పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : అశ్వత్థామ గర్వ పరిహారంబు

  •  
  •  
  •  

1-178-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత వాసుదేవుండు వ్యాసప్రముఖ భూసుర పూజితుం డయి,యుద్ధవ సాత్యకులు గొలువ ద్వారకాగమన ప్రయత్నంబునం బాండవుల వీడ్కొని రథారోహణంబు సేయు సమయంబునం, దత్తఱపడుచు నుత్తర సనుదెంచి కల్యాణగుణోత్తరుం డైన హరి కిట్లనియె.

టీకా:

అంత = అంతట; వాసుదేవుండు = కృష్ణుడు {వాసుదేవుడు - 1.ఆత్మలందు వసించెడి దేవుడు, 2.విష్ణువు, 3.కృష్ణుడు, 4.వసుదేవుని పుత్రుడు, 5.వ్యు. వాసుదేవః - సర్వత్రాసౌ వసత్యాత్మ రూపేణ, విశంభరత్వాదితి, (ఆంధ్ర వాచస్పతము) ఆత్మ యందు వసించు దేవుడు, 6. చతుర్వ్యూహముల లోని వాసుదేవుడు, బుద్ధికి అధిష్టానదేవత}; వ్యాస = వ్యాసుడు; ప్రముఖ = మొదలగు ప్రముఖమైన; భూసుర = బ్రాహ్మణులచే; పూజితుండు = పూజింపబడినవాడు; అయి = అయి; యుద్ధవ = యుద్ధవుడును; సాత్యకులు = సాత్యకియు; కొలువ = పూజించగా; ద్వారక = ద్వారకకు; ఆగమన = చేరు; ప్రయత్నంబునన్ = ప్రయత్నముతో; పాండవుల = పాండవుల; వీడ్కొని = సెలవుతీసుకొని; రథ = రథాన్ని; ఆరోహణంబు = ఎక్కుట; చేయు = చేసే; సమయంబునన్ = సమయంలో; తత్తఱ = ఖంగారు; పడుచున్ = పడుతూ; ఉత్తర = ఉత్తర; చనుదెంచి = వచ్చి; కల్యాణ = శుభ; గుణ = గుణములతో కూడిన; ఉత్తరుండు = ఉత్తముడు; ఐన = అయినట్టి; హరి = కృష్ణుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అనంతరం వ్యాసాది మహర్షుల పూజలందుకొన్న శ్రీకృష్ణుడు ఉద్ధవ, సాత్యకులను వెంటబెట్టుకొని ద్వారకకు బయలు దేరాడు. పాండవు లందరికీ వీడ్కోలు చెప్పి రథం ఎక్కుతుండగా, ఉత్తర తత్తరపడుతూ పరుగెత్తుకు వచ్చి మంగళకరగుణాలప్రోవైన పురుషోత్తమునితో ఇలా మొరపెట్టుకొంది.