పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట

  •  
  •  
  •  

1-198-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నినుఁ జింతించుచుఁ, బాడుచుం, బొగడుచున్ నీ దివ్యచారిత్రముల్
వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే
దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ! విశ్వంభరా!

టీకా:

నినున్ = నిన్ను; చింతించుచున్ = ధ్యానముచేస్తూ; పాడుచున్ = భజనలు పాడుతూ; పొగడుచున్ = కీర్తిస్తూ; నీ = నీ; దివ్య = దివ్యమైన; చారిత్రముల్ = కథలు; వినుచున్ = వింటూ; చూతురున్ = దర్శించగలుగుతారు; కాక = అంతే తప్ప; లోకులు = మానవులు; ఇతర = ఇతరమైన; అన్వేషంబులన్ = వెతుకులాటలవలన; చూతురే = దర్శించగలరా; ఘన = కరడుగట్టిన; దుర్జన్మ = చెడ్డజన్మల; పరంపరా = వరుసలను; హరణ = కృశింపజేయుటకు; దక్షంబు = సామర్థ్యము గలవి; ఐ = అయి; మహా = గొప్ప; యోగి = యోగుల; వాక్ = వాక్కులచే; వినుతంబు = స్తోత్రము చేయబడునవి; ఐన = అయినట్టి; భవత్ = నీయొక్క; పద = పాదములనే; అబ్జ = పద్మముల; యుగమున్ = జంటను; విశ్వేశ = విశ్వేశుడు - కృష్ణా {విశ్వేశుడు - విశ్వమునకు ఈశుడ (ప్రభువు), హరి}; విశ్వంభరా = కృష్ణా {విశ్వంభరుడు - విశ్వము (జగత్తును) భరుడు (ప్రోచువాడు), విష్ణువు, కృష్ణుడు}.

భావము:

ఎల్లప్పుడు నిన్నే ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రలే వింటూ ఉండే వారు మాత్రమే, విశ్వేశ్వరా! విశ్వంభరా! శ్రీకృష్ణా! దురంతాలైన జన్మపరంపరలను అంతం చేసేవీ, పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవీ అయిన నీ పాదపద్మాలను, దర్శించగలుగుతారు. అంతేతప్ప మరింకే ఇతర ప్రయత్నాలు ఫలవంతాలు కావు.