పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృతిపతి నిర్ణయము

  •  
  •  
  •  

1-23-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భాసిల్లెడు శ్రీ మహాభాగవతపురాణ పారిజాత పాదపసమాశ్రయంబునను, హరికరుణావిశేషంబునను గృతార్థత్వంబు సిద్ధించె నని, బుద్ధి నెఱింగి లేచి మరలి కొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి; యందు గురు, వృద్ధ, బుధ, బంధుజనానుజ్ఞాతుండనై.

టీకా:

ఇట్లు = ఈ విధంగా; భాసిల్లెడు = ప్రకాశించే; శ్రీ = శుభప్రదమైన; మహా = గొప్ప; భాగవత = భగవంతుని గురించిన; పురాణ = పురాణమనే; పారిజాత = పారిజాత; పాదప = వృక్షమును; సమ = చక్కగా; ఆశ్రయంబునన్ = ఆశ్రయించుట వలనను; హరి = విష్ణుని; కరుణా = దయయొక్క; విశేషంబునను = విశిష్టత్వంవలనను; కృతార్థత్వంబు = ప్రయోజనకరమైనది; సిద్ధించెనని = సిద్దించిందని; బుద్ధిని = బుద్ధియందు; ఎఱింగి = గ్రహించి; లేచి = లేచి (ధ్యానస్థానంనుంచి); మరలి = వెనుకకు వచ్చి; కొన్ని = కొన్ని; దినంబుల = రోజుల; కున్ = కు; ఏకశిలానగరంబున = ఏకశిలానగరాని; కున్ = కి; చనుదెంచి = చేరి; అందున్ = అందు; గురు = గురువులు; వృద్ధ = పెద్దలు; బుధ = జ్ఞానవంతులు; బంధు = బంధువులు; జన = ఐన జనులచే; అనుజ్ఞాతుండన్ = అనుమతి పొందినవాడిని; ఐ = అయి.

భావము:

ఈ విధం బహు ప్రకాశమానమైన పురాణరాజమైన భాగవతం అనే కల్పవృక్షాన్ని సమాశ్రయించటం వల్ల, శ్రీహరి విశేషంగా అనుగ్రహించటం వల్ల నా జన్మ చరితార్థమైంది అని చక్కగా అర్థమైంది. అప్పుడు నేను ఆ నదీ ప్రదేశం నుంచి కదలి కొన్నాళ్ళకు ఏకశిలానగరానికి తిరిగివచ్చాను. అక్కడ గురువులూ, వృద్ధులూ, పండితులూ, బంధువులూ మొదలైన పెద్దలందరి అనుజ్ఞ తీసుకున్నాను.