పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధర్మజుడు భీష్ముని కడ కేగుట

  •  
  •  
  •  

1-217-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లాపంబులు మాని, చిత్తము మనీషాయత్తముం జేసి, దృ
గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి, తత్కారుణ్యదృష్టిన్ విని
ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి, భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీహరిన్, శ్రీహరిన్.

టీకా:

ఆలాపంబులు = సంభాషణములు; మాని = మానివైచి; చిత్తము = మనసును; మనీషా = ప్రజ్ఞకు; ఆయత్తమున్ = లొంగినదిగా; చేసి = చేసి; దృక్ = చూపుల; జాలంబున్ = సమూహమును, వలను; హరి = కృష్ణుని; మోము = ముఖము; పైన్ = మీద; పఱపి = నిలిపి ఉంచి; తత్ = అతని; కారుణ్య = దయతోకూడిన; దృష్టిన్ = దృష్టితో; వినిర్మూలీ = పూర్తిగానిర్మూలనము; భూత = చేయబడిన; శర = అమ్ములవలన కలిగిన; వ్యధా = బాధల యొక్క; నిచయుఁడు = సమూహముగలవాడు; ఐ = అయి; మోదించి = మిక్కిలి సంతోషము పొంది; భీష్ముండు = భీష్ముడు; సంశీలంబు = మంచి నడత; ఒప్పన్ = ఒప్పుచుండగ; నుతించెన్ = స్తుతించెను; కల్మష = పాపములనే; గజ = ఏనుగుల; శ్రేణీ = సమూహమును; హరిన్ = హరించువానిని, కృష్ణుని; శ్రీహరిన్ = శ్రీకృష్ణుని.

భావము:

అటుపిమ్మట గాంగేయుడు మౌనం వహించి మనస్సును ఏకాగ్రం చేసుకొని తన చూపులన్నీ గోపాలదేవుని ముఖమండలంపై కేంద్రీకరించాడు; కమలాక్షుని దాక్షిణ్యపూరిత కటాక్షవీక్షణం వల్ల ఆయనకి బాణాల బాధలన్ని ఉపశమించాయి; అంతట శాంతశీలుడైన శంతనపుత్రుడు సంతోషించి కలుషాలనే గజసమూహాన్ని చించి చెండాడే యదు సింహుణ్ణి నుతించాడు.