లగ; మఱునాఁడు = తరువాతి రోజు; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; ప్రభాతంబున = ఉదయము నందు; సంధ్యావందనంబు = సంధ్యావందనము; చేసి = చేసికొని; నిత్య = ప్రతి నిత్యము చేయు; హోమంబు = హోమము; కావించి = పూర్తిచేసుకొని; బ్రాహ్మణ = బ్రాహ్మణులైన; ఉత్తములు = ఉత్తములు; కున్ = కు; గో = ఆవులు; హిరణ్య = బంగారము; తిల = నువ్వులు; వస్త్ర = వస్త్రములు; ఆది = మొదలగు; దానంబులున్ = దానములను; చేసి = చేసి; నమస్కరించి = నమస్కరించి; గురు = పెద్దలకు చేయు; వందనము = నమస్కారము; కొఱకున్ = కోసము; పూర్వ = ఇంతకు ముందు; ప్రకారంబునన్ = వలె; తండ్రి = తండ్రి యొక్క; మందిరము = భవనము; కున్ = కు; చని = వెళ్ళి; అందున్ = అందులో; విదుర = విదురునితో; సహితులు = కూడిన వారు; అయిన = అయినట్టి; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులను; కానక = కనుగొనలేక; మంజు = చక్కటి; పీఠంబునన్ = ఆసనమున; కూర్చున్న = కూర్చుండి యున్న; సంజయున = సంజయున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఆ ప్రకారంగా గాంధారీ ధృతరాష్ట్రులు విదురునితో కూడి అరణ్యాలకు వెళ్లారు. ఆ మర్నాడు ధర్మరాజు ప్రాతఃకాల కృత్యాలు తీర్చుకొని, సంధ్యవార్చుకొని, అగ్నికార్యాలు నెరవేర్చుకొన్నాడు. అనంతరం ఉత్తములైన విప్రులకు గోదాన సువర్ణదాన తిలదాన వస్త్రదానాదులు నిర్వర్తించి, పెద్దలకు నమస్కరించే నిమిత్తం యాథావిధిగా పెదతండ్రిగారి భవనానికి వెళ్లాడు. అక్కడ విదురుడూ, గాంధారీ ధృతరాష్ట్రులూ కనిపించలేదు. ఒక సురుచిరపీఠం మీద సుఖాసీనుడై ఉన్న సంజయుణ్ణి చూసి ధర్మరాజు ఇలా అడిగాడు…