పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : వ్యాసచింత

  •  
  •  
  •  

1-84-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మేధావిహీను లయిన పురుషులచేత నట్టి వేదంబులు ధరియింపబడు చున్నవి; మఱియు దీనవత్సలుం డయిన వ్యాసుండు స్త్రీ శూద్రులకుం ద్రైవర్ణికాధములకు వేదంబులు విన నర్హంబులుగావు గావున మూఢుల కెల్ల మేలగు నని భారతాఖ్యానంబు చేసియు నమ్ముని భూతహితంబు నందుఁ దన హృదయంబు సంతసింపకున్న సరస్వతీతటంబున నొంటి యుండి, హేతువు వితర్కించుచుఁ దనలో నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; మేధా = ప్రజ్ఞ; విహీనులు = లేనివారు; అయిన = అయినట్టి; పురుషులు = మానవులు; చేతన్ = చేత; అట్టి = అట్టి; వేదంబులు = వేదములు; ధరియింపబడుచున్ = స్వీకరింపబడుతూ; ఉన్నవి = ఉన్నవి; మఱియున్ = ఇంకను; దీన = దీనులందు; వత్సలుండు = దయగలవాడు; అయిన = అయినట్టి; వ్యాసుండు = వ్యాసుడు; స్త్రీ = స్త్రీలకు; శూద్రులు = శూద్రులు; కున్ = కును; త్రై = మూడు; వర్ణిక = వర్ణములలోని; అధములు = అధములు; కున్ = కున్; వేదంబులు = వేదములు; వినన్ = వినుటకు; అర్హంబులు = సమర్థంబులు; కావు = కావు; కావునన్ = అందువలన; మూఢులు = మూఢులు; కున్ = కు; ఎల్లన్ = అందరికిని; మేలు = మేలు; అగును = కలుగును; అని = అని; భారత = భారతము; ఆఖ్యానంబు = రచన; చేసియున్ = చేసినప్పటికిని; ఆ = ఆ; ముని = ముని; భూత = జీవులకు; హితంబు = మేలు చేయుట; అందున్ = లో; తన = తనయొక్క; హృదయంబు = హృదయము; సంతసింపక = సంతోషింపకుండా; ఉన్న = ఉండగా; సరస్వతీ = సరస్వతీనదియొక్క; తటంబునన్ = ఒడ్డుమీద; ఒంటి = ఒంటరిగా, ఏకాంతముగ; ఉండి = నిలిచి; హేతువు = కారణము; వితర్కించుచున్ = చింతించుచు; తనలోన్ = తనలోతాను, స్వగతంగా; ఇట్లు = ఈవిధంగా; అనియెన్ = అనుకొన్నాడు.

భావము:

ఈ విధంగా వేదములు విభజింపబడి మందబుద్ధు లైన మానవులచే పఠింపబడుతూ ఉన్నాయి. బ్రహ్మ బంధువులు, స్ర్తీలు, శూద్రులు, వేద శ్రవణానికి సమర్థులు కారు కనుక, సామాన్యు లందరికీ క్షేమం కలగాలని దీనవత్సలుడైన వ్యాసభగవానుడు మహాభారతాన్ని రచించాడు. అయినప్పటికీ విశ్వశ్రేయస్సు కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతుష్టి చెందలేదు. అందువల్ల ఆ మహర్షి సరస్వతీ నదీతీరంలో ఏకాంతంగా కూర్చుండి తన అసంతుష్టికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు.