పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధృతరాష్ట్రాదుల నిర్గమంబు

  •  
  •  
  •  

1-318-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంధుండైన పతిన్ వరించి, పతిభావాసక్తి నేత్రద్వయీ
బంధాచ్ఛాదనమున్ ధరించి, నియమప్రఖ్యాతయై యున్న త
ద్గాంధారక్షితినాథుకూఁతురును యోప్రీతి చిత్తంబులో
సంధిల్లం బతివెంట నేఁగె, నుదయత్సాధ్వీగుణారూఢయై.

టీకా:

అంధుండు = గ్రుడ్డివాడు; ఐన = అయినట్టి; పతిన్ = భర్తను; వరించి = ప్రేమించి; పతి = పతి యొక్క; భావా = స్థితిని అనుసరించు; ఆసక్తి = ఇష్టపూర్వక నిర్ణయముతో; నేత్ర = కన్నులు; ద్వయీ = రెంటికిని; బంధ = కట్టుటవలన; ఆచ్ఛాదనమున్ = కప్పియుంచునది; ధరించి = కట్టుకొనిన; నియమ = నియమము కలిగి ఉండుట లో; ప్రఖ్యాత = కీర్తి పొందినది; ఐ = అయి; ఉన్న = ఉన్నటువంటి; తత్ = ఆ; గాంధార క్షితి నాథు కూఁతురును = గాంధారి కూడ {గాంధారక్షితినాథుకూఁతురు - గాంధార (గాంధార) క్షితి (దేశ) నాథు (రాజు) కూఁతురు (పుత్రిక), గాంధారి}; యోగప్రీతి = యోగమును అనుసరించు ఇష్టము; చిత్తంబు = మనసు; లోన్ = లో; సంధిల్లన్ = కూడిరాగా; పతి = భర్త; వెంటన్ = వెనుకనే; ఏఁగెన్ = వెళ్ళెను; ఉదయత్ = ఉద్భవించిన; సాధ్వీ = సాధు స్త్రీ; గుణ = గుణములు; ఆరూఢ = స్థిర పరచుకొన్నది; ఐ = అయి.

భావము:

గాంధారి ఉత్తమ ఇల్లాలు, పుణ్య పురంధ్రి, గాంధార మహారాజు గారాబు పుత్రిక. పుట్టంధు డైన భూ భర్తను భర్తగా వరించి, పతి చూడ లేని ప్రపంచాన్ని తను మాత్రం ఎందుకు చూడాలనే పట్టుదలతో కళ్లకు గంతలు కట్టుకొని, లోకావలోకనం పరిహరించిన ఆ సాధ్వీమణి అతిశయించిన వైరాగ్యభావంతో పతి వెంట బయలుదేరి వెళ్ళింది హిమాలయలకి.
(విదురుడు విరక్తిమార్గం ఉపదేశించగా అతని వెనుక ధృతరాష్ట్రుడు, అతని సతి గాంధారి హిమాలయాలకు బయలుదేరిన సందర్భలోని పద్య మిది)