పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధర్మనందన రాజ్యాభిషేకంబు

  •  
  •  
  •  

1-234-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతఁ గృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయు కొఱకును, సుభద్రకుఁ బ్రియంబు సేయు కొఱకును, గజపురంబునం గొన్ని నెలలుండి ద్వారకానగరంబునకుం బ్రయాణంబు సేయం దలంచి, ధర్మనందనునకుం గృతాభివందనుం డగుచు నతనిచే నాలింగితుండై, యామంత్రణంబు వడసి, కొందఱు దనకు నమస్కరించినం గౌఁగలించుకొని, కొందఱు దనుం గౌఁగిలింప నానందించుచు, రథారోహణంబు సేయు నవసరంబున సుభద్రయు, ద్రౌపదియుఁ, గుంతియు, నుత్తరయు, గాంధారియు, ధృతరాష్ట్రుండును, విదురుండును, యుధిష్ఠిరుండును, యుయుత్సుండును, గృపాచార్యుండును, నకుల, సహదేవులును, వృకోదరుండును, ధౌమ్యుండును సత్సంగంబు వలన ముక్తదుస్సంగుం డగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరం బగు నెవ్వని యశంబు నాకర్ణించి విడువ నోపం డట్టి హరి తోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనంబులవలన నిమిషమాత్రంబును హరికి నెడ లేని వారలైన పాండవులం గూడికొని హరి మరలవలయునని కోరుచు హరి చనిన మార్గంబు సూచుచు హరి విన్యస్త చిత్తు లయి లోచనంబుల బాష్పంబు లొలుక నంత నిలువంబడి రయ్యవసరంబున.

టీకా:

అంతన్ = అంతట; కృష్ణుండు = కృష్ణుడు; చుట్టాలు = బంధువులు; కున్ = కు; శోకంబు = బాధ; లేకుండన్ = లేకుండగ; చేయు = చేయుట; కొఱకును = కోసమును; సుభద్ర = సుభద్ర; కున్ = కు; ప్రియంబు = సంతోషము; చేయు = కలుగ చేయుట; కొఱకును = కోసమును; గజపురంబునన్ = హస్తినాపురములో; కొన్ని = కొన్ని; నెలలు = నెలలు; ఉండి = ఆగి ఉండి; ద్వారకా = ద్వారక అను; నగరంబున్ = నగరము; కున్ = నకు; ప్రయాణంబు = ప్రయాణము; చేయన్ = చేయ వలెనని; తలంచి = అనుకొని; ధర్మనందనున = ధర్మరాజున {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; కున్ = కు; కృత = చేసిన; అభివందనుండు = నమస్కారము కలవాడు; అగుచున్ = అవుతూ; అతని = అతని; చేన్ = చేత; ఆలింగితుండు = కౌగలింపబడినవాడు; ఐ = అయి; ఆమంత్రణంబు = అనుమతి; వడసి = పొంది; కొందఱు = కొందరు; తన = తన; కున్ = కు; నమస్కరించినన్ = నమస్కారముచేసిన; కౌఁగలించుకొని = ఆలింగనము చేసికొని; కొందఱు = కొందరు; తనున్ = తనను; కౌఁగిలింపన్ = ఆలింగనముచేయగ; ఆనందించుచున్ = సంతోషించుచు; రథ = రథమును; ఆరోహణంబున్ = ఎక్కుట; చేయు = చేయుచున్న; అవసరంబునన్ = సమయమున; సుభద్రయున్ = సుభద్ర; ద్రౌపదియున్ = ద్రౌపది; కుంతియున్ = కుంతి; ఉత్తరయున్ = ఉత్తర; గాంధారియున్ = గాంధారి; ధృతరాష్ట్రుండును = ధృతరాష్ట్రుడును; విదురుండును = విదురుడును; యుధిష్ఠిరుండును = యుధిష్టరుడును; యుయుత్సుండును = యుయుత్సుడును; కృపాచార్యుండును = కృపాచార్యుడును; నకుల = నకులుడును; సహదేవులును = సహదేవుడును; వృకోదరుండును = భీముడును {వృకోదరుడు - వృకము వంటి పొట్ట ఉన్నవాడు, భీముడు}; ధౌమ్యుండును = ధౌమ్యుడును; సత్ = మంచివారితో; సంగంబు = కలిసి ఉండుట; వలనన్ = వలన; ముక్త = విడువబడిన; దుర్ = చెడ్డవారి; సంగుండు = చేరిక గల వాడు; అగు = ఐన; బుధుండు = జ్ఞాని; సకృత్కాల = ఎప్పుడైనా ఒకసారి; సంకీర్త్యమానంబు = స్తుతింపబడినది; ఐ = అయినను; రుచికరంబు = రుచించునది; అగున్ = అగునదై; ఎవ్వని = ఎవని యొక్క; యశంబు = కీర్తిని; ఆకర్ణించి = విని; విడువనోపండు = వదిలిపెట్టలేడో; అట్టి = అటువంటి; హరి = కృష్ణుని; తోడి = తోని; వియోగంబున్ = దూరమగుటను, విరహము; సహింపక = ఓర్చుకొనలేక; దర్శన = కనిపించుట; స్పర్శన = తాకుట; ఆలాప = కలిసి మాట్లాడుట; శయన = కలిసి పండుకొనుట; ఆసన = కలిసి కూర్చుండుట; భోజనంబుల = కలిసి తినుటలు; వలనన్ = వలన; నిమిష = నిమిషము; మాత్రంబును = మాత్రపు సమయమైన; హరి = హరి; కిన్ = కి; ఎడ = దూరముగా; లేని = ఉండలేని; వారలు = వారు; ఐన = అయిన; పాండవులన్ = పాండురాజు పుత్రులను; కూడికొని = కలిసి ఉంటూ; హరి = హరి; మరల = వెనుకకు వచ్చుట; వలయునని = చేయవలెనని; కోరుచున్ = కోరుతూ; హరి = హరి; చనిన = వెళ్ళిన; మార్గంబున్ = దారిని; సూచుచున్ = చూస్తూ; హరి = హరి యందు; విన్యస్త = ఉంచబడిన; చిత్తులు = చిత్తము కలవారు; అయి = అయి; లోచనంబులన్ = కన్నులనుండి; బాష్పంబులు = కన్నీరు; ఒలుకన్ = కారుచుండగా; అంతన్ = అక్కడే; నిలువంబడిరి = నిలుచుండిరి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమున.

భావము:

ప్రియ సోదరి సుభద్ర మనస్సుకు సంతోషం సమకూర్చుటం కోసం, బంధువులైన పాండవుల శోకం పోకార్చటం కోసం, యశోదానందనుడు హస్తినాపురంలో కొన్ని మాసాలపాటు ఉండి, పిమ్మట తన నగరానికి బయలుదేరాడు. తనకు అభివందనాలు సమర్పిస్తున్న నందనందనుణ్ణి ధర్మనందనుడు ఆనందంతో అభినందించి ఆలింగనం చేసుకొని వీడ్కోలిచ్చాడు. అనంతరం శ్రీకృష్ణుడు కొందరి నుండి నమస్కారాలు అందుకొన్నాడు. కొందరిని కౌగిలించుకొన్నాడు. కొందరు తనను కౌగిలించుకొనగా వారికి శుభాకాంక్ష లందించాడు. సజ్జనసాంగత్యం వల్ల దుర్జన సాంగత్యాన్ని పరిత్యజించిన బుద్ధిమంతుడు హరి మధురగాథలు ఒక్కమాటు వింటే మళ్లీ విడిచి పెట్టలేడు. అలాగ గోవిందుడు రథం ఎక్కబోతున్న సమయంలో సుభద్రా ద్రౌపదులు, కుంతీ గాంధారులు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు, యుయుత్సుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీమసేనుడు, ధౌమ్యుడు మొదలైన వారంతా, శ్రీకృష్ణుని ఎడబాటు సహించలేనివారయ్యారు. అనుక్షణం ఆయనను చూస్తు, తాకుతు, మాట్లాడుతు, ఆయనతో కలిసి శయనిస్తు, కూర్చుంటు, భుజిస్తు ఉండే పాండవులతో పాటు శ్రీకృష్ణుడు వెనుకకు మరిలి రావాలని అభిలషిస్తు, ఆయన వెళ్లిన మార్గాన్ని అవలోకిస్తు, హరిమయాలైన హృదయాలతో, అశ్రు నయనాలతో అల్లంత దూరంలో నిలబడి పోయారు.