పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధర్మనందన రాజ్యాభిషేకంబు

  •  
  •  
  •  

1-232-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబు గాని స్వతంత్రంబుగా దనునది మొదలగు భీష్ముని వచనంబులం గృష్ణుని సంభాషణంబుల ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును నివర్తిత శంకా కళంకుండునునై నారాయణాశ్రయుం డైన యింద్రుండునుం బోలెఁ జతుస్సాగరవేలాలంకృతం బగు వసుంధరామండలంబు సహోదర సహాయుండై యేలుచుండె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; జగంబు = ప్రపంచము; పరమేశ్వర = పరమమైన ఈశ్వరునికి, హరికి; ఆధీనంబు = లోబడి ఉండునది; కాని = కాని; స్వతంత్రంబు = స్వంతముగా నియత్రించుకొనగలది; కాదు = కాదు; అనునది = అన్నది; మొదలగు = మొదలగు; భీష్ముని = భీష్ముని; వచనంబులన్ = ఉపదేశములవలనను; కృష్ణుని = కృష్ణుని; సంభాషణంబులన్ = ఉపదేశములవలనను; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; ప్రవర్ధమాన = పెరుగుచున్న; విజ్ఞానుండును = విజ్ఞానము కలవాడును; నివర్తిత = నివృత్తి చేయబడిన; శంక = అనుమానము అను; కళంకుండును = మచ్చకలవాడును; ఐ = అయి; నారాయణ = హరి {నారాయణుడు - 1.నారములందు వసించు వాడు, శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), 2. నారాయణశబ్ద వాచ్యుడు, వ్యు. నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః, నరసమూహమున నివాసముగలవాడు, విష్ణువు,}; ఆశ్రయుండు = ఆశ్రయించినవాడు; ఐన = అయిన; ఇంద్రుండునున్ = ఇంద్రుడును; పోలెన్ = వలె; చతుస్ = నాలుగు; సాగర = సముద్రములు; వేల = సరిహద్దులుగా; అలంకృతంబు = అలంకరింపబడినది; అగు = అయినట్టి; వసుంధర = భూ; మండలంబు = మండలమును; సహోదర = సోదరుల యొక్క; సహాయుండు = సహాయము కలవాడు; ఐ = అయి; ఏలుచుండెన్ = పరిపాలించుచుండెను.

భావము:

ఈ విధంగా భీష్మాచార్యుని ఉపదేశాలవల్ల, శ్రీకృష్ణుని ప్రబోధాలవల్ల ధర్మరాజు జగత్తు స్వతంత్ర మైనది కాదు పరమేశ్వరాధీనం మొదలైన విజ్ఞానాన్ని పెంపొందించుకొని, తన సందేహా లన్నింటిని నివర్తించుకొని, ఉపేంద్రుని సహాయంతో అతిశయించే మహేంద్రుని వలె, శ్రీకృష్ణుని అండదండలతో చతుస్సముద్ర ముద్రితమైన మహీమండలాన్ని సహచరుల సహాయంతో పరిపాలించసాగాడు.