పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవిందుని ద్వారకాగమనంబు

  •  
  •  
  •  

1-247-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శంఖారావము వీనులన్ విని జనుల్ స్వర్ణాంబరద్రవ్యముల్
శంఖాతీతము గొంచు వచ్చిరి దిదృక్షాదర్పితోత్కంఠన
ప్రేంద్భక్తులు వంశ, కాహళ, మహాభేరీ, గజాశ్వావళీ
రింఖారావము లుల్లసిల్ల దనుజారిం జూడ నాసక్తులై.
^ మన సంఖ్యా మానము - శంఖము

టీకా:

శంఖా = శంఖముయొక్క; రావము = ధ్వని; వీనులన్ = చెవులతో; విని = వినినవారై; జనుల్ = ప్రజలు; స్వర్ణ = బంగారము; అంబర = వస్త్రములు; ద్రవ్యముల్ = ద్రవ్యములును; శంఖాతీతము = లెక్కకు మించినవి, అధికమైనన్ని {శంఖాతీతము - శంఖమునకు (మిక్కిలి పెద్ద సంఖ్యకు అనగా 10 ప్రక్కన 18 సున్నాలుండు సంఖ్యకు) మించినది, బహుఎక్కువైనది}; కొంచు = తీసికొనుచు; వచ్చిరి = వచ్చిరి; దిదృక్షా = దర్శించు కోరికతో; దర్పిత = తుళ్ళుతున్న; ఉత్కంఠన = ఉత్కంఠతో; ప్రేంఖత్ = చలించిన; భక్తులు = భక్తులు; వంశ = వేణవులు; కాహళ = బాకాలు; మహాభేరీ = పెద్దరాండోళ్ళు; గజ = ఏనుగులు; అశ్వ = గుఱ్ఱములు; ఆవళీ = వరుసలు; రింఖా = గిట్టల; రావములు = ధ్వనులు; ఉల్లసిల్ల = చెలరేగగా; దనుజారిన్ = కృష్ణుని {దనుజారి - దనుజు (రాక్షసు)లకు అరి (శత్రువు) , విష్ణువు, కృష్ణుడు}; చూడన్ = చూడవలెనను; ఆసక్తులు = ఆసక్తి కలవారు; ఐ = అయి.

భావము:

పాంచజన్య శంఖారావం చెవులలో పడగానే ప్రజలంతా ఉరకలేసే ఉత్సాహంతో, పరవళ్ళు తొక్కే భక్తితో, అతిశయించే ఆసక్తితో; వేణువులు, బాకాలు ఊదుతు, నగారాలు మ్రోగిస్తు, , ఏనుగులు చేస్తున్న గిట్టల చప్పుళ్లు చెలరేగుతుండగా, బంగారు వస్తువులు, విలువగల వలువలు మున్నగు కానుకలు లెక్కపెట్టలేనన్ని తీసుకు వచ్చి యదుకుల విభునికి ఎదురొచ్చారు.