పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదునికి దేవుడు దోచుట

  •  
  •  
  •  

1-125-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లేచి నిలుచుండి, క్రమ్మఱ నద్దేవుని దివ్యాకారంబుఁ జూడ నిచ్ఛించుచు, హృదయంబున నిలుపుకొని యాతురుండునుంబోలె జూచియుం గానలేక, నిర్మనుష్యం బైన వనంబునం జరియించుచున్న నన్ను నుద్దేశించి వాగగోచరుం డైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం బుపశమింపం జేయు చందంబున నిట్లనియె.

టీకా:

లేచి = లేచి; నిలుచుండి = నిలబడి; క్రమ్మఱన్ = మరల; ఆ = ఆ; దేవుని = దేవుని యొక్క; దివ్య = దివ్యమైన; ఆకారంబున్ = ఆకారమును; చూడన్ = చూచుటను; ఇచ్ఛించుచున్ = కోరుతూ; హృదయంబున = హృదయములో; నిలుపుకొని = నిలుపుకొని; ఆతురుండునున్ = ఆతురతతో యున్నవాడు; పోలెన్ = వలె; చూచియున్ = వెతికి చూచి కూడ; కాన = కనుగొన; లేక = లేక; నిర్మనుష్యంబు = మనుష్య సంచారము లేనిది; ఐన = అయినట్టి; వనంబునన్ = అరణ్యములో; చరియించుచున్న = తిరుగుతున్న; నన్నున్ = నన్ను; ఉద్దేశించి = ఉద్దేశించి; వాక్ = వాక్కువలన {వాగగోచరుడు - వాక్కు వలన తెలియరానివాడు, విష్ణువు}; అగోచరుండు = తెలుప సాధ్యం కాని వాడు; ఐన = అయినట్టి; హరి = హరి; గంభీర = గంభీరమైనవియును; మధురంబులు = మధురమైనవియును; ఐన = అయినట్టి; వచనంబులన్ = మాటలతో; శోకంబున్ = విచారమును; ఉపశమింపన్ = ఉపశమించునట్లు; చేయు = చేయు; చందంబునన్ = విధముగ; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

నేను విచారంతో లేచి నిల్చున్నాను. మళ్లీ ఆ దేవదేవుని దివ్యస్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరుగసాగాను. కాని నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలుగలేదు. అంతలో మాటలలో వివరించ సాధ్యం కాని వాడు అయిన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి.