పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధర్మజుడు భీష్ముని కడ కేగుట

  •  
  •  
  •  

1-214-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున దైవతంత్రంబైన పనికి వగవం బని లేదు; రక్షకులు లేని ప్రజల నుపేక్షింపక రక్షింపఁ బుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు, తేజోనిరూఢుండు గాక యాదవులందు గూఢుండై తన మాయచేత లోకంబుల మోహాతిరేకంబు నొందించు; నతని రహస్యప్రకారంబులు భగవంతుండైన పరమేశ్వరుం డెఱుంగు; మఱియు దేవర్షి యగు నారదుండును, భగవంతుం డగు కపిలమునియు, నెఱుంగుదురు; మీరు కృష్ణుండు దేవకీపుత్త్రుం డగు మాతులేయుం డని తలంచి దూత, సచివ, సారథి, బంధు, మిత్ర, ప్రయోజనంబుల నియమింతు; రిన్నిటం గొఱంత లేదు; రాగాదిశూన్యుండు, నిరహంకారుండు, నద్వయుండు, సమదర్శనుండు, సర్వాత్మకుండు, నయిన యీశ్వరునకు నతోన్నతభావ, మతివైషమ్యంబు లెక్కడివి, లే; వయిన భక్తవత్సలుండు గావున నేకాంతభక్తులకు సులభుండై యుండు.

టీకా:

కావునన్ = అందువలన; దైవ = దేవునిచేత; తంత్రంబు = పన్నబడినది; ఐన = అయినట్టి; పని = ఘటన; కిన్ = కి; వగవన్ = చింతించే; పని = అవసరము; లేదు = లేదు; రక్షకులు = రక్షించువారు; లేని = లేనట్టి; ప్రజలన్ = ప్రజలను; ఉపేక్షింపక = అశ్రద్ధ చేయక; రక్షింపన్ = రక్షించుటకు; పుండరీకాక్షుండు = కృష్ణుడు {పుండరీకాక్షుడు - పుండరీకము (తెల్లతామర)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; సాక్షాత్కరించిన = ప్రత్యక్షముగా; నారాయణుండు = విష్ణుమూర్తి {నారాయణుడు - 1.నారములందు వసించు వాడు, శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), 2. నారాయణశబ్ద వాచ్యుడు, వ్యు. నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః, నరసమూహమున నివాసముగలవాడు, విష్ణువు,}; తేజః = ప్రభావము; నిరూఢుండు = ప్రకటింపబడినవాడు; కాక = కాకుండా; యాదవులు = యాదవులు; అందున్ = లో; గూఢుండు = రహస్యముగ చరించువాడు; ఐ = అయి; తన = తన; మాయ = మాయ; చేతన్ = చేత; లోకంబుల = లోకములను; మోహ = మోహము యొక్క; అతిరేకంబున్ = అతిశయించుటను; ఒందించు = కలుగజేయును; అతని = అతని యొక్క; రహస్య = రహస్యమైన; ప్రకారంబులు = పద్ధతులు; భగవంతుండు = భగవంతుడు; ఐన = అయినట్టి; పరమేశ్వరుండు = శివుడు; ఎఱుంగున్ = తెలియగలుగును; మఱియు = ఇంకనూ; దేవర్షి = దేవర్షి; అగు = అయినట్టి; నారదుండును = నారదుడును; భగవంతుండు = భగవంతుడు, మహిమాన్వితుడు; అగు = అయినట్టి; కపిల = కపిలుడు అను; మునియు = మునియు; ఎఱుంగుదురు = తెలియగలరు; మీరు = మీరు; కృష్ణుండు = కృష్ణుడు; దేవకీ = దేవకి యొక్క; పుత్త్రుండు = కొడుకు; అగు = అయిన; మాతులేయుండు = మేనమామ కొడుకు, మేనబావ; అని = అని; తలంచి = భావించి; దూత = రాయబారి; సచివ = మంత్రి; సారథి = రథసారథి; బంధు = చుట్టము; మిత్ర = స్నేహితుడు అను; ప్రయోజనంబుల = వివిధవిధములుగ; నియమింతురు = నియమిస్తూ; ఇన్నిటన్ = ఇన్నిటివలన; కొఱంత = లోటు; లేదు = లేదు; రాగ = రాగము (రాగవిద్వేషాలు); ఆది = మొదలగునవి; శూన్యుండున్ = లేనివాడును; నిరహంకారుండున్ = అహంకారము లేనివాడును; అద్వయుండున్ = కష్టసుఖాలు లాంటి ద్వంద్వాలకు అతీతుడునూ; సమదర్శనుండున్ = సమస్తమును హెచ్చు తగ్గులు లేక చూచువాడును; సర్వాత్మకుండున్ = సర్వమునందు ఆత్మరూపమున యుండువాడును; అయిన = అయినప్పటికీ; ఈశ్వరున = ప్రభువు, కృష్ణున; కున్ = కు; నత = తక్కువ; ఉన్నత = ఎక్కువ యను; భావ = భావము; మతి = బుద్ధి; వైషమ్యంబులు = విషమమైనవి, బేధములు; ఎక్కడివి = ఎక్కడవి; లేవు = లేవు; అయిన = అయినప్పటికీ; భక్త = భక్తులయందు; వత్సలుండు = వాత్సల్యము గలవాడు; కావునన్ = అగుటచేతను; ఏకాంత = ఏకాంతమను స్థితిని చేరిన; భక్తులు = భక్తులు; కున్ = కు; సులభుండు = సుఖముగా లభించువాడు; ఐ = అయి; ఉండున్ = ఉంటాడు.

భావము:

అందుచేత, దైవసంకల్పం వల్ల జరిగినదానికి విచారించటం వివేకం కాదు. రక్షణ లేని ప్రజానీకాన్ని రక్షించటంకోసం శ్రీహరి పుండరీకాక్షరూపంలో సాక్షాత్కరించాడు. వాసుదేవుడు తన దైవత్వం తెలియబడకుండా, యదుకులంలో రహస్యంగా సంచరిస్తూ తన మాయచేత ముల్లోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నాడు. ఆ గుట్టుమట్టులు ఇంకా దేవర్షి అయిన నారదునికి, జ్ఞానస్వరూపుడైన కపిలమహర్షికి కొంత తెలుసు; నాయనలార! మీరు శ్రీకృష్ణుని దేవకీ పుత్రుడని, మీ మేనమామ కుమారుడని తలచారు. దూతగా, సచివుడుగా, సారథిగా, బంధువుగా, మిత్రుడుగా భావించి ఎన్నో పనులకు ఆయన్ని వినియోగించుకొన్నారు. అయినా అందువల్ల ఎలాంటి లోపం రాదు. రాగద్వేషాలు లేనివాడు, అహంకారం లేని వాడు, ద్వంద్వాలకు అతీతుడైనవాడు, సమదర్శనుడు, సర్వాత్మకుడు ఐన జగన్నాథునకు ఎక్కువ తక్కువ భావాలు, అభిప్రాయభేదాలు ఎక్కడివి; అయినప్పటికీ భగవంతుడు భక్తవత్సలుడు అగుటచేత ఆత్మీయులైన భక్తులకు అందుబాటులో ఉంటాడు.