పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : భీష్మనిర్యాణంబు

  •  
  •  
  •  

1-218-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పీతాంబరధారియుఁ, జతుర్భుజుండు, నాదిపూరుషుండు, బరమేశ్వరుండు, నగు హరియందు నిష్కాముండై, విశుద్ధం బగు ధ్యానవిశేషంబుచే నిరస్తదోషుఁ డగుచు, ధారణావతియైన బుద్ధిని సమర్పించి, పరమానందంబు నొంది, ప్రకృతివలన నైన సృష్టిపరంపరలఁ బరిహరించు తలపున మందాకినీ నందనుం డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పీతాంబరధారియున్ = కృష్ణుడు {పీతాంబరధారి - పచ్చని వస్త్రములు ధరించువాడు, హరి}; చతుర్భుజుండున్ = కృష్ణుడు {చతుర్భుజుడు - నాలుగు చేతులవాడు, విష్ణువు, విష్ణుసహస్రనామములలోని 140వ నామము}; ఆదిపూరుషుండున్ = కృష్ణుడు {ఆదిపురుషుడు - సృష్టికి మొదటినుండి ఉన్న పురుషుడు (కారకుడు), విష్ణువు}; పరమేశ్వరుండున్ = కృష్ణుడు {పరమేశ్వరుడు - పరమమైన ఈశ్వరుడు, సర్వోత్కృష్టమైన మరియు సర్వుల (బ్రహ్మాది పిపీలకపర్యంతము)ను నియమించు వాడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు}; అగు = అయిన; హరి = కృష్ణుని {హరి - సర్వ దుఃఖములను, పాపములను హరించు వాడు, ప్రళయకాలమున సర్వము తన గర్భమున హరించుకొనువాడు, విష్ణువు, హకారముతో కూడిన నిశ్వాసము రేఫతో కూడిన కంఠనాదము - ఓంకారము}; అందున్ = అందు; నిష్కాముండు = కోరికలు లేనివాడు; ఐ = అయి; విశుద్ధంబు = మిక్కిలి శుద్ధమైనది; అగు = అయిన; ధ్యాన = ధ్యానము యొక్క; విశేషంబు = విశిష్ఠిత; చేన్ = చేత; నిరస్త = తొలగింపబడిన; దోషుండు = దోషములు గలవాడు; అగుచు = అవుతూ; ధారణావతి = ధారణకలిగినది {ధారణావతి - ధారణా భగవంతునిఁ దప్ప మఱియొకటి నెఱుఁగమి, (ఇది యోగాంగములలో నొకటి)}; (ఇది యోగాంగములలో నొకటి)}; ఐన = అయిన; బుద్ధిని = బుద్ధిని; సమర్పించి = లగ్నముచేసి; పరమ = పరమమైన; ఆనందంబునన్ = ఆనంద స్థితిని; ఒంది = పొంది; ప్రకృతి = ప్రకృతి; వలనన్ = సిద్ధము; ఐన = అయిన; సృష్టిపరంపరలన్ = పునర్జన్మములను; పరిహరించు = నివారించు; తలపున = ఉద్దేశముతో; మందాకినీనందనుండు = భీష్ముడు {మందాకినీనందనుడు - గంగాదేవి పుత్రుడు, భీష్ముడు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

మందాకినీనందను డైన భీష్ముడు సమస్త దోషాలను నిరస్తం చేసి నిష్కామభావంతో, నిర్మలధ్యానంతో పీతాంబరధురుడు, చతుర్భుజుడు, పురాణపురుషుడు, పరమేశ్వరుడు అయిన గోవిందుని యందు ఏకాగ్రబుద్ధిని సంధానించి పరమానంద భరితుడై ప్రకృతిసిద్ధాలైన సంసారబంధాలను పరిహరించే ఉద్ధేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడు