పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట

  •  
  •  
  •  

1-192-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును, నాత్మారాముండును, రాగాదిరహితుండునుఁ, గైవల్యదాన సమర్థుండునుఁ, గాలరూపకుండును, నియామకుండును, నాద్యంతశూన్యుండును, విభుండును, సర్వసముండును, సకల భూత నిగ్రహానుగ్రహకరుండును నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద, నవధరింపుము; మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వఁడు సమర్థుండు; నీకుం బ్రియాప్రియులు లేరు; జన్మకర్మశూన్యుండ వయిన నీవు తిర్యగాదిజీవుల యందు వరాహాది రూపంబులను, మనుష్యు లందు రామాది రూపంబులను, ఋషుల యందు వామనాది రూపంబులను, జలచరంబుల యందు మత్స్యాది రూపంబులను, నవతరించుట లోకవిడంబనార్థంబు గాని జన్మకర్మసహితుం డవగుటం గాదు.

టీకా:

మఱియున్ = ఇంకను; భక్త = భక్తులకు; ధనుండును = ధనము అయిన వాడును; నివృత్త = నివారింపబడిన; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామ = కామ; విషయుండును = విషయములు కలవాడు; ఆత్మారాముండును= ఆత్మయందు రమించు వాడును; రాగాది = రాగద్వేషములు {త్రయోదశరాగద్వేషములు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము.}; రహితుండును = లేనివాడును; కైవల్య = మోక్షమును {కైవల్యము - కేవలము తానే భగవంతుడు అగు స్థితి, పరమపదము, మోక్షము}; దాన = యిచ్చుటకు; సమర్థుండును = సమర్థత గలవాడును; కాల = కాలమే; రూపకుండును = స్వరూపముగ నున్నవాడు; నియామకుండును = (సర్వ) నియంతయును; ఆది = ఆది; అంత = అంతములు; శూన్యుండును = లేనివాడును; విభుండును = ప్రభువు; సర్వ = సమస్తమునందు; సముండును = సమదృష్టి కలవాడు; సకల = సమస్త; భూత = భూతముల యందు, జీవులకును; నిగ్రహ = నిగ్రహము; అనుగ్రహ = అనుగ్రహము; కరుండునున్ = చేయువాడును; ఐన = అయినట్టి; నిన్నున్ = నిన్ను; తలంచి = స్మరించి; నమస్కరించెదన్ = నమస్కరిస్తున్నాను; అవధరింపుము = స్వీకరింపుము; మనుష్యులన్ = మానవులను; విడంబించు = భ్రమింపజేయు; భవదీయ = నీ యొక్క; విలసనంబున్ = విలాసములను; నిర్ణయింపన్ = వర్ణింపను; ఎవ్వఁడు = ఎవడు; సమర్థుండు = సమర్థత గలవాడు; నీకున్ = నీకు; ప్రియ = ప్రియమైనవారును; అప్రియులు = ప్రియముకానివారును; లేరు = లేరు; జన్మ = జన్మమును; కర్మ = కర్మమును; శూన్యుండవు = లేనివాడవు; అయిన = అయినట్టి; నీవు = నీవు; తిర్యక్ = పశుపక్ష్యాదులు {తిర్యక్కులు - జంతువులు, పక్షులు, నం,విణ, అడ్డముగా పోవునవి,}; ఆది = మొదలగు; జీవుల = జీవుల; అందున్ = లో; వరాహ = వరాహము; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; మనుష్యుల = మానవుల; అందున్ = లో; రామ = రాముడు; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; ఋషుల = ఋషుల; అందున్ = లో; వామన = వామనుడు; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; జలచరంబుల = జలచరముల; అందున్ = లో; మత్స్య= చేప; ఆది = మొదలగు; రూపంబులను = రూపములతోను; అవతరించుట = అవతరించుట; లోక = లౌకిక విధానాలను; విడంబన = అనుసరించుట; అర్థంబున్ = కొరకు; కాని = తప్ప; జన్మ = జన్మములను; కర్మ = కర్మములను; సహితుండవు = కలిగివుండు వాడవు; అగుటన్ = అగుటవలన; కాదు = కాదు.

భావము:

అంతేకాకుండా, కృష్ణా! నీవు భక్తులకు కొంగుబంగారానివి; ధర్మార్థ కామ విషయ సంబంధాది వ్యామోహాలేవీ లేనివాడవు; ఆత్మారాముడివి; రాగద్వేషములు లేనివాడివి; ఆత్మారాముడివి; రాగద్వేషములు లేనివాడివి; మోక్షప్రదాతవు; కాలస్వరూపుడివి; జగన్నియంతవు; ఆద్యంతాలు లేనివాడవు; సర్వేశ్వరుడవు; సర్వసముడవు; జీవులందరి యెడ నిగ్రహానుగ్రహ సమర్థుడవు; మానవభావాన్ని అనుకరిస్తూ వర్తించే నీ లీలలు గుర్తించటం ఎవరికి సాధ్యం కాదు; నీకు ఐనవారు కానివారు లేరు; జన్మకర్మలు లేవు; జంతువులలో వరాహాదిరూపాలతో , మానవులలో రామావతారాది రూపాలతో, ఋషులలో వామనావతారాది రూపాలతో, జలచరాలలో మత్స్యాదిరూపాలతో నీవు అవతరించటం లోకం కోసమే తప్పించి నిజానికి నీకు జన్మకర్మాదులు లేనే లేవు; నీ ప్రభావాన్ని భావించి నేను చేసే నమస్కారాలు స్వీకరించు.
గమనిక :- (అ) నివృత్తధర్మార్థ కామ విషయుడు ఎలాగంటే విష్ణుసహస్రనామాలలో వర్ణించిన నివృత్తాత్మ(597); అనగా అవాప్త కాముడు కాబట్టి స్వభావసిద్ధంగానే ధర్మం అర్థం కామం ఇంద్రియ విషయాలుతో సంబంధాలు తొలగినవాడు
(ఆ) రాగాది అనగా రాగద్వేషములు, ఇవి పదమూడు. 1.రాగము, 2.ద్వేషము, 3.కామము, 4.క్రోధము, 5.లోభము, 6.మోహము, 7.మదము, 8.మాత్సర్యము, 9.ఈర్ష్య, 10.అసూయ, 11.దంభము, 12.దర్పము, 13అహంకారము ఈ పదమూడింటిని త్రయోదశరాగద్వేషములు అంటారు. ఈ రాగద్వేషములు లేని వారిని శాంతమూర్తి అంటారు.