పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృతిపతి నిర్ణయము

  •  
  •  
  •  

1-15-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచవిరచనాకుతూహలుండనై, యొక్క రాకా నిశాకాలంబున సోమోపరాగంబు రాకఁ గని, సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగభంగ యగు గంగకుం జని, క్రుంకులిడి వెడలి, మహనీయ మంజుల పులినతలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచుఁ, గించి దున్మీలిత లోచనుండనై యున్న యెడ.

టీకా:

అని = అని పలికి; మఱియున్ = ఇంకా; మదీయ = నాయొక్క; పూర్వ = క్రితపు; జన్మ = జన్మలు; సహస్ర = వేలకొలదుల లోను; సంచిత = సంపాదించిన; తపః = తపస్సుల యొక్క; ఫలంబున = ఫలితము వలనను; శ్రీమన్ = శోభనకరమైన; నారాయణ = హరియొక్క; కథా = కథల; ప్రపంచ = మొత్తం సమూహాన్ని; విరచనా = రచించాలనే; కుతూహలుండను = బలీయమైన కోరికగల వాడను; ఐ = అయి; ఒక్క = ఒక; రాకా = పౌర్ణమి నాటి; నిశా = రాత్రి; కాలంబున = కాలంలో; సోమ = చంద్ర; ఉపరాగంబు = గ్రహణము; రాకన్ = వస్తుందని; కని = తెలిసికొని; సజ్జన = సజ్జనుల; అనుమతంబున = అనుమతితో; అభ్రంకష = ఆకాశమును; కష = ఒరసుకనేలా; శుభ్ర = శుభ్రమైన; సముత్తుంగ = పెద్ద; భంగ = అలలు కలది; అగు = అగు; గంగ = గంగానది; కున్ = కి; చని = వెళ్ళి; క్రుంకులు = మునుగుటలు - స్నానము; ఇడి = చేసి; వెడలి = బయటకువచ్చి; మహనీయ = గొప్పదైన; మంజుల = మనోహరమైన; పులిన = ఇసుకతిన్నెల; తలంబున = గట్టుమీద; మహేశ్వర = శివుని; ధ్యానంబు = ధ్యానం; సేయుచున్ = చేస్తూ; కించిత్ = కొంచెము; ఉన్మీలిత = తెరచిన; లోచనుండను = కన్నులుగలవాడను; ఐ = అయి; ఉన్న = ఉన్నటువంటి; ఎడ = సమయములో.

భావము:

వేల వేల జన్మలు ఎత్తి కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. ఒక పున్నమి రాత్రి చంద్రగ్రహణం ఉంది. అవాళ చందమామ నిండుగా ఉన్నాడు. పండు వెన్నెలలు కురుస్తున్నాయి. పెద్దల అనుజ్ఞ పొంది ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహిస్తున్న గౌతమీగంగకు వెళ్లాను. ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఒక తెల్లని ఇసుక తిన్నెమీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చున్నాను. అప్పుడు....