పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట

  •  
  •  
  •  

1-199-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవా! నిరాశ్రయులమై, భవదీయ చరణారవిందంబు లాశ్రయించి నీ వారల మైన మమ్ము విడిచి విచ్చేయ నేల, నీ సకరుణావలోకనంబుల నిత్యంబునుఁ జూడవేని యాదవసహితులైన పాండవులు జీవునిం బాసిన యింద్రియంబుల చందంబునఁ గీర్తిసంపదలు లేక తుచ్ఛత్వంబు నొందుదురు; కల్యాణ లక్షణ లక్షితంబులయిన నీ యడుగులచేత నంకితంబైన యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబుగాదు; నీ కృపావీక్షణామృతంబున నిక్కడి జనపదంబులు గుసుమ ఫలభరితంబులై యోషధి, తరు, లతా, గుల్మ, నద, నదీ, సమేతంబులై యుండు.

టీకా:

దేవా = దేవా, శ్రీకృష్ణా; నిరాశ్రయులము = ఆశ్రమము లేని వారము (ఇతర); ఐ = అయి; భవదీయ = నీ యొక్క; చరణ = పాదములనెడి; అరవిందంబులున్ = పద్మములను; ఆశ్రయించి = ఆశ్రయించి; నీ = నీ; వారలము = వారము; ఐన = అయినట్టి; మమ్ము = మమ్ములను; విడిచి = విడిచిపెట్టి; విచ్చేయన్ = వెళ్ళుట; ఏల = ఎందుకు; నీ = నీ; సకరుణ = దయతో కూడిన; అవలోకనంబులన్ = చూపులతో, దృక్కులతో; నిత్యంబును = ప్రతినిత్యము; చూడవేని = చూడకపోయినట్లైతే; యాదవ = యాదవులతో; సహితులు = కూడిన వారు; ఐన = అయిన; పాండవులు = పాండవులు {పాండవులు - పాండురాజు పుత్రులు, పంచపాండవులు, 1ధర్మరాజు 2భీముడు 3అర్జునుడు 4నకులుడు 5సహదేవుడు}; జీవునిన్ = ప్రాణం; పాసిన = దూరమైన; ఇంద్రియంబుల = ఇంద్రియముల; చందంబునన్ = వలె; కీర్తి = కీర్తిని; సంపదలు = సంపదలును; లేక = లేకుండాపోయి; తుచ్ఛత్వంబున్ = నీచత్వమును; ఒందుదురు = పొందుతారు; కల్యాణ = శుభమైన; లక్షణ = లక్షణములకు; లక్షితంబులు = గురుతులు; అయిన = అయినట్టి; నీ = నీ; అడుగుల = పాదములు; చేతన్ = చేత; అంకితంబు = గుర్తులు వేయబడినది; ఐన = అయినట్టి; ఈ = ఈ; ధరణీ = భూ; మండలంబున్ = మండలము; నీవు = నీవు; వాసిన = విడిచినట్లైన; శోభితంబు = శోభాయమానము; కాదు = కాదు; నీ = నీ; కృపా = దయతో కూడిన; వీక్షణ = చూపులనే; అమృతంబున = అమృతమువలననే; ఇక్కడి = ఇక్కడి; జనపదంబులు = ఊర్లు; కుసుమ = పువ్వులతోను; ఫల = పండ్లతోను; భరితంబులు = నిండినవి; ఐ = అయి; ఓషధి = మొక్కలు {ఓషధులు - ఓషధయః ఫలకాంతాః, పంట పండగనే చనిపోవునవి. ఓషధులు, ధాన్యము, అరటి మొదలగునవి}; తరు = చెట్లు; లతా = లతలు, తీగలు; గుల్మ = పొదలు; నద = నదములు {నదము - పడమరకు ప్రవహించు నది}; నదీ = నదులు {నది - తూర్పునకు ప్రవహించు నదము}; సమేతంబులు = తో కూడినవి; ఐ = అయి; ఉండున్ = ఉండును.

భావము:

దేవదేవ! శ్రీకృష్ణా! నీ వారలమయ్యా. నిరాశ్రయులమై నీ చరణ కమలాలనే ఆశ్రయించామయ్యా; అటువంటి మమ్మల్ని విడిచి వెళ్లటం న్యాయం కాదు. కరుణామయుడవైన నీవు నిత్యం కటాక్ష వీక్షణాలతో వీక్షించకపోతే యాదవులు, పాండవులు; జీవాత్మను ఎడబాసిన పంచేంద్రియాల వలె పేరు ప్రతిష్ఠలు కోల్పోయి, దిక్కులేనివారు అవుతారు; సమస్త శుభలక్షణాలతో అలరారే నీ పాదపంకజాల ముద్రలతో అంచితమైన ఈ భూభాగం పల్లెలు, పుష్ప, ఫల సమృద్ధి కలిగి ప్రకాశిస్తోంది. పండిన పంటచేలు, వృక్షాలు, లతలు, పొదలు, నదీనదాలు కలిగి ఉంది.