పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవిందుని ద్వారకాగమనంబు

  •  
  •  
  •  

1-249-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లాత్మారాముండునుఁ బూర్ణకాముండును నైన యప్పరమేశ్వరునికి నుపాయనంబు లిచ్చుచు నాగరులు వికసితముఖు లయి గద్గద భాషణంబుల తోడ డయ్యకుండ నడపునయ్యకు నెయ్యంపుఁ జూపుల నడ్డంబులేని బిడ్డల చందంబున మ్రొక్కి యిట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ఆత్మారాముండును = ఆత్మ యందే రమించు వాడును; పూర్ణకాముండును = పూర్ణమైన కోరికలు కలవాడు; ఐన = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుని = పరమమైన ఈశ్వరుని, కృష్ణుని; కిన్ = కి; ఉపాయనంబులు = కానుకలు; ఇచ్చుచున్ = ఇచ్చుచూ; నాగరులు = నగరమున నివశించువారు; వికసిత = వికసించిన; ముఖులు = ముఖము కలవారు; అయి = అయి; గద్గద = వణుకుచున్న గొంతుతో పలుకు; భాషణంబులు = మాటల; తోడన్ = తో; డయ్యకుండన్ = అలసిపోకుండగ; నడపున్ = నడిపించే; అయ్య = వాని; కున్ = కి; నెయ్యంపు = స్నేహపూరిత; చూపులన్ = చూపులతో; అడ్డంబు = అడ్డము; లేని = లేని; బిడ్డల = సంతానము; చందంబునన్ = వలె; మ్రొక్కి = నమస్కరించి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ఈ విధంగా ద్వారకాపుర పౌరులు ఆత్మారాముడు, సంపూర్ణకాముడు ఐన శ్యామసుందరునికి కానుకలు సమర్పించి ఆనందంతో వికసించిన ముఖాలు, హర్షగద్గద భాషణలు కలవారు అయి, తమను కంటికి రెప్పలా కాపాడే నల్లనయ్యకు, కన్నతండ్రికి చిన్నబిడ్డల వలె నమస్కరించి ఇలా పలికారు.