పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (ఉంకువ - ఔప)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


వసం.) పదం / పదబంధం = వివరం :: పద్యం సంఖ్యలు.
675) ఉంకువ = అల్లుడు కన్యకార్థముగా మామ కిచ్చెడి ద్రవ్యము, శుల్కము :: 10.1-1708-ఉ.
676) ఉగ్రపరేతభూమివాసుడు = ఉగ్ర (భయంకరమైన) పరేత (శ్మశాన) భూమి యందు వాసుడు (వసించువాడు), శివుడు :: 3-467-సీ.
677) ఉగ్రసేనుడు = కృష్ణుని తాత, కంసుని తండ్రి :: 3-52-క.; 3-99-సీ.
678) ఉగ్రాక్షుడు = ఉగ్రమైన కన్నులు కలవాడు, శివుడు :: 10.1-1761-వ.
679) ఉగ్రుడు = భయంకరుడు, శంకరుడు :: 4-105-శా.
680) ఉచథ్యుడు = ఔచిత్యము గలవాడు :: 4-26-వ.
681) ఉచ్ఛైశ్శ్రవము = ఇంద్రుని వాహనము, సాగరమథనంలో పుట్టిన తెల్లని గుఱ్ఱము :: 12-48-వ.
682) ఉజ్జ్వలపంకేరుహపత్రలోచనుడు = ప్రకాశవంతమైన పద్మదళాలవంటి కన్నులు గలవాడు, విష్ణువు :: 12-36-మ.
683) ఉట్టి = పాలు పెరుగు లాంటివి పిల్లులకు అందకుండుటకై పైన వేళ్ళాడదీసెడి తాళ్ళసాధనము :: 10.1-310-మత్త.; 10.1-361-ఆ.
684) ఉడురాజబింబముఖులు = ఉడురాజు (నక్షత్రములరాజు, చంద్రుని)బింబము వంటి ముఖము కలవారు, స్త్రీలు :: 10.2-674-సీ.
685) ఉడువీథి = నక్షత్రములు తిరిగెడి ప్రదేశము, ఆకాశము :: 10.2-941-ఉ.
686) ఉత్కంఠము = నేర్చుకొనుటాది యందలి వేగిరపాటు :: 9-624-క.
687) ఉత్కలిక = ఉత్ కలిక - అతిశయించు :: 2-151-చ.
688) ఉత్కళ = నిర్వహకురాలు, ధురీణురాలు :: 5.2-10-వ.
689) ఉత్తమచరితుడు = ఉత్తమమైన నడవడిక కలవాడు, యముడు. :: 10.1-1428-క.
690) ఉత్తమశ్లోకచరితుడు = మంచిగా కీర్తింపబడు వర్తన కలవాడు, విష్ణువు :: 3-225-తే.
691) ఉత్తమశ్లోకుండు = ఉత్తములచేత శ్లోకుండు (స్తుతింపబడువాడు), విష్ణువు :: 5.1-4-వ.
692) ఉత్తమశ్లోకుడు = ఉత్తములచేత శ్లోకుండు (స్తుతింపబడువాడు), విష్ణువు :: 1-241-సీ.; 2-7-సీ.; 3-202-వ.; 4-371-వ.; 4-445-సీ.
693) ఉత్తమాంగము = ఉత్తమమైన అంగము (అవయవము), తల :: 3-395-సీ.
694) ఉత్తముడు = మంచివాడు :: 4-219-సీ.
695) ఉత్తర = అభిమన్యుని భార్య, పరీక్షిన్మహారాజు తల్లి, విరాటరాజు కూతురు :: 3-130-వ.
696) ఉత్తరకర్మలు = మరణము తరువాత చేసెడి క్రియలు :: 6-467-వ.
697) ఉత్తరకొడుకు = ఉత్తర యొక్క పుత్రుడు, పరీక్షిత్తు :: 6-194-క.
698) ఉత్తరాత్ముజుడు = ఉత్తర యొక్క ఆత్మజుడు, పరీక్షిత్తు :: 5.2-3-క.
699) ఉత్తరానందనుడు = ఉత్తర యొక్క కొడుకు, పరీక్షిత్తు :: 1-516-వ.
