పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్కంధాలు-పద్యాల గణన : గణనోపాఖ్యానం -1

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

పోతన తెలుగు భాగవతము – గణనోపాఖ్యానం
భాగము – 1

గణనోపాఖ్యానం

సంఖ్యా పర అధ్యయనం గణనోపాఖ్యానం; ఈ ప్రయత్నంలో పోతన తెలుగు భాగవతంలో కనుగొనబడిన కొన్ని సంఖ్యా పర మౌలిక విషయాలను అధ్యయనం చేసి. గ్రంథంలో వచ్చే వివిధ విషయాలను కంప్యూటరుతో గణించి జనింపజేసిన పట్టికలు, పటాలు, జాబితాలు సోదాహరణంగా చూద్దాం.

గ్రంథ విస్తారం

పోతన తెలుగు భాగవతం వైవిధ్య రీత్యా, విస్తార రీత్యా, విస్తృతి రీత్యా బృహద్గ్రంథం; 9013 పద్యగద్యలు, 12 స్కంథాలతో, 31 రకాల ఛందస్సులలో అలరారుతోంది; స్కంథ వారీ గ్రంథ సంఖ్య జనింపజేసిన పట్టిక; పటం ఇక్కడ చూడండి.

స్కంథ వారీ పద్యాలు

స్కంథము - సంఖ్య - స్కంథము - సంఖ్య
ప్రథమ - 530 - సప్తమ - 483
ద్వితీయ - 288 - అష్టమ - 745
తృతీయ - 1055 - నవమ - 736
చతుర్థ - 977 - దశమ మొదటి భాగం - 1792
పంచమ పూర్వాశ్వాసం - 184 - దశమ రెండవ భాగం - 1343
పంచమ ఉత్తరాశ్వాసం - 168 - ఏకాదశ - 127
షష్ఠ - 531 - ద్వాదశ - 54
- - గ్రంథం - 9013

ఇది కల్పవృక్షానికి, గాయత్రీ మంత్రానికి సామ్యం చెప్పబడినది; సృష్టి మొదలు ప్రళయం వరకు, పుట్టుక, చావుల క్రమం, భగవంతుని అనంత అవతారాలు మహిమా విశేషాలు, మానవ వికాసానికి దర్పణములైన మనువులు, రాజుల వంశాల చరిత్రలు, కాలం స్వరూపం ఇలా అనంతమైన వస్తు విస్తారాలు కలది; దీనిలో నీతి, ధర్మం వివరించబడ్డాయి; సామాన్య శాస్త్రాలకు చెందిన అనేక విషయాలు ప్రస్తావించారు; వాటి మూలాలు చూడాలంటే, ఏంతో శ్రమించాలి. ఇందులో భాషాపరంగా కవిత్వ పరంగా ఉన్నత విలువలు వైవిధ్యం ఉన్నాయి. భక్తి, రక్తి మున్నగు నవరస భరితం ఈ పోతన గ్రంథం తెలుగు భాగవత గ్రంథం. అలాంటి ఈ పురాణరాజాన్ని సంఖ్యా పరంగా గణించే ప్రయత్నానికి ఆరంభం ఇది.

గ్రంథ రచన ప్రణీతం

ఇట్టి మహా పురాణాన్ని కాగితం కలాలు కూడా లేని కాలంలో వచించిన ఆ మహాత్ముల ధారణ శక్తి, మేధాశక్తి ఎంత అని ఆలోచిస్తే అంతులేని అద్భుతంగా అనిపిస్తుంది. దీనిలో వచ్చే ఒక్కొక్క విషయాన్ని ఏఏ కథలో ఎలా ప్రయోగించారు దీనికి మూలాధారం ఏమిటి ఎంతవరకు ఆచరణ సాధ్యం లాంటివి చూడాలంటే తక్కువ శక్తి సామర్థ్యాలు చాలవు. అందుచేత, ఇప్పటి తరాల్లో పెరుగుతున్న మేధాశక్తి, ధారణశక్తి, తెలివితేటలకు సరిపడేది; కంప్యూటరు అంతర్జాలాది ఆధునిక సాథనసంపత్తిల సహాయంతో అధ్యయనం చేయడానికి తగినది; ఉపయుక్తమైనది ఈ పుస్తకంలోని దివ్యమైన జ్ఞానం.
సంస్కృతంలో
భాగవత మూలమునకు ప్రేరకుడు నారద మహర్షి; కృతికర్త వ్యాస భగవానులు,
ప్రయోక్త శుక బ్రహ్మ. ప్రదాన శ్రోత ముముక్షువు పరీక్షిన్మహారాజు.
భాగవతము ప్రవచించిన వారు సూతుడు. శ్రోతలు శౌనకాది మహర్షులు.
తెలుగులో

