పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధర్మనందన రాజ్యాభిషేకంబు

  •  
  •  
  •  

1-236-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తత్సమయంబునం బౌరసుందరులు ప్రాసాదశిఖరభాగంబుల నిలిచి గోపాలసుందరుని సందర్శించి, వర్గంబులై మార్గంబు రెండు దెసల గరారవిందంబులు సాచి యొండొరులకుం జూపుచుం దమలోనం దొల్లి గుణంబులం గూడక జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు బ్రవర్తింపని సమయంబున నొంటి దీపించు పురాణపురుషుం డితం డనువారును; జీవులకు బ్రహ్మత్వంబు గలుగ లయంబు సిద్ధించుట యెట్లనువారును; జీవనోపాధి భూతంబు లయిన సత్త్వాదిశక్తుల లయంబు జీవుల లయం బనువారునుఁ; గ్రమ్మఱ సృష్టికర్త యైన యప్పరమేశ్వరుండు నిజవీర్యప్రేరితయై నిజాంశ భూతంబు లైన జీవులకు మోహిని యగుచు సృష్టి సేయ నిశ్చయించి నామ రూపంబులు లేని జీవు లందు నామరూపంబులు గల్పించుకొఱకు వర్తిల్లు స్వమాయ నంగీకరించు ననువారును; నిర్మలభక్తి సముత్కంఠావిశేషంబుల నకుంఠితులై జితేంద్రియులగు విద్వాంసు లిమ్మహానుభావు నిజరూపంబు దర్శింతు రను వారును; యోగమార్గంబునం గాని దర్శింపరాదను వారునునై; మఱియును.

టీకా:

తత్ = ఆ; సమయంబునన్ = సమయములో; పౌర = నగరమందలి; సుందరులు = స్త్రీలు; ప్రాసాద = మేడల; శిఖర = చివరి, డాబాలపై; భాగంబులన్ = భాగములందు; నిలిచి = నిలువబడి; గోపాలసుందరుని = గోపాలురలో సుందరుని, కృష్ణుని; సందర్శించి = చూసి; వర్గంబులు = వరుసలు తీరినవారు; ఐ = అయి; మార్గంబుల = వీధులకు; రెండు దెసలన్ = రెండుపక్కల; కర = చేతులు అనే; అరవిందంబులు = పద్మములు; సాచి = చాచి; ఒండొరుల = ఒకరింకొకరు; కున్ = కి; చూపుచున్ = చూపుకొనుచూ; తమలోనన్ = తమలోతాము; తొల్లి = పూర్వము; గుణంబులన్ = గుణములు {త్రిగుణములు - 1శాంతవృత్తిగల సత్వగుణము 2ఘోరవృత్తిగల రజోగుణము 3మూఢవృత్తిగల తమోగుణము అనెడి; మూడుగుణములు}; కూడక = కలిగి ఉండక; జీవులు = సర్వ జనులు; లీన = పరబ్రహ్మలో లీనమైన; రూపంబులు = రూపములగలవి; ఐ = అయి; ఉండన్ = ఉండగా; ప్రపంచంబు = ప్రపంచము; ప్రవర్తింపని = నడచుట ఉండని; సమయంబున = సమయములో; ఒంటిన్ = ఒంటరిగా; దీపించు = ప్రకాశించు; పురాణ = పురాతనమైన; పురుషుండు = పురుషుడు; ఇతండు = ఇతడు; అను = అనెడి; వారును = వారును; జీవులు = మానవులు; కున్ = కు; బ్రహ్మత్వంబు = బ్రహ్మత్త్వము; కలుగ = కలుగగ; లయంబు = లయము {లయము - జీవాత్మ బ్రహ్మాత్మలో లయించుట}; సిద్ధించుట = సిద్ధించుట; ఎట్లు = ఏవిధముగ సాధ్యము; అను = అనెడి; వారును = వారును; జీవన = జీవనమునకు; ఉపాధి = ఆధార; భూతంబులు = భూతములు; అయిన = అయినట్టి; సత్త్వ = సత్త్వము; ఆది = మొదలగు; శక్తుల = శక్తుల; లయంబు = లయము; జీవుల = జీవుల; లయంబు = లయము; అను = అనెడి; వారును = వారును; క్రమ్మఱ = మరల; సృష్టి = సృష్టిని; కర్త = చేయువాడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; పరమేశ్వరుండు = పరమమైన ఈశ్వరుడు; నిజ = తనయొక్క; వీర్య = వీరత్వమువలన; ప్రేరిత = ప్రేరింపబడినది; ఐ = అయి; నిజ = తన; అంశ = అంశతో; భూతంబులు = కూడినవి; ఐన = అయినట్టి; జీవులు = జీవులు; కున్ = కు; మోహిని = మోహింపజేయునది; అగుచున్ = అవుతూ; సృష్టి = సృష్టి; చేయన్ = చేయుటకు; నిశ్చయించి = నిశ్చయించుకొని; నామ = పేర్లుగాని; రూపంబులు = రూపములుగాని; లేని = లేనట్టి; జీవులు = జీవులు; అందున్ = లో; నామ = నామములు; రూపంబులు = రూపములు; కల్పించు = ఏర్పరుచుట; కొఱకున్ = కోసము; వర్తిల్లు = ప్రవర్తిల్లు; స్వ = తనయొక్క; మాయన్ = మాయను; అంగీకరించున్ = అంగీకరించును; అను = అనెడి; వారును = వారును; నిర్మల = నిర్మలమైన; భక్తి = భక్తివలన; సముత్ = మిక్కిలి; ఉత్కంఠా = ఉత్కంఠల యొక్క; విశేషంబుల = విశిష్టలతో; అకుంఠితులు = కుంటుపడనివారు; ఐ = అయి; జిత్ = జయించిన; ఇంద్రియులు = ఇంద్రియములు కలవారు; అగు = అయినట్టి; విద్వాంసులు = పండితులు; ఈ = ఈ; మహానుభావు = మహానుభావుని యొక్క; నిజ = స్వంత; రూపంబు = రూపమును; దర్శింతురు = దర్శింప కలరు; అను = అనెడి; వారును = వారును; యోగ = యోగపద్ధతి; మార్గంబునన్ = పాటించుట ద్వారా; కాని = కాని; దర్శింప = దర్శించుటకు; రాదు = వీలుకాదు; అను = అనెడి; వారును = వారును; ఐ = అయి; మఱియును = ఇంకనూ.

భావము:

ఆ సమయంలో బహుసుందరుడైన గోపాలకష్ణుని దర్శించడానికి హస్తినానగరకాంతలు నగరంలోని భవనాలపై కెక్కారు. మార్గానికి ఇరువైపుల గుంపులు గూడి చేతులు చాపి వాసుదేవుణ్ణి ఒకరికొకరు చూపించుకోసాగారు. సృష్టి ఆదిలో జీవులు త్రిగుణాలతో కూడక ముందు, ప్రపంచం అంతా ఆయనలో లీనమై ఉండేది అని; అద్వితీయమైన పరబ్రహ్మ స్వరూప మీయనే అని కొందరు అంటున్నారు; జీవులకు పరబ్రహ్మత్వం కలిగితే లయం అనేది ఎలా కలుగుతుంది అని కొందరు అంటున్నారు; జీవనాలకి ఉపాధిభూతాలైన సత్వాది శక్తులు లయం కావటమే జీవుల లయం అని కొందరు చెప్తున్నారు; మరల సృష్టికి కారణభూతు డైన విశ్వేశుని ఆత్మ శక్తిచేత తన మాయను చేపట్టి నామరూపాలు లేని జీవులందు నామరూపాలు ఏర్పరచాడు అని కొందరు చెప్తున్నారు; నిర్మలమైన భక్తిగలవారు, కుంటుపడని ఉత్కంఠభరిత యత్నులై, జితేంద్రియులైన పరమ జ్ఞానులు ఈ భగవానుని దర్శించగలరు అని మరికొందరు అంటున్నారు; యోగ మార్గం ద్వారా తప్ప పరమేశ్వర సాక్షాత్కారం అసాధ్య మని యింకొందరు అంటున్నారు.