పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ద్రౌపది పుత్రశోకం

  •  
  •  
  •  

1-147-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లోపినంత దూరంబు బరువిడి వెనుకఁ జూచి రథతురంగంబు లలయుటఁ దెలిసి నిలిచి ప్రాణరక్షంబునకు నొండుపాయంబు లేమి నిశ్చయించి, జలంబుల వార్చి, ద్రోణనందనుండు సమాహితచిత్తుండై ప్రయోగంబ కాని యుపసంహారంబు నేరకయుఁ, బ్రాణసంరక్షణార్థంబు పార్థునిమీద బ్రహ్మశిరోనామకాస్త్రంబుం బ్రయోగించిన, నది ప్రచండతేజంబున దిగంతరాళంబు నిండి ప్రాణి భయంకరంబై తోఁచిన, హరికి నర్జునుం డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈవిధముగా; ఓపిన = సాధ్యమైన; అంత = అంతట; దూరంబున్ = దూరము; పరువిడి = పరుగెత్తి; వెనుకన్ = వెనుకకు; చూచి = చూసి; రథతురంగంబులు = రథమునకు కట్టిన గుఱ్ఱములు; అలయుటన్ = అలసట పొందుట; తెలిసి = తెలుసుకొని; నిలిచి = ఆగి; ప్రాణ = ప్రాణములను; రక్షంబు = రక్షించుకొనుట; కున్ = కు; ఒండు = మరొక; ఉపాయంబు = ఉపాయము; లేమిన్ = లేకపోవుటను; నిశ్చయించి = నిర్ణయించుకొని; జలంబులవార్చి = ఆచమనం చేసి (సంకల్పించుకొని); ద్రోణనందనుండు = అశ్వత్థామ {ద్రోణనందనుడు - ద్రోణాచార్యుని కుమారుడు, అశ్వత్థామ}; సమాహిత = కూడతీసుకొన్న; చిత్తుండు = మనసుకలవాడు; ఐ = అయి; ప్రయోగంబ = ప్రయోగించుట; కాని = తప్ప; ఉపసంహారంబు = మరలించుట; నేరకయున్ = తెలియకపోయినను; ప్రాణ = ప్రాణములను; సంరక్షణార్థంబు = రక్షించుకొనుటకు; పార్థుని = అర్జునుని {పార్థుడు - పృథు (కుంతి) కొడుకు, అర్జునుడు.}; మీదన్ = పైన; బ్రహ్మశిరస్ = బ్రహ్మశిరస్సు అనే; నామక = పేరుగల; అస్త్రంబున్ = అస్త్రమును; ప్రయోగించినన్ = వేసిన; అది = ఆ బ్రహ్మాస్త్రము; ప్రచండ = భయంకరమైన; తేజంబునన్ = వెలుగుతో; దిక్ = దిక్కులయొక్క; అంతరాళంబున్ = మధ్యభాగమంతా; నిండి = నిండిపోయి; ప్రాణి = జీవులకు; భయంకరంబు = భయము కలిగించునది; ఐ = అయి; తోఁచినన్ = అనిపించగా; హరి = కృష్ణుని, హరి; కిన్ = కి; అర్జునుండు = అర్జునుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = అన్నాడు.

భావము:

ఈ ప్రకారంగా ఓపికున్నంతవరకు పారిపోతున్న అశ్వత్థామ ఒక్కమాటు వెనక్కు తిరిగి చూశాడు; రథాశ్వాలు అలసిపోయినట్లుగా తెలిసికొన్నాడు; ఇక తన ప్రాణాల్ని రక్షించుకోవటానికి వేరే ఉపాయం లేదనే నిశ్చయంతో, అశ్వత్థామ ఆచమనం చేసి, ఏకాగ్ర చిత్తంతో ప్రయోగమే గాని ఉపసంహారం తెలియని బ్రహ్మశిరోనామకాస్ర్తాన్ని పార్థునిపై ప్రయోగించాడు. ఆ బ్రహ్మశిరోనామకాస్ర్తం ప్రచండ తేజంతో సకల దిక్కులూ వ్యాపించి, సర్వప్రాణులకూ భయం కలిగిస్తూ, విజృంభించటం చూసి అర్జునుడు, కృష్ణుని ఇలా అర్థించాడు.