పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కుంతి స్తుతించుట

  •  
  •  
  •  

1-188-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, జవనిక మఱుపున నాట్యంబు సలుపు నటుని చందంబున, మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచేఁ బరమహంసలు, నివృత్తరాగద్వేషులు, నిర్మలాత్ములు నయిన మునులకు నదృశ్యమానుండ వయి పరిచ్ఛిన్నుండవు గాని, నీవు మూఢదృక్కులుఁ, గుటుంబవంతులు నగు మాకు నెట్లు దర్శనీయుండ వయ్యెదు; శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశచరణ! హృషీకేశ! భక్తియోగంబునం జేసి నమస్కరించెద, నవధరింపుము.
^ రాగద్వేషములు పదమూడు

టీకా:

మఱియున్ = ఇంకను; జవనిక = తెర; మఱుపున = చాటున; నాట్యంబు = నాట్యము; సలుపు = చేయు; నటుని = నటుని; చందంబునన్ = వలె; మాయా = మాయ అనే; యవనిక = తెర; అంతరాళంబున = చాటున; నిలువంబడి = నిలబడి ఉండి; నీ = నీ యొక్క; మహిమ = మహిమ; చేన్ = చేత; పరమహంసలు = మోక్షస్థితిని పొందినవారు; నివృత్త = నివారింపబడిన; రాగద్వేషులున్ = అనురాగము, ద్వేషములు కలవారును; నిర్మల = నిర్మలమైన; ఆత్ములున్ = ఆత్మగలవారును; అయిన = అయినట్టి; మునులు = మునుల; కున్ = కు; అదృశ్య = కనుపించక; మానుండు = ఉండేవాడవును; అయి = అయి; పరిచ్ఛిన్నుండవుగాని = సీమ లేదా మితము లేనివాడు, అవిభాజ్యుడు నైన పరబ్రహ్మ స్వరూపమైనవాడవు; నీవు = నీవు; మూఢ = మోసము చెందిన; దృక్కులున్ = దృష్టి కలవారును; కుటుంబవంతులున్ = కుటుంబము గలవారును; అగు = అయినట్టి; మాకు = మాకు; ఎట్లు = ఏవిధంగ; దర్శనీయుండవు = కనబడువాడవు; అయ్యెదు = అవుతావు; శ్రీకృష్ణ = కృష్ణా; వాసుదేవ = కృష్ణా {వాసుదేవుడు - 1.ఆత్మలందు వసించెడి దేవుడు, 2.విష్ణువు, 3.కృష్ణుడు, 4.వసుదేవుని పుత్రుడు, 5.వ్యు. వాసుదేవః - సర్వత్రాసౌ వసత్యాత్మ రూపేణ, విశంభరత్వాదితి, (ఆంధ్ర వాచస్పతము) ఆత్మ యందు వసించు దేవుడు, 6. చతుర్వ్యూహముల లోని వాసుదేవుడు, బుద్ధికి అధిష్టానదేవత}; దేవకీనందన = కృష్ణా {దేవకీనందనుడు - దేవకీదేవి పుత్రుడు, కృష్ణుడు}; నంద గోప కుమార = కృష్ణా {నందగోపకుమారుడు - నందగోపుని యొక్క కుమారుడు, కృష్ణుడు}; గోవింద = కృష్ణా {గోవిందుడు - గోవులకు ఒడయుడు, గోవులను పాలించు వాడు, గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు, కృష్ణుడు.}; పంకజనాభ = కృష్ణా {పంకజనాభుడు - పంకజము (పద్మము) నాభిన కలవాడు, విష్ణువు}; పద్మమాలికాలంకృత = కృష్ణా {పద్మమాలికాలంకృతుడు - పద్మ మాలికలతో అలంకరింపబడిన వాడు, కృష్ణుడు}; పద్మలోచన = కృష్ణా {పద్మలోచనుడు - పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు, విష్ణువు}; పద్మసంకాశ చరణ = కృష్ణా {పద్మసంకాశచరణుడు - పద్మముల వలె ప్రకాశించు పాదములు గలవాడు, కృష్ణుడు}; హృషీ కేశ = కృష్ణా {హృషీకేశుడు - హృషీకములు (ఇంద్రియములు)కు ఈశుడు, విష్ణువు, వ్యు. హృషీకేశః - హృషీకాణాం (ఇంద్రియాణాం) ఈశః (నియామకుడు)}; భక్తి యోగంబునన్ = భక్తి యోగము వలన; చేసి = చేసి; నమస్కరించెదన్ = నమస్కరిస్తున్నాను; అవధరింపుము = స్వీకరింపుము.

భావము:

మాయ అనే యవనిక మాటున వర్తించే నీ మహిమ, తెరచాటున వర్తించే నటునిలా అగోచరమైనది; పరమహంసలు, రాగద్వేషరహితులు, నిర్మలహృదయులు అయిన మునీశ్వరులకు సైతం దర్శింపశక్యంకానికాని వాడవూ, సీమ లేదా మితము లేనివాడు, అవిభాజ్యుడు నైన పరబ్రహ్మ స్వరూపమైనవాడవూ అయిన నిన్ను జ్ఞానహీనులమూ సంసార నిమగ్నులమూ అయిన మా వంటి వారం ఎలా చూడగలం; శ్రీకృష్ణా! వాసుదేవా! దేవకీనందనా! నందగోపకుమారా! గోవిందా! పద్మనాభా! పద్మమాలా విభూషణా! పద్మనయనా! పద్మసంకాశ చరణా! హృషీకేశా! భక్తి పూర్వకమైన నా ప్రణామాలు పరిగ్రహించు. నా విన్నపం మన్నించు.