పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శుకుడు భాగవతంబు జెప్పుట

  •  
  •  
  •  

1-78-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నగ్నుండుఁ దరుణుండునై చను తన కొడుకుం గని వస్త్రపరిధానం బొనరింపక వస్త్రధారియు వృద్ధుండును నైన తనుం జూచి చేలంబులు ధరియించు దేవరమణులం గని వ్యాసుండు కారణం బడిగిన వారలు, నీ పుత్రుండు”స్త్రీ పురుషు లనెడు భేదదృష్టి లేక యుండు; మఱియు నతండు నిర్వికల్పుండు గాన నీకు నతనికి మహాంతరంబు గల" దని రట్టి శుకుండు కురుజాంగల దేశంబుల సొచ్చి హస్తినాపురంబునఁ బౌరజనంబులచే నెట్లు జ్ఞాతుండయ్యె? మఱియు నున్మత్తుని క్రియ మూగ తెఱంగున జడుని భంగి నుండు నమ్మహాయోగికి రాజర్షి యైన పరీక్షిన్మహారాజు తోడ సంవాదం బెట్లుసిద్ధించె? బహుకాలకథనీయం బయిన శ్రీభాగవతనిగమ వ్యాఖ్యానం బేరీతి సాగె? నయ్యోగిముఖ్యుండు గృహస్థుల గృహంబుల గోవునుఁ బిదికిన యంత దడవు గాని నిలువంబడం; డతండు గోదోహనమాత్ర కాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబు లగు నండ్రు; పెద్దకాలం బేక ప్రదేశంబున నెట్లుండె? భాగవతోత్తముం డైన జనపాలుని జన్మ కర్మంబు లే ప్రకారంబు? వివరింపుము.

టీకా:

మఱియున్ = ఇంకనూ; నగ్నుండున్ = వస్త్రములు దాల్చనివాడు; తరుణుండును = మంచివయసులో నున్నవాడు; ఐ = అయి; చను = వెళ్ళుచున్న; తన = తనయొక్క; కొడుకున్ = పుత్రుని; కని = చూచి; వస్త్ర = దుస్తులను; పరిధానంబు = ధరియించుటను; ఒనరింపకన్ = చేయకుండా; వస్త్ర = దుస్తులు; ధారియున్ = ధరించినవాడు; వృద్ధుండును = ముసలివాడును; ఐన = అయినట్టి; తనున్ = తనను; చూచి = చూసి; చేలంబులు = దుస్తులు; ధరియించు = ధరిస్తున్న; దేవ = దేవలోకపు; రమణులన్ = కన్యలను; కని = చూసి; వ్యాసుండు = వ్యాసుడు; కారణంబు = కారణమును; అడిగినన్ = అడగగా; వారలు = వారు; నీ = నీయొక్క; పుత్రుండు = పుత్రుడు; స్త్రీ = స్త్రీలు; పురుషులు = పురుషులు; అనెడు = అనే; భేదదృష్టి = భేదమునుచూచుట; లేక = లేకుండా; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకనూ; అతండు = అతను; నిర్వికల్పుండు = భ్రాంతి లేని వాడు; కాన = కావున; నీకున్ = నీకు; అతని = అతని; కిన్ = కిని; మహ = గొప్ప; అంతరంబు = భేదము; కలదు = ఉన్నది; అనిరి = అన్నారు; అట్టి = అటువంటి; శుకుండు = శుకుడు; కురు = కురురాజ్యంలో; జాంగల = మెఱక; దేశంబులన్ = ప్రదేశములలో; సొచ్చి = ప్రవేశించి; హస్తినాపురంబునన్ = హస్తినాపురములోని; పౌరజనంబుల = పురజనుల, పౌరులు; చేన్ = చేత; ఎట్లు = ఏవిధముగా; జ్ఞాతుండు = గుర్తింపబడ్డాడు; అయ్యెన్ = అయినాడు; మఱియున్ = ఇంకనూ; ఉన్మత్తుని = పిచ్చివాని; క్రియన్ = వలె; మూగ = మూగవాని; తెఱంగునన్ = వలె; జడుని = తెలివితక్కువవాని; భంగిన్ = వలె; ఉండున్ = ఉండువాడు; ఆ = ఆయొక్క; మహా = గొప్ప; యోగి = యోగి; కిన్ = కి; రాజ = రాజులలో; ఋషి = ఋషి వంటి వాడు {రాజర్షి - వేదశాస్త్రానుయాయి అగు రాజు}; ఐన = అయినట్టి; పరీక్షిత్ = పరీక్షిత; మహారాజు = మహారాజు; తోడన్ = తో; సంవాదము = సంభాషణము; ఎట్లు = ఏవిధముగ; సిద్ధించెన్ = జరిగినది; బహు = చాలా; కాల = కాలము; కథనీయంబు = చెప్పదగినది; అయిన = అయినటువంటి; శ్రీ = శ్రీ; భాగవత = భాగవతమనే; నిగమ = వేదమునకు; వ్యాఖ్యానంబున్ = వ్యాఖ్యానము; ఏ = ఏ; రీతిన్ = విధముగ; సాగెన్ = నడచినది; ఆ = ఆ; యోగి = యోగులలో; ముఖ్యుండు = ముఖ్యమైన వాడు; గృహస్థుల = గృహస్తాశ్రమవాసుల; గృహంబులన్ = ఇళ్ళల్లో; గోవును = ఆవును; పిదికిన = (పాలు) పితికిన; అంత = అంతమాత్రము; తడవు = సమయము; కాని = కంటే ఎక్కవ కాలం; నిలువంబడండు = నిలబడడు; అతండు = అతను; గో = గోవును; దోహన = పితికినయంత; మాత్ర = మాత్రము; కాలంబు = సమయము; సంచరించిన = తిరిగిన; స్థలంబులు = ప్రదేశములు; తీర్థంబులు = పుణ్యస్థలములు; అగున్ = అగును; అండ్రు = అందురు; పెద్ద = ఎక్కువ; కాలంబు = సమయము; ఏక = ఒకే; ప్రదేశంబునన్ = తావున; ఎట్లు = ఏవిధముగ; ఉండెన్ = ఉండెను; భాగవత = భాగవతులలో; ఉత్తముండు = ఉత్తముడు; ఐన = అయినట్టి; జనపాలుని = రాజు {జనపాలుడు - జనులను పాలించు వాడు, రాజు}; జన్మ = పుట్టుక; కర్మంబులు = ప్రవర్తనములు; ఏ = ఏ; ప్రకారంబు = విధమో; వివరింపుము = వివరముగాచెప్పుము.

