పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షి జ్జన్మంబు

  •  
  •  
  •  

1-290-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ప్రటిత దైవయోగమునఁ బౌరవ సంతతి యంతరింపఁగా
విలత నొందనీక ప్రభవిష్ణుఁడు విష్ణుఁ డనుగ్రహించి శా
కుఁ బ్రతికించెఁ గావున నృపాలక! శాబకుఁ డింక శాత్రవాం
కుఁ డగు; విష్ణురాతుఁ డన ధాత్రిఁ బ్రసిద్ధికి నెక్కుఁ బూజ్యుఁడై"

టీకా:

ప్రకటిత = వ్యక్తమైన; దైవ = దైవముచే నిర్దేశించబడిన; యోగమునన్ = యోగము వలన; పౌరవ = పురువు; సంతతి = వంశము; అంతరింపఁగా = అంతరించుచుండగా; వికలత = చెదిరిపోవుట; ఒందనీక = సంభవించకుండగ; ప్రభవిష్ణుఁడు = కృష్ణుడు {ప్రభవిష్ణుడు, ప్రభవిష్ణువు - అవతరించు శీలము కలవాడు, సృష్టిగా పుట్టుకువచ్చే స్వభావము కలవాడు, విష్ణువు}; విష్ణుఁడు = కృష్ణుడు {విష్ణువు - 1. శ్రీమన్నారాయణుడు, హరి, 2. సృష్టికి లోపల బయట నిండి (వ్యాపించి) ఉన్నవాడు, 3. ద్వాదశాదిత్యులలో ఒకడు., 4వ్యు. విష - వ్యాప్తౌ + నుక్, విశ - ప్రవేశే + నుక్ పృషో, అన్నింటిలోనూ వ్యాపించిన యున్నవాడు, అన్నింటిలోనూ ప్రవేశించి యున్నవాడు}; అనుగ్రహించి = అనుగ్రహించి; శాబకున్ = పిల్లవాడిని; బ్రతికించెన్ = బ్రతుకునట్లు కాపాడెను; కావునన్ = అందువలన; నృపాలక = రాజా {నృపాలకుడు - నృ (నరులను) పాలకుడు (పరిపాలించెడివాడు), రాజు}; శాబకుడు = పిల్లవాడు; ఇంక = ఇక; శాత్రవ = శత్రువులను; అంతకుఁడు = అంతముచేయువాడు; అగున్ = అగును; విష్ణురాతుడు = విష్ణురాతుడు; అనన్ = అని; ధాత్రిన్ = భూమిమీద; ప్రసిద్ధి = మంచిపేరు; కిన్ = ను; ఎక్కున్ = పొందును; పూజ్యుఁడు = పూజింప తగువాడు; ఐ = అయి.

భావము:

"మహారాజా! ప్రఖ్యాతమైన దైవనియోగం వల్ల భారతవంశం అంతరించి పోకుండా ప్రభవిష్ణువైన శ్రీమహావిష్ణువు పరమానుగ్రహంతో ఈ పసిపాపను బ్రతికించాడు. ఈ బాలుడు, పగవారిపాలిటి లయకాలుడై విష్ణువుచేత రక్షించబడినందున విష్ణురాతు డనే నామంతో విఖ్యాతుడై, జగన్మాన్యుడౌతాడు."