పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని పూర్వకల్పము

  •  
  •  
  •  

1-121-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉత్తరాభిముఖుండ నై యేను వెడలి జనపదంబులుఁ, బురంబులుఁ, బట్టణంబులు, గ్రామంబులుఁ, బల్లెలు, మందలుఁ, గిరాత పుళిందనివాసంబులు, నుపవనంబులుఁ, జిత్రధాతు విచిత్రితంబు లయిన పర్వతంబులు, సమద కరికర విదళిత శాఖలు గల శాఖులును, నివారిత పథికజనశ్రమాతిరేకంబు లైన తటాకంబులు, బహువిధ విహంగ నినద మనోహరంబు లై వికచారవింద మధు పాన పరవశ పరిభ్రమద్భ్రమర సుందరంబు లైన సరోవరంబులు దాఁటి చనుచు; క్షుత్పిపాసాసమేతుండ నై యొక్క నదీహ్రదంబునఁ గ్రుంకులిడి శుచినై, నీరుద్రావి గతశ్రముండనై.

టీకా:

ఉత్తర = ఉత్తరదిక్కుకు; అభిముఖుండన్ = తిరిగినవాడిని; ఐ = అయి; ఏను = నేను; వెడలి = బయలుదేరి; జనపదంబులున్ = నగరములు; పురంబులున్ = పురములు; పట్టణంబులున్ = పట్టణములు; గ్రామంబులున్ = గ్రామములు; పల్లెలున్ = పల్లెటూళ్ళు; మందలున్ = మందలు (సంచార జాతుల వారి); కిరాత = కిరాతులయొక్క; పుళింద = పుళిందులయొక్క; నివాసంబులున్ = నివాసములు; ఉపవనంబులున్ = ఉద్యానవనములు; చిత్ర = చిత్రమైన; ధాతు = ఖనిజాలతో; విచిత్రితంబులు = విచిత్రములు; అయిన = అయినట్టి; పర్వతంబులు = పర్వతములు; సమద = మదమెక్కిన; కరి = ఏనుగు; కర = తొండములచే; విదళిత = విరవబడ్డ; శాఖలు = కొమ్మలు; కల = కలిగిన; శాఖులును = (కొమ్మలతోనుండేవి) చెట్లు; నివారిత = వారింపబడిన; పథికజన = బాటసారుల; శ్రమ = అలసటయొక్క; అతిరేకంబులు = విజృంభణలు, చెలరేగుటలు; ఐన = కలిగిన; తటాకంబులు = చెరువులు; బహువిధ = వివిధరకముల; విహంగ = పక్షుల; నినద = కలకలారావముతో, అరపులతో; మనోహరంబులై = మనోహరములై; వికచ = వికసించిన; అరవింద = పద్మముల; మధు = తేనె; పాన = తాగుటవలన; పరవశ = పరవశించి; పరిభ్రమత్ = తిరుగుచున్న; భ్రమర = తుమ్మెదలతో; సుందరంబులు = అందమైన; ఐన = అయినట్టి; సరోవరంబులు = సరస్సులు; దాఁటి = దాటుకొనుచు; చనుచున్ = వెళ్ళుచుండగ; క్షుత్ = ఆకలి; పిపాసా = దాహములుతో; సమేతుండను = కూడుకొన్నవాడను; ఐ = అయి; ఒక్క = ఒక; నదీ = నదియొక్క; హ్రదంబునన్ = మడుగులో; క్రుంకులిడి = స్నానముచేసి; శుచిని = శుభ్రపడినవాడను; ఐ = అయి; నీరు = నీరు; త్రావి = తాగి; గత = పోగొట్టబడిన; శ్రముండన్ = అలసటకలవాడను; ఐ = అయి.

భావము:

అలా అనుకొన్న నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి జనపదాలు, పురాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, వ్రేపల్లెలు, భిల్లవాటికలు, తోటలు దాటుకొంటూ; ఖనిజాలతో చిత్రమైన రంగులద్దుకున్న పర్వతాలూ; మదపూరితమైన ఏనుగులు తొండాలతో విరపబడ్డ కొమ్మలు గల వృక్షాలూ; బాటసారుల మార్గాయాసాన్ని పోగొట్టే తటాకాలు; నానావిధాలైన పక్షుల కలకలారావాలతో రమణీయమై, వికసించిన తామరపూలతో అలరారుతూ వాటి మకరందాన్ని త్రాగి పరవశించి పరిభ్రమించే తుమ్మెదలతో అందగిస్తున్న సరస్సులూ దాటుతూ ముందుకు సాగాను. అప్పుడు నాకు ఆకలీ దప్పికా ఎక్కువయ్యాయి. ఒక యేటి మడుగులో శుభ్రంగా స్నానం చేసి నీరు త్రాగి నా మార్గాయాసాన్ని తగ్గించుకొన్నాను. అంతట...