పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధర్మజుడు భీష్ముని కడ కేగుట

  •  
  •  
  •  

1-211-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండుకైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై
పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు, కాల మన్నియుం
జేయుచుఁ నుండుఁ, గాలము విచిత్రముదుస్తర మెట్టివారికిన్.

టీకా:

వాయు = గాలికి; వశంబులు = ప్రభావానికి లోనైనవి; ఐ = అయి; ఎగసి = ఎగిరి; వారిధరంబులు = మేఘములు {వారిధరములు - నీటిని కలిగియుండునవి, మేఘములు}; మింటన్ = ఆకాశములో; కూడుచున్ = కలుస్తు; పాయుచున్ = విడిపోతు; ఉండు = ఉండే; కైవడిన్ = విధంగా; ప్రపంచము = లోకము; సర్వమున్ = అంతా; కాల = కాలము చేత; తంత్రము = అల్లబడిన, మాయకు; ఐ = లోబడినవి అయి; పాయుచున్ = విడిపోతూ; కూడుచుండున్ = కలుస్తూ; ఒక = ఒక; భంగిన్ = విధంగా; చరింపదు = జరుగదు; కాలము = కాలము; అన్నియున్ = అన్నింటినీ; చేయుచున్ = చేస్తూ; ఉండున్ = ఉంటుంది; కాలము = కాలము; విచిత్రము = విచిత్రమైనది; దుస్తరము = దాటుటకు వీలుకానిది; ఎట్టివారి = ఎటువంటి వారి; కిన్ = కైనా,.

భావము:

ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ, విడిపోతూ ఉంటాయి. అలానే ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తం కాలం యొక్క అల్లిక వల్ల కూడుతూ, విడిపోతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ ఒకేలా జరగదు. కాలమే అన్నింటికీ మూలం. కాలం చాలా విచిత్రమైంది. ఎంతటి వారైనా ఈ కాల ప్రభావాన్ని దాటలేరు.