700) ఉత్తానపాదుడు = ఉత్తాన (ఎత్తిన) పాదుడు (పాదము గలవాడు), ముందుకు సాగుట మొదలు పెట్టినవాడు :: 4-217-తే.; 4-968-వ.
701) ఉత్పాతము = దుఃఖరోగప్రదములు, 1దివ్యము (అపూర్వ గ్రహ నక్షత్రములు పుట్టుట) 2అంతరిక్షము (పరివేషము ఇంద్రధనుస్సును కలుగుట కొఱవియు పిడుగును పడుట) 3భౌమము (అపూర్వములైన చరాచర వస్తువులు కలుగుట) :: 10.2-95-వ.
702) ఉత్సృష్టము = సృష్ట (పుట్టించుటకు) ఉత్ (వ్యతిరేకమైనది) :: 5.1-120-వ.
703) ఉదంకుడు = పరమ భాగవతుడు, పైల మహర్షి శిష్యుడు, ముందు చాలాకాలము తక్షకునిపై పగబట్టి జనమేజయునిచే సర్పయాగము చేయించెను :: 2-204-సీ.
704) ఉదయాద్రి = పొద్దుపొడుచు కొండ, తూర్పు దిగంతము నందలి పర్వతము, పురోగమనమునకు సంజ్ఞామాత్రము :: 4-460-సీ.
705) ఉదవసానము = ఉత్ (నీరు) తో అవసానము (పూర్తి అగునప్పుడు చేయునట్టిది), ఉద్వాసనము :: 4-210-సీ.
706) ఉదాత్తతేజోనిధి = గొప్పతేజస్సునకు నిధివంటివాడు, విష్ణువు :: 3-544-వ.
707) ఉదాత్తమానసుడు = గొప్ప మనస్సు కలవాడు, శుకుడు :: 10.1-1104-మత్త.
708) ఉదారయశోనిధి = ఉదార (అధికమైన) యశః (కీర్తి)కి నిధి సముద్రము వంటివాడు, విష్ణువు :: 10.2-81-ఉ.
709) ఉదారి = ఉదారమైన స్వభావము కలవాడు, విష్ణువు :: 3-335-ఉ.
710) ఉదాసీనుండు = దేని యందును జోక్యము చేసికొననివాడు, విష్ణువు :: 3-874-వ.
711) ఉదితవిద్యాతపోయోగయుక్తుడు = ఉద్భవించిన విద్యలు తపస్సు యోగములుతో కూడినవాడు, శివుడు :: 4-138-సీ.
712) ఉద్గాత = యజ్ఞములందు సామవేదగానములను నడపువాడు :: 8-536-సీ.
713) ఉద్దాముడు = స్వతంత్రుడు, విష్ణువు :: 12-1-క.
714) ఉద్ధవుడు = కృష్ణునికి తండ్రి వరుసైన వాడు :: 2-204-సీ.
715) ఉన్నతి = అభివృద్ధి :: 4-28-వ.
716) ఉన్మూలనముచేయుట = మూలాల నుండి నాశనము చేయుట :: 12-45-వ.
717) ఉపదేశము = సాధికారముగ అనువర్తనకు నేర్పుట :: 5.2-53-సీ.; 8-517-వ.
718) ఉపదేశించు = సాధికారముగ అనువర్తనకు నేర్పుట :: 9-78-వ.
719) ఉపద్రష్ట = (సర్వ)సాక్షి, విష్ణువు :: 3-198-సీ.
720) ఉపపన్నసకలశక్తియుతుండు = ఉపపన్న (ఎదుట సిద్ధమైన) సకల (సమస్తమైన) శక్తులు కలవాడు, విష్ణువు :: 4-359-సీ.
721) ఉపవనములు = దేవాలయాదులకు భవనములకు సంబంధించిన వనములు లేదా తోటలు :: 3-37-సీ.
722) ఉపవాసములు = ఆహారమును నియమించుటలు :: 2-214-మ.
723) ఉపవేదములు = 1 ఆయుర్వేదము 2 ధనుర్వేదము 3 గాంధర్వము 4 స్థాపత్యము :: 3-388-వ.
724) ఉపాఖ్యానము = ఇతిహాసము, జరిగినదానికి సంబంధించిన కథనము :: 3-1051-వ.; 4-384-వ.
725) ఉపాథేయము = ఉపాథి (జీవనమునకు ఆధారమైన) భూతము (సాధనము) :: 3-468-క.
726) ఉపాదానకారణము = కుండకు మట్టి బట్టకు దారము ఉపాదానకారణములు :: 7-360-వ.
727) ఉపాధిత్రయము = స్థూల సూక్ష్మ కారణోపాధులు :: 10.1-567-సీ.
728) ఉపాధులు = 1సమిష్ట వ్యష్టి స్థూల సూక్ష్మ కారణదేహములు 2జాగ్రత్త స్వప్న సుషుప్తి అనెడి మూడవస్థలు 3విశ్వ తైజస ప్రాజ్ఞ విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత నామములు మొదలైన వ్యాపారములు :: 10.1-1504-సీ.
729) ఉపాధ్యాయుడు = వేదమును చదివించువాడు :: 4-557-సీ.
730) ఉపాయనంబులు = కానికలు, సాధనకి ఉపయోగించునవి :: 4-460-సీ.
731) ఉపేంద్రుడు = ఇంద్రుని తమ్ముడు, ఆదిత్యుడైన విష్ణుమూర్తి, వామనుడు :: 2-86-వ.; 8-681-వ.; 10.1-236-వ.; 10.2-408-శా.; 10.2-728-ఉ.; 10.2-822-సీ.
732) ఉభయమలములు = స్థూలమలము (నిరుపయోగ ఆహార భాగములు) సూక్ష్మమలము (యోగసాధనలోవిడిచే మలము) :: 2-269-వ.
733) ఉభయలోకములు = ఇహలోక పరలోకములు :: 12-45-వ.
734) ఉమ = అనత్యీత్యుమా అవసంరక్షణే (వ్యుత్పత్తి), రక్షించునామె, పార్వతి :: 8-249-క.; 10.1-1744-ఉ.; 12-39-వ.
735) ఉమానాయకుడు = ఉమ (పార్వతీదేవి) యొక్క నాయకుడు (భర్త), శివుడు. :: 10.2-322-మ.
736) ఉమేశుడు = పార్వతీదేవి భర్త, శివుడు :: 10.2-352-మ.; 10.2-832-క.
737) ఉరగపతి = ఉరగము (పాముల)కు పతి, ఆదిశేషుడు :: 3-323-క.
738) ఉరగము = ఉర (రొమ్ము)చే గము (గమనము గలవి), పాము :: 6-193-క.; 6-385-లగ్రా.
739) ఉరగాదిఫుడు = ఉరగముల (సర్పముల)కు అధిపతి, ఆదిశేషుడు :: 12-6-క.
740) ఉరగాలయము = ఉరగ (పాముల) ఆలయము (నివాసము), పాతాళము :: 9-162-చ.
741) ఉరుక్రముడు = పెద్ద అడుగులిడిన వాడు, వామనావతారుడు, విష్ణువు :: 3-204-సీ.; 4-628-చ.; 6-507-వ.; 7-357-సీ.; 11-77-వ.
742) ఉరుగాయుడు = ఉరు (పెద్ద) కాయుడు (దేహము కలవాడు), ఉరుగాయుడు అను మహావిజ్ఞానిగా అవతరించినవాడు, విష్ణువు :: 11-77-వ.
743) ఉరువిక్రముండు = ఉరు (అత్యధికమైన) పరాక్రమము కలవాడు, విష్ణువు :: 3-1022-చ.
744) ఉరోభాగకౌస్తుభప్రియమణి = ఉరోభాగ (వక్షస్థలమున) కౌస్తుభ (కౌస్తుభమనెడి) ప్రియ (ఇష్టమైన) మణి (మణి గలవాడు), విష్ణువు :: 6-34-క.
745) ఉర్వరాధిపుడు = ఉర్వర (భూమికి) వర (శ్రేష్ఠమైన) అధిపుడు (ప్రభువు), రాజు :: 9-351-మత్త.
746) ఉర్వీజము = ఉర్వి (భూమి యందు) జములు (పుట్టునవి), వృక్షములు :: 10.1-851-మ.