భావము:

అప్పుడు నగ్నంగా స్నానాలు చేస్తున్న దేవకాంతలు, దిగంబరుడు, నవయువకుడు ఐన తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా, వస్త్రధారి వృద్ధుడు ఐన తనను చూసి లజ్జతో వస్త్రాలు కట్టుకొన్న దేవకాంతలను చూసి ఆశ్చర్యపడి, వ్యాసుడు అందుకు కారణ మేమిటని అడిగాడు; అప్పుడు వారు”నీ కుమారుడికి స్త్రీపురుషబేధభావము లేదు; అంతేకాక ఆయన నిర్వికల్పుడు; మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు; నీకు, ఆయనకు ఎంతో భేదం ఉంది” అన్నారట; అటువంటి శుకబ్రహ్మ కురుజాంగల దేశాలు ఎలా ప్రవేశించారు; హస్తినాపురంలోని పౌరులు ఆయన్ని ఎలా గుర్తుపట్టారు; పిచ్చివాడిలా, మూగవాడిలా, జడునిలా ఉండే ఆ మహర్షి, రాజర్షియైన పరీక్షిన్మహారాజుల మధ్య సంభాషణ ఏ విధంగా కుదిరింది; శ్రీమహాభాగవత సంహితను చెప్పడానికి ఎంతో కాలంపడుతుంది; దానిని శుకబ్రహ్మ వచించటం ఎలా జరిగింది; అంతేగాక మహావిరాగి యైన ఆ శుకయోగి గృహస్థుల ఇండ్లలో గోవు పాలు తీసేటంత సేపు మాత్రమే నిలుస్తాడని, ఆయన గో దోహన మాత్ర సమయం నిలిచిన చోట్లు అన్నీ పుణ్యతీర్థాలౌతాయని పెద్దలు అంటారు; అట్టి మహానుభావుడు అన్నాళ్ళు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన ఆ పరీక్షిన్నరేంద్రుడి జన్మ ప్రకారం ఏమిటి, ఏమేమేం చేసాడు? దయతో ఈ విశేషాలన్నీ వివరంగా తెలుపుము.