పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదునికి దేవుడు దోచుట

  •  
  •  
  •  

1-130-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు నిశ్వాసంబునుగా నొప్పి, సర్వనియామకం బైన మహాభూతంబు వలికి యూరకున్న; నేను మస్తకంబు వంచి మ్రొక్కి, తత్కరుణకు సంతసించుచు, మదంబు దిగనాడి, మచ్చరంబు విడిచి, కామంబు నిర్జించి, క్రోధంబు వర్జించి, లోభమోహంబుల వెడల నడిచి, సిగ్గు విడిచి, యనంత నామంబులు పఠించుచుఁ, బరమ భద్రంబు లయిన తచ్చరిత్రంబులం జింతించుచు, నిరంతర సంతుష్టుండనై కృష్ణుని బుద్ధి నిలిపి, నిర్మలాంతఃకరణంబులతోడ విషయవిరక్తుండ నై, కాలంబున కెదురు సూచుచు భూమిం దిరుగుచు నుండ; నంతం గొంతకాలంబునకు మెఱుంగు మెఱసిన తెఱంగున మృత్యువు దోఁచినం, బంచభూతమయం బయి కర్మస్వరూపం బైన పూర్వ దేహంబు విడిచి హరికృపావశంబున శుద్ధసత్త్వమయం బైన భాగవతదేహంబు సొచ్చితి; నంతం ద్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున శయనించు నారాయణమూర్తి యందు నిదురవోవ నిచ్చగించు బ్రహ్మనిశ్వాసంబు వెంట నతని లోపలం బ్రవేశించితి; నంత సహస్ర యుగ పరిమితంబైన కాలంబు సనిన లేచి లోకంబులు సృజియింప నుద్యోగించు బ్రహ్మనిశ్వాసంబు వలన మరీచి ముఖ్యులగు మునులును నేనును జనియించితిమి; అందు నఖండిత బ్రహ్మచర్యుండనై యేను మూఁడు లోకంబుల బహిరంతరంబు లందు మహావిష్ణుని యనుగ్రహంబున నడ్డంబు లేక యీశ్వరదత్తమై బ్రహ్మాభివ్యంజకంబు లైన సప్తస్వరంబులు దమ యంతన మ్రోయుచున్న, యీ వీణాలాపన రతింజేసి నారాయణకథాగానంబు సేయుచుఁ జరియించు చుందు.
^ అరిడ్వర్గాలు వివరణ

టీకా:

అని = అని; ఇట్లు = ఈవిధముగ; ఆకాశంబు = ఆకాశము; మూర్తియు = రూపముగను; ఋగ్వేద = ఋగ్వేదము; ఆదికంబు = మొదలగునవి; నిశ్వాసంబునున్ = ఊపిరియును; కాన్ = కాగా; ఒప్పి = అమరి; సర్వ = సర్వమును; నియామకంబు = నియమించునది; ఐన = అయినట్టి; మహా = బృహత్; భూతంబు = ప్రకృతి; పలికి = పలికి; ఊరక = ఊరక; ఉన్నన్ = ఉండిన; నేను = నేను; మస్తకంబున్ = శిరస్సు; వంచి = వంచి; మ్రొక్కి = నమస్కరించి; తత్ = ఆయొక్క; కరుణ = దయ; కున్ = కు; సంతసించుచున్ = సంతోషించుచు; మదంబున్ = గర్వమును; దిగనాడి = వదిలివేసి; మచ్చరంబున్ = మాత్సర్యమును; విడిచి = విడనాడి; కామంబున్ = కామమును; నిర్జించి = అణచి; క్రోధంబున్ = కోపమును; వర్జించి = వదిలిపెట్టి; లోభ = లోభమును; మోహంబులన్ = మోహములను; వెడలనడిచి = గెంటి వేసి; సిగ్గున్ = సిగ్గును; విడిచి = విడిచి; అనంత = అనంతుని, భగవంతుని అనంతమైన; నామంబులున్ = నామములను; పఠించుచున్ = చదువుతూ; పరమ = అన్నిటికంటె ఉత్తమమైన; భద్రంబులు = క్షేమకరములు; అయిన = అయినట్టి; తత్ = అతని; చరిత్రంబులన్ = చరిత్రలను; చింతించుచు = తలుస్తూ; నిరంతర = ఎడతెగని; సంతుష్టుండను = సంతోషము కలవాడను; ఐ = అయి; కృష్ణుని = విష్ణువుని; బుద్ధిన్ = బుద్ధిలో; నిలిపి = స్థిరపరుచుకొని; నిర్మల = మలినములేని; అంతఃకరణంబుల = లోపలి ఇంద్రియముల {అంతఃకరణములు - అంతఃకరణచతుష్టయము, 1. మనస్సు, 2. బుద్ధి, 3. చిత్తము, 4. అహంకారము.}; తోడన్ = తో; విషయ = విషయములమీద {విషయములు - ఇంద్రియములకు గోచరము అగునవి, ఇంద్రియార్థములు}; విరక్తుండను = ఆసక్తిలేనివాడను; ఐ = అయి; కాలంబు = (మరణ)కాలము; కున్ = కు; ఎదురు = ఎదురు; సూచుచు = చూస్తూ; భూమిన్ = భూమిమీద; తిరుగుచున్ = తిరుగుతూ; ఉండన్ = ఉండగా; అంతన్ = అంతట; కొంత = కొంత; కాలంబు = కాలము; కున్ = తరువాత; మెఱుంగు = మెరుపు; మెఱసిన = మెరిసిన; తెఱంగునన్ = విధముగ; మృత్యువు = మరణము; తోఁచినన్ = ప్రత్యక్షము కాగా; పంచభూత = పంచభూతములతో; మయంబు = కూడినది; అయి = అయినట్టి; కర్మ = కర్మము యొక్క; స్వరూపంబు = స్వరూపము; ఐన = కలిగిన; పూర్వ = పూర్వజన్మలోని; దేహంబు = దేహమును; విడిచి = విడిచిపెట్టి; హరి = హరియొక్క; కృపా = దయ; వశంబునన్ = వలన; శుద్ధ = పరిశుద్ధమైన; సత్త్వ = సత్త్వగుణముల; మయంబు = కూడినది; ఐన = అయినట్టి; భాగవత = భగవంతునియొక్క; దేహంబు = దేహము, రూపము; చొచ్చితిన్ = ప్రవేశించితిని, లీనమైతిని; అంతన్ = అంతట; త్రైలోక్యంబున్ = మూడు లోకములను; సంహరించి = నాశనము చేసి; ప్రళయ = కల్పాంత; కాల = కాలములో; పయోరాశి = సముద్ర; మధ్యంబున = మధ్యభాగమున; శయనించు = పండుకొను; నారాయణమూర్తి = విష్ణుమూర్తి; అందున్ = లోపల; నిదుర = నిద్ర; పోవ = పోవుటకు; ఇచ్చగించు = నిశ్చయించు; బ్రహ్మ = బ్రహ్మయొక్క; నిశ్వాసంబు = ఊపిరి; వెంటన్ = వెనకన; అతని = అతని; లోపలన్ = లోపలికి; ప్రవేశించితిన్ = చొచ్చితిని; అంత = అంతట; సహస్ర = వెయ్యి; యుగ = యుగముల; పరిమితంబు = పర్యంతము; ఐన = అయినట్టి; కాలంబు = కాలము; చనిన = గడచిన; లేచి = లేచి; లోకంబులున్ = లోకములను; సృజియింపన్ = సృష్టించవలెనని; ఉద్యోగించు = ప్రయత్నము చేయు; బ్రహ్మ = బ్రహ్మయొక్క; నిశ్వాసంబు = ఊపిరి; వలనన్ = ద్వారా; మరీచి = మరీచి; ముఖ్యులగు = మొదలగు; మునులును = మునులును; నేనును = నేనును; జనియించితిమి = పుట్టితిమి; అందున్ = వారిలో; అఖండిత = ఎడతెగని; బ్రహ్మచర్యుండన్ = బ్రహ్మచర్య వ్రతధారుడను; ఐ = అయి; ఏను = నేను; మూఁడు = మూడు; లోకంబులన్ = లోకముల యొక్క; బహిర్ = బయటి భాగములు; అంతరంబులు = లోపటి భాగములు; అందున్ = అందును; మహా = గొప్పవాడైన; విష్ణుని = భగవంతుని యొక్క; అనుగ్రహంబునన్ = అనుగ్రహము వలన; అడ్డంబు = అడ్డము; లేక = లేకుండగ; ఈశ్వర = ఈశ్వరునిచే; దత్త = ఇవ్వబడినది; ఐ = అయినట్టి; బ్రహ్మ = పరబ్రహ్మమును; అభివ్యంజకంబులు = అభివ్యక్తము చేయునవి; ఐన = అయినట్టి; సప్తస్వరంబులు = సప్తస్వరములు; తమయంతన = తమంతతామే; మ్రోయుచున్న = మ్రోగు; ఈ = ఈ; వీణ = వీణ; ఆలాపన = రాగముతో, నాదముతో; రతిన్ = కూడినదాని, ఆసక్తి; చేసి = వలన; నారాయణ = నారాయణుని; కథ = కథల; గానంబు = గానము; చేయుచున్ = చేయుచు; చరియించుచున్ = తిరుగుతూ; ఉందున్ = ఉందును.

భావము:

ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి, సర్వనియంత, వేదమయమూ అయిన ఆ మహాభూతానికి నేను తలవంచి మ్రొక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మదాన్ని వీడాను. మాత్సర్యాన్ని దిగనాడాను. కామాన్ని అణచిపెట్టాను. క్రోధాన్ని వదలిపెట్టాను. లోభాన్ని, మోహాన్ని వదలివేసాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ, పరమపవిత్రాలయిన హరి చరిత్రలను స్మరిస్తూ, నిత్యసంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో పదిలపరచుకొన్నాను. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగసాగాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమయింది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవల్ల సత్త్వగుణాత్మకమైన భాగవతదేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవమైన జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన, బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేనూ భగవానుని ఉదరంలో ప్రవేశించాను. వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించ తలచెడి బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు, నేను జన్మించాము. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై, భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై, పరబ్రహ్మముచేత సృష్టింపబడిన సప్తస్వరాలు తమంతతామే మ్రోగే ఈ మహతి అనే వీణమీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను.