పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షి జ్జన్మంబు

  •  
  •  
  •  

1-289-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత ననుకూల శుభగ్రహోదయంబును, సర్వగుణోత్తర ఫలసూచకంబును నైన శుభలగ్నంబునం బాండవ వంశోద్ధారకుం డయిన కుమారుండు జన్మించిన ధర్మనందనుండు ధౌమ్యాది భూసురవర్గంబు రప్పించి, పుణ్యాహంబు సదివించి జాతకర్మంబులు సేయించి కుమారు జన్మమహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబు లయిన గో భూ హిరణ్య హయానేక గ్రామంబులును స్వాదురుచిసంపన్నంబు లయిన యన్నంబు లిడిన వారలు తృప్తులై ధర్మపుత్రున కిట్లనిరి.

టీకా:

అంతన్ = అంతట; అనుకూల = అనుకూలమైన; శుభ = శుభప్రదమైన; గ్రహ = గ్రహములు; ఉదయంబును = కలుగుటయును; సర్వ = సమస్త; గుణ = మంచిగుణములకు; ఉత్తర = భవిష్యత్తులోని; ఫల = ఫలములను; సూచకంబునున్ = సూచించునవియును; ఐన = అయినట్టి; శుభ = శుభకరమైన; లగ్నంబునన్ = లగ్నములో; పాండవ = పాండురాజు పుత్రులకు; వంశ = వంశమును; ఉద్ధారకుండు = ఉద్ధరించువాడు; అయిన = అయినట్టి; కుమారుండు = పుత్రుడు; జన్మించినన్ = పుట్టగా; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; ధౌమ్య = ధౌమ్యుడు; ఆది = మొదలగు; భూసుర = బ్రాహ్మణుల {భూసురుడు - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు}; వర్గంబున్ = సమూహమును; రప్పించి = పిలిపించి; పుణ్యాహంబు = పుణ్యాహము అను శుద్ధి మంత్రములు; సదివించి = చదివించి; జాతకర్మంబులు = పిల్లలు పుట్టినప్పుడు చేయు కార్యక్రమము; చేయించి = చేయించి; కుమారు = పుత్రుని; జన్మ = పుట్టిన సందర్భపు; మహా = గొప్ప; ఉత్సవ = పండుగ; కాలంబునన్ = సమయమున; భూసురులు = బ్రాహ్మణులు {భూసురుడు - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు}; కున్ = కి; విభవ = వైభవముతో; అభిరామంబులు = మనోజ్ఞములు; అయిన = అయినట్టి; గో = గోవులను; భూ = భూములను; హిరణ్య = బంగారము; హయ = గుఱ్ఱములను; అనేక = అనేకమైన; గ్రామంబులును = గ్రామములను; స్వాదు = చక్కని; రుచి = రుచితో; సంపన్నంబులు = సమృద్ధములు; అయిన = అయినట్టి; అన్నంబులు = ఆహారములును; ఇడిన = ఇచ్చిన; వారలు = వారు; తృప్తులు = తృప్తి చెందిన వారు; ఐ = అయి; ధర్మపుత్రున = ధర్మరాజు {ధర్మపుత్రుడు - యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అనంతరం శుభగ్రహాలన్నీ ఉచ్చస్థానాల్లో ఉండగా, సర్వసౌభాగ్య సముదాత్తమైన ఉత్తమ ముహూర్తంలో, ఉత్తరకు పాండవ వంశోద్ధారకుడైన బాలుడు ఉద్భవించాడు. ధర్మరాజు ధౌమ్యుడు మొదలైన పురోహితులను పిలిపించి పుణ్యాహవాచనం, జాతకర్మాదులు జరిపించాడు. పుత్రోదయ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వర్తించి, భూసురోత్తములకు షడ్రసోపేత భోజనాలు పెట్టించి, గోవులూ భూములూ సువర్ణాలూ అశ్వాలూ అగ్రహారాలూ దానం చేసాడు. సంతుష్టులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు యుధిష్ఠిరుణ్ణి చూసి...