747) ఉర్వీనాథుడు = ఉర్వి (భూమికి) నాథుడు (ప్రభువు), రాజు. :: 8-118-క.; 10.1-456-క.; 10.1-801-క.
748) ఉర్వీభృత్ = భూమిని ధరించువాడు, విష్ణువు :: 3-290-మ.
749) ఉర్వీరమణ = భూమికి భర్త, విష్ణువు. :: 11-104-క.
750) ఉర్వీరుహము = ఉర్వి (భూమి)యందు పుట్టునది, చెట్టు :: 9-333-సీ.
751) ఉర్వీవరుడు = ఉర్వి (భూమి)కి వరుడు, రాజు :: 4-529-క.
752) ఉర్వీవిభుడు = ఉర్వీ (భూమికి) ప్రభువు, రాజు :: 9-203-శా.
753) ఉర్వీశుడు = ఉర్వి (భూమి)కి ఈశుడు, రాజు :: 9-237-సీ.; 9-262-మ.
754) ఉర్వీశ్వరుడు = ఉర్వి (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు. :: 7-102-శా.; 10.1-1109-మ.
755) ఉల్కలు = ఆకాశముననుండి పడెడి రేఖాకార తేజములు :: 6-405-శా.
756) ఉల్బణుడు = ఉబ్బిన వాడు :: 4-26-వ.
757) ఉల్ముకము = మండుతున్న కొఱవి :: 4-390-వ.
758) ఉల్లసద్విభవనేత = ఉల్లసత్ (వికాసవంత మైన) విభవ (వైభవములు గల) నేత (ప్రభువు), బ్రహ్మ :: 6-278-ఉ.
759) ఉశన = వసించుట :: 4-26-వ.
760) ఉశీనరదేశము = ఇప్పటి గాంధార దేశము :: 7-40-వ.
761) ఉష్ణకరుడు = వేడిమి (ఎండ)ను కలిగించెడి వాడు, సూర్యుడు :: 10.2-311-తే.
762) ఉష్ణమరీచి = వేడిగల మరీచి (వెలుగులు కలవాడు), సూర్యుడు :: 10.2-821-వ.
763) ఉష్ణాంశుడు = ఉష్ణము కల అంశ కలవాడు, సూర్యుడు :: 10.2-137-శా.
764) ఊక = ధాన్యము దంచినప్పుడు వచ్చెడి పై పొరలు :: 5.1-129-వ.
765) ఊతులు = కర్మమముల వాసనలు (దూర ప్రభావములు) భవిష్య ప్రాప్తంబులకు ఊతములైనవి కనుక ఊతులు :: 2-262-క.
766) ఊర్జ = కార్తీకమాసము, ఆహారము నుండి పుట్టు బలము :: 4-26-వ.
767) ఊర్జితపుణ్యుడు = ఊర్జిత (పోగు పడిన) పుణ్యుడు, విఘ్నేశ్వరుడు :: 6-4-ఉ.
768) ఊర్జుడు = ఊర్జ (ఉత్సాహము) కలవాడు, కార్తీకమాసము :: 4-390-వ.
769) ఊర్ణ = అల్లిక, సాలెగూడు, కనుబొమల ముడి యందలి సుడి :: 5.2-10-వ.
770) ఊర్ణనాభి = బొడ్డున అరటినార వంటి దారము కలది, సాలెపురుగు :: 11-99-వ.
771) ఊర్ధ్వకటాహము = బ్రహ్మాండము యొక్క పై కప్పు :: 5.2-32-వ.
772) ఊర్ధ్వరేతస్కుడు = ఊర్ధ్వ (పైకి ప్రసరించెడి) రేతస్కులు (రేతస్సు గలవారు), బ్రహ్మచారులు, సనకాదులు :: 3-367-వ.; 4-648-సీ.; 5.1-16-వ.; 5.1-54-వ.; 9-40-సీ.
773) ఊర్ధ్వరేతస్కులైనఋషభపుత్రులు = భరతుని తమ్ముళ్ళు, ఋషభుని నూరుగురు పుత్రులలో ఊర్ధ్వరేతస్కులైన తొమ్మండుగురు కొడుకులు, విదేహ రాజుకు తత్వం చెప్పిన మహానుభావులు - 1. హరి, 2. కవి, 3. అంతరిక్షుడు, 4. ప్రబుద్ధుడు, 5. పిప్పలాహ్వయుడు, 6. అవిర్హోత్రుడు, 7. ద్రమిళుడు, 8. చమనుడు, 9. కరభాజనుడు :: 11-35-వ.
774) ఊర్మిషట్కములు = 1ఆకలి 2దప్పిక 3శోకము 4మోహము 5ముసలితనము 6మరణము అను ఆరు కలతలు :: 3-893-సీ.
775) ఊష్మములు = శ ష స హలు :: 12-30-వ.
776) ఊసరవెల్లి = తొండజాతి తొండకన్న పెద్దది ఐన జంతువు, ఇది రంగులు మార్చుకొనును అని ప్రతీతి :: 10.2-454-సీ.
777) ఋక్కులు = ఋగ్వేదము నందలి స్తోత్ర మంత్రములు :: 3-760-చ.; 12-30-వ.
778) ఋణత్రయము = 1దేవఋణము 2పితృఋణము 3ఋషిఋణము :: 3-856-సీ.; 10.1-1392-సీ.; 10.2-1125-క.
779) ఋణము = చేసిన మేలుకు ఇంకా తీర్చని ప్రతిఫలము :: 10.2-1004-చ.
780) ఋతము = శాశ్వతముగా నిలిచే సత్యము :: 8-624-వ.
781) ఋతువులు = వసంతాది - 1వసంతఋతువు 2గ్రీష్మఋతువు 3వర్షఋతువు 4శరదృతువు 5హేమంతఋతువు 6శిశిరఋతువు :: 5.2-86-వ.
782) ఋత్విక్కు = యజమానినుండి ధనము తీసుకొని యజ్ఞము చేయించువాడు, వీరు 1బ్రహ్మ 2ఉద్గాత 3హోత 4అధ్వర్యుడు 5బ్రహ్మణాచ్ఛంసి 6ప్రస్తోత 7మైత్రావరుణుడు 8ప్రతిప్రస్థాత 9పోత 10ప్రతిహర్త 11అచ్చావాకుడు 12నేష్ట 13అగ్నీధ్రుడు 14సుబ్రహ్మణ్యుడు 15గ్రావస్తుతుడు 16ఉన్నేత :: 9-170-సీ.
783) ఋభువులు = దేవతలు, దేవతలకు కూడ యజింపదగిన దేవుళ్ళు, చాక్షుషమన్వంతరమున దేవతలు, వ్యు, ఋ+భూ+డ కృ.ప్ర., స్వర్గమున ఉండువారు. :: 4-104-వ.
784) ఋషి = శాస్త్రకారుఁడగు ఆచార్యుఁడు, మంత్ర ద్రష్ట. , వ్యు. ఋషీ = గతౌ :: 3-1007-వ.
785) ఋషిఋణము = వేద శాస్త్రాధ్యయనముల ద్వారా తీర్చుకొనునది :: 6-252-వ.
786) ఎండకన్నెఱుగని = ఎండ (సూర్యకిరణముల) కన్ను (చూపునుకూడ) ఎఱుగని (తెలియని), మిక్కిలి సుకుమారమైన :: 8-471-సీ.
787) ఎండమావులు = మధ్యాహ్న సమయమున ఎడారాదుల యందు నీటిచాలు వలె కనబడు నీడలు, భ్రాంతులు, మృగతృష్ణ, మరీచిక :: 7-358-మత్త.; 10.2-752-చ.
788) ఎఱ్ఱన = మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో మూడవవాడు :: 6-11-సీ.
789) ఎలనాగ = యౌవనమున ఉన్నామె, పడతి :: 10.1-73-సీ.; 10.1-1714-ఉ.
790) ఏకదంతుడు = ఏక (ఒకటే) దంతుడు (దంతము గలవాడు), విఘ్నేశ్వరుడు :: 6-4-ఉ.
791) ఏకదశేంద్రియములు = 5జ్ఞానేంద్రియములు (1కన్ను 2ముక్కు 3నాలుక 4చెవి 5చర్మము) 5కర్మేంద్రియములు (1కాళ్ళు 2చేతులు 3నోరు 4గుహ్యేంద్రియము 5గుదము) మరియు 1మనసు మొత్తం 11 :: 4-889-వ.; 10.1-236-వ.; 10.1-572-సీ.
792) ఏకపత్నీవ్రతుడు = జీవితములో ఒకే భార్య అనెడి వ్రతదీక్ష కలవాడు, శ్రీరాముడు :: 9-337-వ.
793) ఏకపాదతానకము = ఒంటికాలితో అడుగులు వేయుట, రాసక్తీడా పారిభాషిక పదము :: 10.1-1084-వ.
794) ఏకపాదులు = ఒకటే మూలము కలవి, చెట్లు :: 4-853-వ.; 11-91-వ.
795) ఏకము = సజాతీయ విజాతీయ స్వ పర భేదరహితమైనది, రెండవది లేనిది, అద్వితీయము :: 10.2-1122-వ.
796) ఏకరశ్మి = మనసునకు, సంకేతము :: 4-771-సీ.
797) ఏకవీరుడు = ఏకైకశూరుడు, మంచినిష్ఠకలవాడు :: 4-460-సీ.
798) ఏకసారథి = బుద్ధికి, సంకేతము :: 4-771-సీ.
799) ఏకాంతి = ఏక (ఒకే) అంతి (అంత్య ఫలము, ముక్తి) మాత్రము కోరెడివాడు, ఆత్మనిష్ఠాపరుడు :: 7-371-వ.
800) ఏకాంతికము = ఆత్మపరమాత్మల ఏకత్వ అనుభవమున ఉండుట, అనన్యభక్తి, అనన్యచింత :: 3-203-దం.
801) ఏకాంతులు = ఉన్నది భగవంతుడు ఒక్కడే అన్న స్థితి లో ఉన్నవారు :: 1-388-సీ.
802) ఏకాకి = శ్రు. ఏకమేవాద్వితీయం బ్రహ్మః, బ్రహ్మ :: 10.1-1236-దం.
803) ఏకాక్షము = పోలుకఱ్ఱ, ప్రధానము, మాయkg mxkslcg :: 4-771-సీ.
804) ఏకాగ్రము = ఒకే దాని యందు కేంద్రీకరింప బడినది :: 2-226-వ.; 2-252-వ.
805) ఏకాదశరుద్రునిఏకాదశస్థానములు = 1. మన్యువు స్థానము చంద్రుడు, 2. మనువు స్థానము సూర్యుడు, 3. మహాకాలుడు స్థానము అగ్ని, 4. మహత్తు స్థానము వాయువు, 5. శివుడు స్థానము జలము, 6. ఋతధ్వజుడు స్థానము ఆకాశము, 7. ఉరురేతసుడు స్థానము పృథ్వి, 8. కాలుడు స్థానము ప్రాణము, 9. భవుడు స్థానము తప్పస్సు, 10. వామదేవుడు స్థానము హృదయము, 11. ధృతవ్రత స్థానము ఇంద్రియములు. :: 3-369-తే.
806) ఏకాదశరుద్రునిభార్యలు = 1. మన్యువు భార్య ధీ, 2. మనువు భార్య వృత్తి, 3. మహాకాలుడు భార్య అశన, 4. మహత్తు భార్య ఉమ, 5. శివుడు భార్య నియుతి, 6. ఋతధ్వజుడు భార్య సర్పి, 7. ఉరురేతసుడు భార్య ఇల, 8. కాలుడు భార్య అంబిక, 9. భవుడు భార్య ఇరావతి, 10. వామదేవుడు భార్య సుధ, 11. ధృతవ్రత భార్య దీక్ష :: 3-369-తే.
807) ఏకాదశరుద్రులు = 1అజుడు 2ఏకపాదుడు3అహిర్బుద్న్యుడు 4త్వష్ట 5రుద్రుడు 6హరుడు 7శంభుడు 8త్రయంబకుడు 9అపరాజితుడు 10ఈశానుడు 11త్రిభువనుడు (మరొక క్రమము) 1అజైకపాదుడు 2అహిర్బుథ్న్యుడు 3త్వష్ట 4రుద్రుడు 5హరుడు 6త్రయంబకుడు 7వృషాకపి 8శంభుడు 9కపర్ది 10మృగవ్యాధుడు 11శర్వుడు (కశ్యపబ్రహ్మ వలన సురభి యందు జన్మించినవారు) :: 2-38-వ.; 3-369-తే.; 5.2-122-సీ.; 11-105-వ.
