పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : విదురాగమనంబు

  •  
  •  
  •  

1-303-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తండ్రి సచ్చినమీఁద మా పెదతండ్రిబిడ్డలు దొల్లి పె
క్కండ్రు సర్పవిషాగ్నిబాధల గాసిఁ బెట్టఁగ మమ్ము ని
ల్లాండ్ర నంతముఁ బొందకుండఁగ లాలనంబున మీరు మా
తండ్రి భంగి సముద్ధరింతురు ద్విధంబు దలంతురే?

టీకా:

తండ్రి = తండ్రి; సచ్చిన = మరణించిన; మీఁదన్ = పిదప; మా = మాయొక్క; పెదతండ్రి = తండ్రికి అన్నగారి; బిడ్డలు = కొడుకులు; తొల్లి = పూర్వము; పెక్కండ్రు = అనేకమంది; సర్ప = పాముల; విష = విషమువలన; అగ్ని = అగ్నివలన; బాధలన్ = బాధలతో; కాసిఁబెట్టఁగ = రాపాడించగా, బాధించగ; మమ్మున్ = మమ్ములను; ఇల్లాండ్రన్ = భార్యలను; అంతమున్ = మరణము; పొందకుండఁగన్ = చెందకుండగ; లాలనంబునన్ = సముదాయించుతూ; మీరు = మీరు; మా = మాయొక్క; తండ్రి = తండ్రి; భంగిన్ = వలె; సముద్ధరింతురు = పైకి తీసుకొనివచ్చిరి; తత్ = ఆ; విధంబున్ = విధమును; తలంతురే = జ్ఞప్తి చేసుకొందురా.

భావము:

మా తండ్రిగారు చనిపోయిన అనంతరం, మా పెదతండ్రి కుమారులు మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు. సర్పాలచేత కరిపించారు. విషాన్నం తినిపించారు. ఇంటికి నిప్పు అంటించారు. మా తండ్రివంటి మీరు మమ్మల్నీ, మా భార్యలనూ మృత్యువుబారిని పడకుండా అత్యంత అనురాగంతో లాలించి పాలించారు. కష్టాలలో నుంచి ఉద్ధరించారు. ఆ విషయాలన్నీ ఎన్నడైన తలచుకొంటారా.