పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణుడు భామల జూడబోవుట

  •  
  •  
  •  

1-278-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన సూతుం డిట్లనియె;ధర్మనందనుండు చతుస్సముద్ర ముద్రి తాఖిల జంబూద్వీప రాజ్యంబు నార్జించియు; మిన్నుముట్టిన కీర్తి నుపార్జించియు; నంగనా, తురంగ, మాతంగ, సుభట, కాంచ నాది దివ్యసంపదలు సంపాదించియు; వీరసోదర, విప్ర, విద్వజ్జన వినోదంబులఁ బ్రమోదించియు, వైభవంబు లలవరించియుఁ; గ్రతువు లాచరించియు; దుష్టశిక్షణ శిష్టరక్షణంబు లొనరించియు; ముకుందచరణారవింద సేవారతుండై సమస్త సంగంబు లందు నభిలాషంబు వర్జించి యరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు సేయుచు.

టీకా:

అనినన్ = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; చతుస్ = నాలుగు; సముద్ర = సముద్రములచే; ముద్రిత = ఆవరింపబడిన; అఖిల = సమస్తమైన; జంబూ = జంబూ; ద్వీప = ద్వీపపు; రాజ్యంబున్ = రాజ్యమును; ఆర్జించియు = సంపాదించినప్పటికి; మిన్ను = ఆకాశమును; ముట్టిన = అంటిన; కీర్తిన్ = కీర్తిని; ఉపార్జించియు = సముపార్జించినప్పటికిని; అంగనా = స్త్రీలు; తురంగ = గుఱ్ఱములు; మాతంగ = ఏనుగులు; సుభట = మంచి యోధులు; కాంచన = బంగారము; ఆది = మొదలగు; దివ్య = దివ్యమైన; సంపదలు = సంపదలు; సంపాదించియున్ = సంపాదించినప్పటికిని; వీర = వీరులైన; సోదర = సోదరులు; విప్ర = బ్రాహ్మణులు; విద్వత్ = విద్వాంసులైన; జన = జనుల వలన; వినోదంబులన్ = వినోదములతో; ప్రమోదించియున్ = మిక్కిలి సంతోషించినప్పటికిని; వైభవంబులు = వైభవములను; అలవరించియున్ = పొందియున్; క్రతువులు = యజ్ఞములు; ఆచరించియున్ = చేసినప్పటికిని; దుష్ట = దుష్టులను; శిక్షణ = శిక్షించుట; శిష్ట = శిష్టులను; రక్షణంబులు = రక్షించుటలు; ఒనరించియున్ = ఏర్పరిచినప్పటికిని; ముకుంద = హరియొక్క; చరణ = పాదములనే; అరవింద = పద్మముల; సేవా = భక్తిమీద; రతుండు = మిక్కిలి ప్రేమ కలవాడు; ఐ = అయి; సమస్త = సమస్తమైన; సంఘంబులు = సంబంధములు; అందున్ = ఎడల; అభిలాషంబు = కోరికలను; వర్జించి = వదిలివేసి; అరిషడ్వర్గంబున్ = అరిషడ్వర్గములు {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములనెడి ఆరుగురు శత్రు కూటములు}; జయించి = జయించి; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచున్ = చేయుచు.

భావము:

అప్పుడు సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు ”ధర్మనందనుడు నాలుగు సముద్రాల నడుమ గల జంబూద్వీప సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఆకాశాన్నంటే అఖండకీర్తిని ఆర్జించాడు. అంగనామణులు, ఉత్తమాశ్వాలు, మత్త మాతంగాలు, సుభట నికాయాలు, సురుచిర సువర్ణాలు మొదలైన అపార సంపదలను సంపాదించాడు. వీరాధివీరులైన తన సోదరులతో, విద్వాంసులైన విప్రవరేణ్యుల విద్యావినోదాలతో ఆనందించాడు. భోగభాగ్యాలను కైవసం చేసుకొన్నాడు. యజ్ఞాలు ఆచరించాడు. దుష్టులను శిక్షించాడు. శిష్టులను రక్షించాడు. గోవింద పాదారవింద సేవారతుడై, సమస్త ఐహిక విషయాల యందు విరక్తుడై, అరిషడ్వర్గాన్ని జయించినవాడై రాజ్యపాలన సాగించాడు.