పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షి జ్జన్మంబు

  •  
  •  
  •  

1-296-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పెక్కేండ్లు జీవించి భూసుర కుమార ప్రేరితం బయిన తక్షకసర్ప విషానలంబునం దనకు మరణం బని యెఱింగి, సంగవర్జితుం డయి, ముకుంద పదారవింద భజనంబు సేయుచు, శుకయోగీంద్రుని వలన నాత్మవిజ్ఞాన సంపన్నుం డై, గంగాతటంబున శరీరంబు విడిచి, నిర్గత భయశోకం బయిన లోకంబుఁ బ్రవేశించు"నని, జాతకఫలంబు సెప్పి లబ్ధకాము లయి భూసురులు సని రంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పెక్రు = చాలా; ఏండ్లు = సంవత్సరములు; జీవించి = బ్రతికి; భూసుర = బ్రాహ్మణ {భూసురుడు - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు}; కుమార = పుత్రునిచేత; ప్రేరితంబు = ప్రేరేపించబడినది; అయిన = అయినట్టి; తక్షక = తక్షకుడు అను; సర్ప = పాముయొక్క; విష = విషము అను; అనలంబునన్ = అగ్నివలన; తన = తన; కున్ = కు; మరణంబు = చావు కలుగును; అని = అని; ఎఱింగి = తెలిసికొన్నవాడై; సంగ = బంధములను; వర్జితుండు = విడిచిపెట్టిన వాడు; అయి = అయి; ముకుంద = హరియొక్క; పద = పాదములు అను; అరవింద = పద్మములమీద; భజనంబు = భక్తి; చేయుచు = చేయుచు; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుని = శ్రేష్ఠుని; వలనన్ = వలన; ఆత్మ = ఆత్మ పరమాత్మల గురించిన; విజ్ఞాన = విశిష్ట జ్ఞానము అను; సంపన్నుండు = సంపద కలవాడు; ఐ = అయి; గంగా = గంగ యొక్క; తటంబునన్ = ఒడ్డున; శరీరంబు = శరీరమును; విడిచి = విడిచిపెట్టి; నిర్గత = తొలగింపబడిన; భయ = భయము; శోకంబు = శోకము కలది; అయిన = అయినట్టి; లోకంబున్ = లోకమును; ప్రవేశించును = చేరును; అని = అని; జాతక = జాతకము గణన చేయగా వచ్చిన; ఫలంబు = ఫలితమును; చెప్పి = చెప్పి; లబ్ధ = పొంద బడిన; కాములు = కామములు కలవారు; అయి = అయిన; భూసురులు = బ్రాహ్మణులు; సనిరి = వెళ్ళిపోయిరి; అంతన్ = అంతట.

భావము:

ఈ బాలుడు ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపి, మునికుమారునివల్ల ప్రేరేపించబడిన తక్షకుని విషాగ్నిజ్వాలలచే తాను చనిపోతానని తెలుసుకొని సర్వసంగ పరిత్యాగియై, గోవింద చరణారవింద భజనానురాగియై, శుకయోగీంద్రులవల్ల బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గంగానదీతీరంలో శరీరాన్ని పరిత్యజించి భయశోకాలు లేని పుణ్య లోకానికి చేరుకుంటాడు-అని ఈ ప్రకారంగా బాలకుని భవిష్యత్తు ప్రకటించి, ధర్మరాజు ఇచ్చిన కానుకలు అందుకొని, భూసురోత్తములు సంతుష్టచిత్తులై వెళ్లిపోయారు.