పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ద్రౌపది పుత్రశోకం

  •  
  •  
  •  

1-151-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జిహ్మత్వంబునఁ బాఱి ద్రోణజుఁడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛమై
బ్రహ్మాస్త్రం బదె యేసె; వచ్చెనిదె తద్బాణాగ్ని, బీభత్స! నీ
బ్రహ్మాస్త్రంబునఁ గాని దీని మరలింపన్ రాదు, సంహార మీ
బ్రహ్మాపత్య మెఱుంగఁ, డేయుము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై.""

టీకా:

జిహ్మత్వంబునన్ = వక్రబుద్ధితో; పాఱి = పారిపోవు; ద్రోణజుఁడు = అశ్వత్థామ {ద్రోణజుడు - ద్రోణాచార్యుని కుమారుడు, అశ్వత్థామ}; దుశ్శీలుండు = చెడ్డ శీలముగలవాడు; ప్రాణ = ప్రాణములమీది; ఇచ్ఛము = కోరిక; ఐ = కొరకు; బ్రహ్మాస్త్రంబు = బ్రహ్మాస్త్రము; అదె = అదిగో; ఏసెన్ = వేసెను; వచ్చెన్ = వస్తున్నది; ఇదె = ఇదిగో; తత్ = దాని; బాణ = బాణము యొక్క; అగ్ని = అగ్ని యొక్క; బీభత్స = అర్జునా {భీభత్సుడు - బీభత్సము (అతి క్రూరత్త్వము)గా యుద్ధము చేయువాడు, అర్జునుడు}; నీ = నీ; బ్రహ్మాస్త్రంబున్ = బ్రహ్మాస్త్రమువలన; కాని = తప్పించి; దీనిన్ = దీనిని; మరలింపన్ = మరలించుటకు; రాదు = వీలుకాదు; సంహారము = మరలించుట; ఈ = ఈ; బ్రహ్మాపత్యము = బ్రాహ్మణ వంశీయుడు; ఎఱుంగఁడు = ఎరుగడు; ఏయుము = వేయుము; వడిన్ = తొందరగా; బ్రహ్మాస్త్రమున్ = బ్రహ్మాస్త్రమును; దీని = దీని; పైన్ = మీద.

భావము:

“అర్జునా! నిప్పులు చెరుగుతూ ఆ వచ్చేది బ్రహ్మాస్త్రం. దీనిని పిక్కబలంతో పారిపోతున్న కుటిలాత్ముడు, ధూర్తుడు అయిన అశ్వత్థామ తన ప్రాణం రక్షించుకోడానికి ప్రయోగించాడు. దీన్ని త్రిప్పి కొట్టటానికి నీ బ్రహ్మాస్త్రం తప్ప మరొక్కటి సమర్థం కాదు. బ్రాహ్మణయువకుడైన ఈ అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప ఉపసంహారం తెలియదు. ఆలస్యం చేయకుండా దీనిపై నీ బ్రహ్మాస్త్రం ప్రయోగించు.”