కృతి కర్తల-పద్యాలుఆంధ్రీకరణంలో పాలుపంచుకున్న కృతికర్తలు నలుగురు. వారు (1) బమ్మెర పోతన మఱియు (2) బొప్పరాజు గంగనార్యుడు, (3) ఏర్చూరి సింగయ, (4) వెలిగందల నారయ.
మొత్తం పద్యాలు = 9013
పోతన గారివి = 7949
గంగన గారివి = 352
సింగయ గారివి = 531
నారయ గారివి = 181
గమనిక:-
ఏ ఏ పద్యాలు ఎవరివి, ప్రక్షిప్తాలు ఏవీ అని, గ్రంథంలోని పద్యాలన్నీ నిర్దిష్టంగా నిర్ణయించటం తేలికైన పని కాదు. కాని సుమారు గణాంకాల సాధన కోసం 1, 2, 3, 4, 7, 8, 9, 10.1, 10.2 స్కంథాలు పోతన్న గారివి గాను, 5.1, 5.2 స్కంథాలు గంగన వారివి గాను, 6 స్కంథం సింగయ గారిది గానూ, 11, 12 స్కంథాలు నారయ గారివి గానూ తీసుకుని జనింపజేసిన పట్టిక / పటంఇది, గమనించ మనవి.

పోతన భాగవతంలో అనుయాయులు / ఇతరుల రచనలు చేరటానికి కారణం

పోతన భాగవత రచనలో ఇతర కవులు చేతులు కలుపుటకు కారణము నిశ్చయించబడలేదు కాని, మూడు విధములైన అభిప్రాయములు ప్రబలంగా ఉన్నవి. (అ) పోతన గారే రచనా సౌకర్యార్థం ఇలా నిశ్చయించుట; (ఆ) సర్వజ్ఞ సింగమనీడు చేత భూమిలో పాతి పెట్టబడుట వలన క్రిమిదష్టమౌట; (ఇ) పోతన గారి పూజామందిరములో కాలప్రభావము వలన క్రిమిదష్టమౌట.
కాల ప్రభావం కానీ మరొకటి కాని ఏ కారణాలు అయితేనేం, కొన్ని పూరణాలు, ప్రక్షిప్తాలు జరిగినా కాని, సంకల్పం చేసి సంపూర్ణం చేసిన వారు పోతనామాత్యులు. వాసి లోను, రాసి లోను అత్యధికంగా రచించిన వారు పోతన గారే. అందుకే ప్రస్తుతం లభ్యం అవుతున్న గ్రంథం సహజంగానే పోతన భాగవతం గా ప్రసిద్ధం అయింది.