808) ఏకాదశవృత్తులు = పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు అహంకారము యనెడి వ్యాపారములు పదకొండు (11) :: 5.1-155-వ.
809) ఏకాదశేంద్రియములు = పంచజ్ఞానేంద్రియములును, 1కన్నులు 2ముక్కు 3చెవులు 4నాలుక 5చర్మము పంచకర్మేంద్రియములు, 6కాళ్ళు 7చేతులు 8వాక్కు 9పాయువు 10ఉపస్థు మరియును 11మనస్సు :: 3-1025-వ.; 4-855-వ.; 11-52-వ.
810) ఏకానైకము = శ్రు. ఏకోదేవా బహుధాని విష్టః. :: 10.2-1122-వ.
811) ఏడుజానలమేను = దేహి (ఏ మనిషి అయినా) తన జానతో ఏడుజానల పొడుగు ఉండును అన్నది ఒక సాముద్రికశాస్త్ర ప్రమాణము. :: 10.1-557-సీ.
812) ఏణ = పెద్ద కన్నులు కల నల్ల ఇఱ్ఱి, జింక :: 9-446-మ.
813) ఏణీలోచన = ఏణి (లేడివంటి) లోచన (కన్నులు కలామె), అందగత్తె :: 10.1-1749-వ.; 10.2-170-శా.
814) ఏరూపైనపొందువాడు = జలచర స్థలచర ఉభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతులైనను సూక్ష్మ స్థూలాది రూపములైనను చేపట్టువాడు, విష్ణువు :: 10.2-202-సీ.
815) ఏలతగులన్ = ఎందుకు కూడుట, కూడకూడదు :: 10.2-232-సీ.
816) ఐరావతము = ఇంద్రుని వాహనమైన తెల్లఏనుగు :: 6-359-వ.
817) ఐళుడు = ఇళ (బుధుని భార్య) యొక్క పుత్రుడు, పురూరవుడు :: 2-204-సీ.; 9-375-ఆ.
818) ఒకడు = ఏకమేవాద్వితీయంబ్రహ్మ (శ్రుతి), సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడు బ్రహ్మ, అద్వితీయుడు :: 10.1-567-సీ.
819) ఒక్కచందముకలది = ఎప్పటికిని ఒకే విధముగా ఉండునది, షడ్భావవికారములు లేనిది :: 10.1-126-సీ.
820) ఒక్కడు = ఏకమేవాద్వితీయంబ్రహ్మ (శ్రుతి), సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడు బ్రహ్మ, అద్వితీయుడు :: 10.1-1503-వ.
821) ఒగ్గములు = అవపాతములు - ఏనుగులు మొదలగునవి పడుటకు పైన కఱ్ఱలు కంపలు కప్పి లోపల వెలితిగ నుండు గోతులు :: 1-455-క.
822) ఒడలెఱుగరాదు = గర్వము వలన ఒళ్ళు తెలియదు :: 9-507-క.
823) ఒడ్డోలగము = ఒడ్డు (నిండైన) ఓలగము (సభ) :: 6-491-వ.
824) ఓలములు = మాటులు - వేట కోసము ఏర్పరచిన మరుగు ప్రదేశములు. :: 1-456-క.
825) ఓషధులు = ఓషధయః ఫలకాంతాః, పంట పండగనే చనిపోవునవి. ఓషధులు, ధాన్యము, అరటి మొదలగునవి :: 1-199-వ.; 2-89-వ.; 6-197-సీ.; 7-467-వ.; 8-175-సీ.; 8-706-సీ.; 12-11-వ.
826) ఔత్తరేయుండు = ఉత్తర యొక్క కుమారుడు, పరీక్షితు :: 2-52-వ.
827) ఔప = అభాస, సత్యమనిపించు అసత్యపువి :: 2-196-మ.