పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని పూర్వకల్పము

  •  
  •  
  •  

1-108-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు హరిసేవారతిం జేసి ప్రపంచాతీతుండ నై, బ్రహ్మరూపకుండ నయిన నా యందు స్థూలసూక్ష్మం బయిన యీ శరీరంబు నిజ మాయాకల్పితం బని యెఱింగితి; యమ్మహాత్ము లగు యోగిజనుల మూలంబున రజస్తమోగుణ పరిహారిణి యయిన భక్తి సంభవించె; నంతఁ జాతుర్మాస్యంబు నిండిన నయ్యోగిజనులు యాత్ర సేయువార లై; రివ్విధంబున.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; హరి = హరియొక్క; సేవా = భక్తియందలి; రతిన్ = ఆసక్తి; చేసి = వలన; ప్రపంచ = ప్రకృతికి; అతీతుండన్ = అతీతమైనవాడిని; ఐ = అయి; బ్రహ్మ = పరబ్రహ్మయొక్క; రూపకుండన్ = రూపము దాల్చినవాడను; అయిన = అయిన; నా = నా; అందున్ = అందలి; స్థూల = స్థూలమూ; సూక్ష్మంబు = సూక్ష్మమూ; అయిన = అయినట్టి; ఈ = ఈ; శరీరంబున్ = శరీరము; నిజ = తన; మాయా = మాయచే; కల్పితంబు = కల్పింపబడినది; అని = అని; ఎఱింగితిన్ = తెలిసికొన్నాను; ఆ = ఆ; మహా = గొప్ప; ఆత్ములు = ఆత్మగలవారు; అగు = అయినట్టి; యోగి = యోగుల; జనుల = సమూహము; మూలంబునన్ = వలన; రజస్ = రజోగుణము; తమోగుణ = తమోగుణముల; పరిహారిణి = పరిహరించునది; అయిన = అయినట్టి; భక్తి = భక్తి; సంభవించెన్ = కలిగినది; అంతన్ = అంతలో; చాతుర్మాస్యంబున్ = (వారి) చాతుర్మాస్య దీక్ష; నిండినన్ = పూర్తికాగా; ఆ = ఆ; యోగి = యోగుల; జనులు = సమూహము; యాత్ర = యాత్ర {యాత్ర - యోగుల నియమమును అనుసరించి ఏకస్థలమున ఉండరాదు కనుక వారు చేయు ప్రయాణములు.}; చేయువారలు = చేయువారు; ఐరి = అయినారు; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.

భావము:

అప్పుడు నాకు హరి సేవలో అమితమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి బ్రహ్మ స్వరూపుణ్ణి అయి, యట్టి నా యందు స్థూలం సూక్ష్మం అయిన ఈ శరీరం కేవలం మాయా కల్పితమని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల రజస్తమోగుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానకి వెళ్లటానికి ఉద్యుక్తులైనారు.