గణన

తెలుగు పురాతన గ్రంథాలు “పద్య”, “వచన”, “చంపూ” రచనలు అని మూడు (3) విధాలుగా విభజించ వచ్చును. "చంపూ" రచన అంటే పద్య, గద్యాలు రెండింటిని వాడిన రచన. ఈ విధానాన్ని భాగవత ఆంధ్రీకరణంలో ప్రయోగించారు. "వచన" రూపంలో రచన పురాతన సాహితీ సంప్రదాయంలో లేదని అనుకోవచ్చు. భాగవతము లో ఒక విధమైన బైనరీ (ద్విశాంశ) విధానంలో రచన సాగిందని నాకు అనిపించింది. భాగవతములో హరి చరిత్రను ద్వాదశ లింగములకు ప్రతీకగా ద్వాదశ రాశులకు ప్రతీకగా 12 స్కంథముల లో హరి హర అభేద్యమైన నిరూపణ నిమిత్తము చెప్పబడినది కావచ్చు
ఇద్దరు “ఇష్ట దేవతా వందనము, కవి స్తుతి, స్వప్న వృత్తాంతము, కవి వంశ వర్ణనము మరియు షష్ఠ్యంతములు” తో తమ రచన ప్రారంభించారు. వీరిలో సహజంగా (1) పోతన గారు గ్రంథ ప్రారంభంలో, (2) సింగయ గారు షష్ఠ స్కంథం ఆరంభంలోను.
గంగన, నారయ ఇద్దరూ చెరొక రెండు చొప్పున రచించారు. గంగన తన పంచమ స్కంథం చిన్నది అయినప్పటికి రెండు ఆశ్వాసాలుగా విభజించారు. అది బహు తత్వభూయిష్టము కావటం వలన రెండు ఆశ్వాసాలుగా విడదీసారేమో. నారయ ఏకాదశ ద్వాదశ స్కంథాలను తెనుగీకరించారు.
ఒక్కరే (నారయ గారు) తాము వ్రాసిన స్కంథాలలో పోతన గారి శిష్యుడిని అని గర్వంగా విరచితం స్కంథం చివరి లోని గద్యం) లో చెప్పుకున్నారు.
పన్నిండింటిలో రెండు స్కంధాలు మాత్రమే రెండు భాగాలు (పూర్వ భాగం మఱియు ఉత్తర భాగం) గా విడదీయబడ్డాయి. వాని లో (1) దశమ స్కంథం అయితే పెద్దది కనుక రెండు భాగాలు అనుకొంటే (2) పంచమ స్కంథం చిన్నది అయినా రెండు భాగాలు చేయబడింది. అవి ఎంత పెద్దవి, ఎంత చిన్నవి అంటే:

కృతి కర్తల-పద్యాలు

మొత్తం పద్యగద్యలు = 9013; (100%)
రెండు భాగాలు చేసిన స్కంధాలు
10వ స్కంథంలో = 3135 (35%)
5వ స్కంథంలో = 352 (4%)

స్కంథాల విస్తృతి

దశమ స్కంథం (రెండు భాగాలు కలిసి) 3135 పద్యగద్యలుతో అన్నిటి కంటే పెద్దది. మొత్తం (9013) పద్యగద్యలులో సుమారు మూడవ వంతు.
తృతీయ స్కంథం 1055 పద్యగద్యలు తో రెండవ స్థానంలో వుంది
ద్వాదశ స్కంథం 54 పద్యగద్యలు తో చిన్నది. మొత్తం పద్యాలలో సుమారు ఇరవైయ్యవ వంతు.
ఏకాదశ స్కంథం 126 పద్యగద్యలు తో రెండవ చిన్నది.
పన్నెండు స్కంథాలు పంచమ, దశమ స్కంథాల ఉత్తర భాగాలతో సహా (మొత్తం 14) అన్నీ ప్రబంధ సంప్రదాయం ప్రకారం పవిత్రమైన “శ్రీ” అనే అక్షరంతోనే ప్రారంభింపబడ్డాయి.
పన్నెండు స్కంథాలు పంచమ, దశమ స్కంథాల ఉత్తర భాగాలతో సహా (మొత్తం 14) అన్నింటిలోనూ గద్య రూపంలో ప్రతి స్కంథం, ప్రతి భాగము ఆఖరున తత్కాల ప్రబంధ సంప్రదాయం ప్రకారం కవి “ఇది తన విరచిత” మని తెలుపుట జరిగింది.

ఛందోపరం

కృతి కర్తల-పద్యాలు
పోతన తెలుగు భాగవతము నందు రెండు రకాల రూపములలో రచనలు చేయబడ్డాయి. అవి (అ) ఛందోసహితం, (ఆ) ఛందోరహితం. ఛందస్సు మూలాలైన గణాలు మాత్రలు నియమం ఏమీ లేనివి అనే భవనలో ఛందోరహితం అని వాడాను.
అసలు ఛందస్సుకు మూలం గురు లఘువులు అనే ద్విశాంశ పద్దతి.
(అ) ఛందోసహితం రెండు రకాల రూపములలో చేయబడ్డాయి. అవి
(ఇ) పద్య రూపం (నియమిత పాద విభజన కలవి), (ఈ) దండక రూపం (పాద విభజన లేక ఏక పాదంగా ఉండేవి)
(ఇ) పద్య రూపం లో రెండు రకాల రూపములలో చేయబడ్డాయి. అవి
(1) పద్యాలు, (2)శ్లోకము
(2) శ్లోకము రూపములో – ఒకటే రచించబడింది – అది సింగయ కృత షష్ఠ స్కంథంలో రచించబడినది.
1) పద్యాలు రూపం లో రెండు రకాల రూపములలో చేయబడ్డాయి.
(1) నాలుగు పాదాల పద్యాలు, (2) నాలుగు పాదాల ద్వయం పద్యాలు.
(1) నాలుగు పాదాల పద్యాలు – మొత్తం 28 వృత్తాలలో రచించబడ్డాయి.
(2) నాలుగు పాదాల ద్వయం పద్యాలు రూపం సీస పద్యం రూపంలో రచించబడ్డాయి.
సీస పద్యాలుగా రెండు రకాల రూపములలో ఉన్నాయి. అవి అ) సీస పద్యాలు, ఆ) సర్వ లఘు సీసము.
(1) సీస పద్యాలు రెండు రకాల రూపములలో చేయబడ్డాయి. అవి (1) ఆటవెలదితో సీస పద్యాలు, (2) తేటగీతితో సీస పద్యాలు.
(2) సర్వ లఘు సీసము రూపంలో తేటగీతితో కూడి నారయ కృత ఏకాదశ స్కంథం లో ఒక పద్యము గలదు.
(ఈ) దండక రూపంలో రెండు (2) రచించబడినవి. అవి (1) తృతీయ స్కంథంలో (శ్రీనాథ దండకము) ను,
(2)దశమ స్కంథం పూర్వ భాగములో (శ్రీమానినీమానసచోర దండకము)ను రచించబడ్డాయి.
(ఆ) ఛందోరహిత రూపంలో రెండు రకాల రూపములలో చేయబడ్డాయి. అవి (1) వచనములు గాను, (2) గద్యములు గాను.
వచనములను రెండు రకములుగా వాడబడ్డాయి. అవి (1) రెండు పద్యాలకు మధ్య అనుసంధానం గాను, (2) విషయ వ్యాప్తి దృష్ట్యా వివరించుటకు.
అద్వైతాన్ని ప్రత్యేకంగా చెప్పడానికి ఒక రకమైన బైనరీ (ద్వైయాంశ) అంతర్లీనం గా రచించబడిందా అనిపిస్తోంది ఈ వివరాలు చూస్తుంటే

కృతి కర్తల-పద్యాలు : : కృతి కర్తల-పద్యాలు
పోతన తెలుగు భాగవతంలో గ్రంథంలో 9013 పద్యగద్యలు ఉన్నాయి. వాటిలో 1047 సీస పద్యాలు మరియు ఒకటి (1) సర్వలఘు సీసం. ఈ 1048 క్రింద ఛందస్సు నియమాలు ప్రకారం ఆటవెలది కాని, గీత కాని ఉన్నాయి. వాటిని 73.7, 26.4 శాతాల సీసపద్యాలకు వాడారు.
సీసం క్రింద వాడిన పద్యాల సంఖ్యలు 1. విడిగా వాడిన తేటగీతి పద్యాలు 289 ఉంటే సీసం క్రింద ఉన్నవి 771. విడిగా ఉన్న ఆటవెలదులు 427 సీసం క్రింద ఉన్నవి 276, విడిగా, సీసం క్రింద వాడిన పద్యాల సంఖ్య 1 గ్రంథం ఛందస్సు విశ్లేషణ చేసేటప్పుడు వీటిని కలిపి గణించటం ఉచితమైన పని కనుక అలా అనుసరిస్తున్నాను.

కృతి కర్తల-పద్యాలు : : కృతి కర్తల-పద్యాలు
మొత్తం మీద పది (10) ఛందస్సు ప్రక్రియలు ఒక్కమారు మాత్రమే ప్రయోగించారు. అవి,
ఉపేంద్ర వజ్రము, తోటకము, పంచచామరం, భజంగ ప్రయాతము, మంగళ మహాశ్రీ, మానిని, వనమయూరము, శ్లోకము, సర్వలఘు సీసం, స్రగ్విణి.
అత్యధికంగా వాడిన ప్రక్రియ వచనము 2680 వాడబడినవి. గద్యం 14 కలిపితే, ఛందోరహితంగా 2694. అంటే పావు వంతు పై మాట. దీనిని మరింత నిర్దిష్టంగా చూడటానికి అక్షర సంఖ్యతో పరిశీలించాలి. రెండేసి (2) చొప్పున వాడినవి రెండు. అవి, దండకము, మహాస్రగ్దర, ఇక పోతే రెండు అంతకన్నా ఎక్కువ, వంద లోపు (>1, < 100) వాడిన ప్రక్రియలు పన్నెండు (12). వందకన్నా (>100) అధికంగా వాడినవి తొమ్మిది (9), మొత్తం పద్యాల వ్యాప్తి పట్టికను క్రింద చూడగలరు.

