పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధర్మనందన రాజ్యాభిషేకంబు

  •  
  •  
  •  

1-243-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు నానావిధంబులుగాఁ బలుకు పురసుందరుల వచనంబు లాకర్ణించి కటాక్షించి నగుచు నగరంబు వెడలె; ధర్మజుండును హరికి రక్షణంబులై కొలిచి నడువం జతురంగ బలంబులం బంచినఁ దత్సేనా సమేతులై దనతోడి వియోగంబున కోర్వక దూరంబు వెనుతగిలిన కౌరవుల మరలించి; కురుజాంగల, పాంచాల దేశంబులు దాటి; శూరసేన యామున భూములం గడచి; బ్రహ్మావర్త, కురుక్షేత్ర, మత్స్య, సారస్వత, మరుధన్వ, సౌవీరాభీర, సైంధవ, విషయంబు లతిక్రమించి’ తత్తద్దేశవాసు లిచ్చిన కానుకలు గైకొనుచు నానర్తమండలంబు సొచ్చి, పద్మబంధుండు పశ్చిమ సింధు నిమగ్నుం డయిన సమయంబునఁ బరిశ్రాంతవాహుండై చనిచని

టీకా:

అని = అని; ఇట్లు = ఈవిధముగ; నానా = అనేక; విధంబులుగా = రకములుగా; పలుకు = స్తుతించుచున్న; పుర = పురమున కల; సుందరుల = అందమైన వారి; వచనంబులు = మాటలు; ఆకర్ణించి = విని; కటాక్షించి = కడగంటి చూపులతో చూసి; నగుచున్ = నవ్వతూ; నగరంబున్ = పురమునుండి; వెడలెన్ = వెలువడెను; ధర్మజుండును = ధర్మరాజుకూడ; హరి = హరి; కిన్ = కి; రక్షణంబులు = రక్షణచేయునవి; ఐ = అయి; కొలిచి = సేవించి; నడువన్ = నడుచుచుండగ; చతురంగ = నాలుగు విభాగములు కల {చతురంగబలములు - రథములు, ఏనుగులు, గుఱ్ఱములు, కాల్బలములు. - 4సైనిక విభాగములు}; బలంబులన్ = సేనలను; పంచినన్ = పంపించగా; తత్ = ఆ; సేనా = సేనతో; సమేతులు = కూడినవారు; ఐ = అయి; తన = తన; తోడి = తోటి; వియోగంబున్ = ఎడబాటు; కున్ = నకు; ఓర్వక = ఓర్చుకొనలేక; దూరంబు = దూరము; వెను = వెంట; తగిలిన = వచ్చిన; కౌరవులన్ = కౌరవులను; మరలించి = వెనుకకు పంపి; కురు = కురుభూములందు; జాంగల = మెరకప్రదేశములు; పాంచాల = పాంచాల; దేశంబులు = దేశములు; దాటి = దాటి; శూరసేన = శూరసేన; యామున = యమున ఒడ్డున ఉన్న, యామున; భూములన్ = ప్రదేశములను; గడచి = దాటి; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తము; కురుక్షేత్ర = కురుక్షేత్రము; మత్స్య = మత్స్య; సారస్వత = సారస్వత; మరుధన్వ = మరుధన్వ; సౌవీర = సౌవీర; ఆభీర = ఆభీర; సైంధవ = సైంధవ; విషయంబులు = ప్రదేశములు; అతిక్రమించి = దాటి; తత్తత్ = ఆయా; దేశవాసులు = దేశములలో నివసించు వారు; ఇచ్చిన = ఇచ్చినట్టి; కానుకలు = కానుకలను; కైకొనుచున్ = స్వీకరించుచు; ఆనర్త మండలంబు = ఆనర్తమండలము {కృష్ణుని ద్వారక ఆనర్త మండలము లో ఉన్నది}; చొచ్చి = ప్రవేశించి; పద్మబంధుండు = సూర్యుడు {పద్మబంధుడు - పద్మములకు బంధువు, సూర్యుడు}; పశ్చిమ = పడమటి; సింధున్ = సముద్రమున; నిమగ్నుండు = క్రుంకినవాడు; అయిన = అయిన; సమయంబునన్ = వేళకు; పరిశ్రాంత = అలసిన; వాహుండు = గుఱ్ఱములు కలవాడు; ఐ = అయి; చనిచని = వెళ్ళివెళ్ళి.

భావము:

అలా పలు విధాల సంభాషించుకొంటున్న పౌర కాంతామణుల పలుకులు వింటూ, క్రీగంటి చూపులతో కనుగొంటూ, మందహాస వదనారవిందంతో, గోవిందుడు మున్ముందుకు సాగాడు. ధర్మరాజు శ్రీకృష్ణునికి అంగరక్షకులుగ చతురంగబలాలను పంపించాడు. ఆ సైన్యంతో పాటు తన ఎడబాటుకు ఓర్వలేక సాగనంపడానికి బహుదూరం వచ్చిన పాండునందనులను వెనుకకు పంపించి, వసుదేవనందనుడు యమునాతీరంలో ఉన్న కురుజాంగల పాంచాల శూరసేన దేశాలు దాటాడు. బ్రహ్మావర్తాన్నీ, కురుక్షేత్రాన్ని గడిచాడు. మత్స్య సారస్వత మరుధన్వ దేశాల గుండా సాగి ఆభీర సౌవీర సింధుదేశాలను దాటాడు. ఆ యా దేశప్రజలు సమర్పించిన కానుకలు అందుకొంటు ద్వారకానగరం అంతర్భాగంగా గల ఆనర్తమండలాన్ని ప్రవేశించాడు. సంధ్యాసమయం సమీపించింది. అశ్వాలు అలిసిపోయాయి. అలానే ప్రయాణం కొనసాగిస్తూ...