పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట

  •  
  •  
  •  

1-202-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు సకలసంభాషణంబుల నుతియించు గొంతిమాటకు నియ్యకొని, గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు నొందించి, రథారూఢుండై కరినగరంబునకు వచ్చి, కుంతీసుభద్రాదుల వీడ్కొని, తన పురంబునకు విచ్చేయ గమకించి, ధర్మరాజుచేఁ గించిత్కాలంబు నిలువు మని ప్రార్థితుండై, నిలిచె; నంత బంధువధశోకాతురుం డయిన ధర్మజుండు నారాయణ, వ్యాస, ధౌమ్యాదులచేతఁ దెలుపంబడియుఁ దెలియక మోహితుండై, నిర్వివేకం బగు చిత్తంబున నిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధంగా; సకల = సమస్త; సంభాషణంబులన్ = పదముల; నుతియించు = కీర్తించు; గొంతి = కుంతీదేవి; మాట = మాటలు; కున్ = కి; ఇయ్యకొని = అంగీకరించి; గోవిందుండు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు, గోవులను పాలించు వాడు, గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు, కృష్ణుడు.}; మాయా = మాయను; నిరూఢ = నెలకొల్పే; మందహాస = చిరునవ్వు; విశేషంబున = విశిష్టతవలన; మోహంబున్ = మోహమును; ఒందించి = కలిగించి; రథా = రథమును; ఆరూఢుండు = అధిష్టించినవాడు; ఐ = అయి; కరినగరంబు = హస్తినాపురము; కున్ = కు; వచ్చి = వచ్చి; కుంతీ = కుంతియొక్క; సుభద్ర = సుభద్ర; ఆదుల = మొదలగువారి యొక్క; వీడ్కొని = వీడ్కోలు తీసుకొని; తన = తన యొక్క; పురంబు = నగరాని; కున్ = కి; విచ్చేయ = వెళ్ళవలెనని; గమకించి = సంకల్పించి; ధర్మరాజు = ధర్మరాజు; చేన్ = చేత; కించిత్ = కొంచెము; కాలంబు = కాలము; నిలువుము = ఆగుము; అని = అని; ప్రార్థితుండు = వేడుకొనబడినవాడు; ఐ = అయి; నిలిచెన్ = ఆగెను; అంతన్ = అంతట; బంధు = బంధువులను; వధ = వధించిన; శోక = బాధతో; ఆతురుండు = వేదనపడుతున్నవాడు; అయిన = అయినట్టి; ధర్మజుండు = ధర్మరాజు; నారాయణ = కృష్ణుడు {నారాయణుడు - 1.నారములందు వసించు వాడు, శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), 2. నారాయణశబ్ద వాచ్యుడు, వ్యు. నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః, నరసమూహమున నివాసముగలవాడు, విష్ణువు,}; వ్యాస = వ్యాసుడు; ధౌమ్య = ధౌమ్యుడు; ఆదులు = మొదలగువారి; చేతన్ = చేత; తెలుపంబడియున్ = తెలియజేయబడి నప్పటికీ; తెలియక = సమాధానపడలేక; మోహితుండు = మోహము చెందినవాడు; ఐ = అయి; నిర్వివేకంబు = వివేకశూన్యంము; అగు = అయిన; చిత్తంబునన్ = మనసుతో; ఇట్లు = ఈ విధంగా; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా కుంతీదేవి మధురోక్తులతో మాధవుణ్ణి కొనియాడింది. ఆమె ప్రార్థనను అంగీకరించిన శ్రీకృష్ణుడు మాయా మయమైన తన మధుర మందహాసంతో మైమరపించాడు; రథారూఢుడై హస్తినాపురానికి తిరిగివచ్చాడు. కొంతకాలమైన తరువాత కుంతి, సుభద్ర మొదలగువారికి చెప్పి ద్వారకానగరానికి ప్రయాణమైనాడు గోవిందుడు; కొద్దికాలం ఉండమని ధర్మరాజు బతిమిలాడటంతో ఉండిపోయాడు; చుట్టాలందరినీ మట్టు పెట్టానన్న దుఃఖంతో తల్లడిల్లుతున్న ధర్మజుణ్ణి కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైనవారు ఎన్నో విధాల ఓదార్చారు; అయినా, ఆయన మనస్సు ఊరట చెందలేదు; వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు ఇలా అనుకోసాగాడు.