ఛందస్సు | గ్రంథం || ఛందస్సు | గ్రంథం | ఛందస్సు | గ్రంథం
- | - || - | - || - | -
సీసం క్రింది వాటితో = | 10061 || మత్తకోకిల | 41 || ఉపేంద్ర వజ్రము | 1
మొత్తం = | 9013 || తరలము | 23 || తోటకము | 1
- | - || గద్యము | 14 || పంచచామరం | 1
వచనము | 2680 || మాలిని | 12 || భుజంగ ప్రయాతము | 1
కంద పద్యము | 2610 | ఇంద్ర వజ్రము | 4 || మంగళమహాశ్రీ | 1
తేటగీతి + సీసం క్రింది | 1061 || లయగ్రాహి | 4 || మానిని | 1
సీస పద్యము | 1047 || ఉత్సాహము | 3 || వన మయూరము | 1
ఆటవెలది + సీసంక్రింది | 703 || కవిరాజ విరాజితము | 3 || శ్లోకము | 1
మత్తేభ విక్రీడితము | 587 || లయవిభాతి | 3 || సర్వలఘు సీసం | 1
చంపకమాల | 486 || స్రగ్దర | 3 || స్రగ్విణి | 1
ఉత్పలమాల | 475 || దండకము | 2 || |
శార్దూల విక్రేడితము | 288 || మహాస్రగ్దర | 2 || |

షష్ఠ స్కంథం ప్రణీతం కర్త సింగయ విశేషంగా 22 రకాల ఛందోప్రక్రియలు ఉపయోగించారు. గ్రంథం మొత్తం మీద ఒకేమారు వాడిన పది (10) ప్రక్రియలలోనూ, అయిదు (5) వీరి ప్రయోగాలు. అవి, తోటకము, మంగళమహాశ్రీ, వన మయూరము, శ్లోకము, స్రగ్విణి. ఇవి కాక తన షష్ఠ స్కంథంలో మరొక అయిదు (4) ఇంద్ర వజ్రము, ఉత్సాహము, మహాస్రగ్దర, స్రగ్దర మరియు గ్రంథం సంప్రదాయాన్ని అనుసరించి ఒకటి (1) గద్యము ఒక మారే ఉపయోగించారు. మొత్తం తొమ్మిది (10) ఛందోప్రక్రియలు, తన 531 పద్యాలలోను ఒకేమారు ప్రయోగించి తన ఛందస్సు మీది ప్రీతిని చూపారు. కాని మానిని ఛందస్సు మిగతా స్కంథాలలో ఒక్కొక్కమారు వాడబడినా గంగన వాడలేదు.
ఏకాదశ ద్వాదశ కృతి చేపట్టిన పోతన శిష్యుడను అని ఎలుగెత్తి చాటుకున్న “నారయ” పాలుపంచుకున్న 181 (127 + 54) పద్యాలలో బహు క్లిష్టమైన అరుదైన సర్వలఘు సీసం ఒకే మారు ప్రయోగించారు. ఈ నాటికి చాలా వ్యాకరణ పుస్తకాలలో సర్వలఘు సీస పద్యానికి ఉదాహరణగా దీనినే చూపుతున్నారు. మిగతా ఇద్దరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో బమ్మెర పోతనామాత్యుని అనుయాయులే అయినా నారయ ప్రత్యేకత నారయది.
తన విద్వత్తు ప్రదర్శన కన్నా గ్రంథసారాన్ని అందించుటపై అధిక శ్రద్ధ ఉన్న పోతన్న గారు తన 7949 పద్యాలలో ఒకేమారు వాడిన ఛందస్సులు ఆరు (6) ఉపేంద్ర వజ్రము, తోటకము, పంచచామరం, భుజంగ ప్రయాతము, మంగళమహాశ్రీ, మానిని.
పంచమ స్కంధం సంక్లిష్ఠ తత్వభూయిష్టము కనుక గంగన తన కృతిలో విషయ ప్రస్తావనకే అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉండవచ్చు.
[ఇంకా భాగం -2 ఉంది]