పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదునికి దేవుడు దోచుట

  •  
  •  
  •  

1-136-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని నారదుం గొనియాడిన సూతునిం జూచి ”నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాదరాయణుం డేమి సేసె?"నని శౌనకుం డడిగిన సూతుం డిట్లనియె ”బ్రహ్మదైవత్య యైన సరస్వతి పడమటితీరంబున ఋషులకు సత్రకర్మవర్ధనంబై బదరీ తరుషండ మండితం బయి ”శమ్యాప్రాసం"బనం బ్రసిద్ధంబగు నాశ్రమంబు గల; దందు జలంబుల వార్చి కూర్చుండి, వ్యాసుండు తన మదిం దిరంబు సేసికొని భక్తియుక్తం బయిన చిత్తంబునం బరిపూర్ణుం డయిన యీశ్వరుం గాంచి, యీశ్వరాధీన మాయావృతం బైన జీవుని సంసారంబుఁ గని, జీవుండు మాయచేత మోహితుం డయి గుణవ్యతిరిక్తుండయ్యు మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుం డని యభిమానించుచుఁ ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు ననియు; నయ్యనర్థంబునకు నారాయణభక్తియోగంబు గాని యుపశమనంబు వేఱొకటి లేదనియు నిశ్చయించి.

టీకా:

అని = అని; నారదున్ = నారదుని; కొనియాడిన = స్తుతించిన; సూతునిన్ = సూతుని; చూచి = చూసి; నారదు = నారదుని; మాటలు = ఉపదేశములు; విన్న = ఆలకించిన; వెనుక = తరువాత; భగవంతుండు = భగవంతుడు; ఐన = అయిన; బాదరాయణుండు = వ్యాసుడు {బాదరాయణుడు - బదరీవనములో నుండు వాడు, వ్యాసుడు}; ఏమి = ఏమి; సేసెన్ = చేసెను; అని = అని; శౌనకుండు = శౌనకుడు; అడిగిన = ప్రశ్నించగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను; బ్రహ్మదైవత్య = బ్రహ్మ తనకు అధిదైవముగాగలది; ఐన = అయినట్టి; సరస్వతి = సరస్వతీనది; పడమటి = పశ్చిమ; తీరంబునన్ = తీరమున; ఋషులు = ఋషులు; కున్ = కు; సత్ర = యాగములయొక్క; కర్మ = కర్మలను; వర్ధనంబు = వృద్ధిచేయునది; ఐ = అయి; బదరీ = రేగుపళ్ళ; తరు = చెట్ల; షండ = గుంపుతో; మండితంబు = అలంకరింపడినది; అయి = అయి; శమ్యాప్రాసంబు = శమ్యాప్రాసము {శమ్యాప్రాసము - సరస్వతీ నదికి పడమటి ఒడ్డున కల ఋష్యాశ్రమము, శమము యను ఆహారము గలది, ఇక్కడనే వ్యాసునికి నారదుడు భాగవతం ఉపదేశించారు.}; అనన్ = అనేపేరుతో; ప్రసిద్ధంబు = ప్రసిద్ధమైనది; అగు = అయినట్టి; ఆశ్రమంబు = ఆశ్రమము; కలదు = ఉన్నది; అందున్ = అక్కడ; జలంబులన్ = నదిలో; వార్చి = సంధ్యవార్చి; కూర్చుండి = కూర్చొని; వ్యాసుండు = వ్యాసుడు; తన = తనయొక్క; మదిన్ = మనసును; తిరంబు = స్థిరముగ; చేసికొని = చేసికొని; భక్తి = భక్తితో; యుక్తంబు = కూడినది; అయిన = అయినట్టి; చిత్తంబునన్ = చిత్తములో; పరిపూర్ణుండు = పరిపూర్ణుడు; అయిన = అయినట్టి; ఈశ్వరున్ = ఈశ్వరుని; కాంచి = దర్శించి; ఈశ్వర = ఈశ్వరునియొక్క; అధీన = అధీనములో ఉండే; మాయ = మాయతో; ఆవృతంబు = కప్పబడినది; ఐన = అయినట్టి; జీవుని = జీవునియొక్క; సంసారంబున్ = సంసారమును; కని = చూసి; జీవుండు = జీవుడు; మాయ = మాయ; చేతన్ = చేత; మోహితుండు = మోహింపబడినవాడు; అయి = అయి; గుణ = గుణములకంటెను; వ్యతిరిక్తుండు = వేరైనవాడు; అయ్యు = అయినప్పటికిని; మాయ = మాయతో; సంగతిన్ = సహవాసము వలన; తాను = తాను; త్రి = మూడు; గుణ = గుణములు; ఆత్మకుండు = తనవిగా కలవాడు; అని = అనుకొని; అభిమానించుచున్ = (ఆ గుణములను) అభిమానించుచు; త్రి = మూడు; గుణత్ = గుణములయందు; అభిమానంబునన్ = అభిమానమువలన; కర్తయున్ = కర్తను; భోక్తయున్ = భోక్తను; అను = అను; అనర్థంబు = అనర్థమును (అర్థము లేని అభిప్రాయము); ఒందును = పొందును; అనియున్ = అనియూ; ఆ = ఆ; అనర్థంబు = అనర్థమున; కున్ = నకు; నారాయణ = భగవంతుని; భక్తి = భక్తి; యోగంబు = యోగము; కాని = తప్ప; ఉపశమనంబు = అణగింపగలది; వేఱొకటి = మరొకటి; లేదు = లేదు; అనియు = అనీ; నిశ్చయించి = నిర్ణయించి.

భావము:

అంటూ నారదమహర్షిని సూతుడు స్తుతించగా ”నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాసభగవానుడు ఏం చేసాడో చెప్ప” మని శౌనకుడు అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు. ”బ్రహ్మదేవతాకమైన సరస్వతీనది పడమటి తీరాన ఋషులు యజ్ఞాలు చేసుకోటానికి అనుకూలమై అనేక రేగుచెట్లతో నిండి శమ్యాప్రాసమనే ఆశ్రమం ఉంది. వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్లి తన చిత్తంలో భగవంతుణ్ణి దర్శించాడు. ఈశ్వరుని మాయ ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని చూశాడు. మాయా మోహితుడైన జీవుడు త్రిగుణాతీతుడై కూడా మయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడై, తానే కర్తను భోక్తను అనే అనర్థభావనలు చేస్తాడని, ఈ అనర్థాన్ని ఉపశమింప చేయటానికి విష్ణుభక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడు.